Skip to content
జాతీయం వార్తలు

NEET Controversy: నీట్‌ను రద్దు చేయండి.. వైద్య విద్యపై పూర్తి అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలకే ఇవ్వండి.. విజయ్ టీవీకే పార్టీ డిమాండ్

Prajapaksham 22 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
NEET Controversy: నీట్‌ను రద్దు చేయండి.. వైద్య విద్యపై పూర్తి అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలకే ఇవ్వండి.. విజయ్ టీవీకే పార్టీ డిమాండ్

NEET Controversy: నీట్‌ను రద్దు చేయండి.. వైద్య విద్యపై పూర్తి అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలకే ఇవ్వండి.. విజయ్ టీవీకే పార్టీ డిమాండ్

NEET Controversy: దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ (NEET) పరీక్షను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయాలని విజయ్ టీవీకే డిమాండ్ చేసింది. వైద్య విద్యపై పూర్తి అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించాలని తమిళనాడు అధికార పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) డిమాండ్ చేసింది. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ, ఇతర అక్రమాలపై దేశ రాజధాని ఢిల్లీలో సీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష విద్యార్థి సంఘాలు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్న వేళ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న సమయంలో టీవీకే ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

పరీక్ష నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై తాత్కాలిక చర్యలు లేదా విచారణలు జరిపితే సరిపోదని.. వైద్య విద్య ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ కేంద్రీకృత నీట్ విధానాన్నే శాశ్వతంగా రద్దు చేయాలని పార్టీ స్పష్టం చేసింది. వైద్య విద్యతో సహా మొత్తం విద్యా రంగాన్ని రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా నుంచి తొలగించి, తిరిగి రాష్ట్ర జాబితాలోకి చేర్చడమే ఈ సమస్యకు నిజమైన, శాశ్వత పరిష్కారమని తెలిపింది.

ఒకవేళ విద్యను రాష్ట్ర జాబితాలోకి మార్చేందుకు కేంద్రానికి ఏవైనా రాజ్యాంగ లేదా చట్టపరమైన ఆటంకాలు ఉంటే, దానికి తాత్కాలిక పరిష్కారంగా ప్రత్యేక ఉమ్మడి జాబితాను ఏర్పాటు చేసి రాష్ట్రాలకు అధికారాలు కల్పించాలని సూచించింది. దీని ద్వారా సాధారణ విద్యతో పాటు వైద్య విద్యపై కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి నియంత్రణ, హక్కులు లభిస్తాయని వెల్లడించింది. నీట్ సమస్యకు సంబంధించి తమ అధినేత విజయ్ గతంలోనే ఈ పరిష్కార మార్గాన్ని స్పష్టంగా విడమరిచి చెప్పారని ప్రకటనలో గుర్తుచేసింది.

ఇదే సమయంలో తమిళనాడులోని ప్రతిపక్ష డీఎంకే (DMK) వైఖరిపై టీవీకే తీవ్రంగా మండిపడింది. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే రాష్ట్రంలో నీట్‌ను రద్దు చేస్తామని డీఎంకే ప్రజలకు హామీ ఇచ్చిందని.. అయితే సాధ్యం కాని హామీలతో ప్రజలను, ఓటర్లను మోసం చేసే రాజకీయం తాము చేయబోమని విమర్శించింది. కేవలం ఓట్ల కోసమే డీఎంకే అలాంటి అబద్ధపు హామీలు ఇచ్చిందని ఆరోపిస్తూ, రాజ్యాంగపరమైన హక్కులను పునరుద్ధరించడం ద్వారానే నీట్ రద్దు సాధ్యమవుతుందనేది తమ స్థిరమైన నిలకడైన విధానమని టీవీకే స్పష్టం చేసింది.