Skip to content
జాతీయం వార్తలు

ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం… ప్రజాస్వామ్యానికి ప్రమాదం

Prajapaksham 22 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం… ప్రజాస్వామ్యానికి ప్రమాదం

An iron fist against voices of dissent... a threat to democracy.

ఎండి. ఉస్మాన్‌ ఖాన్‌

ప్రజాస్వామ్య ఆరోగ్యాన్ని కొలవాలంటే ఎన్నికల సంఖ్యను కాదు, అధికారా న్ని ప్రశ్నించగల స్వేచ్ఛను చూడాలి. ఏ సమాజంలోనైనా యువత వీధుల్లోకి దిగడం ఒక సాధారణ రాజకీయ సంఘటన కాదు. అది సమాజం లోపల పేరుకుపోయిన అసంతృప్తి బయటపడే క్షణం. ముఖ్యంగా విద్య, ఉపాధి, అవకాశాల వంటి జీవితాన్ని నిర్ణయించే అంశాలపై వేలాదిమంది యువకులు ఒకే స్వరంతో మాట్లాడడం వెనుక తాత్కాలిక ఆవేశం ఉండదు. దీర్ఘకాలంగా పేరుకుపోయిన నిరాశ, అనిశ్చితి, నమ్మకద్రోహం, అవమానం కలిసిన అనుభవం ఉంటుంది. ఉద్యమాలు ఎప్పుడూ ఒక సంఘటనతో పుట్టవు; అనేక నిర్లక్ష్యాల సమాహారంగా పుడతాయి.
ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో కనిపిస్తున్న ఆందోళనను కూడా ఈ నేపథ్యంతోనే అర్థం చేసుకోవాలి. ప్రశ్నాపత్రాల లీకులు, పరీక్షల నిర్వహణలో లోపాలు, నియామకాల ఆలస్యం, ఉపాధి అవకాశాల సంకుచితం – ఇవి విడివిడిగా కనిపించే సమస్యలు కావచ్చు. కానీ యువత దృష్టిలో ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధమున్న ప్రశ్న లు. వ్యవస్థ నిజంగా మా శ్రమను గౌరవిస్తోందా? సంవత్సరాల పాటు పుస్తకాల మధ్య గడిపిన సమయం, కుటుంబాలు చేసిన త్యాగం, భవిష్యత్తుపై పెట్టుకున్న ఆశలు చివరకు అనిశ్చితి ముందర నిలబడితే, ఆ బాధ వ్యక్తిగతంగా మిగలదు. అది సామూహిక అసంతృప్తిగా మారుతుంది.
ఇలాంటి సందర్భాల్లో నిరసన కేవలం హక్కు మాత్రమే కాదు; ప్రజాస్వామ్యం తనను తాను సరిదిద్దుకు నే ప్రక్రియ కూడా. ఎందుకంటే ప్రజలు వీధుల్లోకి రావడం అంటే, వ్యవస్థలో ఎక్కడో సంభాషణ ఆగిపోయిందని అర్థం. ప్రభుత్వ కార్యాలయాల్లో వినిపించని స్వరం చివరకు రోడ్ల మీద వినిపిస్తుంది. చర్చకు అవకాశం తగ్గిన చోటే ఉద్యమాలు పుడతాయి. అందుకే ప్రజాస్వామ్యంలో ప్రతి ఉద్యమాన్ని ముందుగా శాంతిభద్రతల సమస్యగా కాక, ఒక సామాజిక సంకేతంగా చూడడం అవసరం.
ఈ నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ మరోసారి జాతీయ చర్చలోకి రావడం యాదృచ్ఛికం కాదు. అది కేవలం రాజధానిలోని ఒక ప్రదేశం కాదు; భారత ప్రజాస్వామ్య జ్ఞాపకాలతో నిండిన ఒక రాజకీయ స్థలం. రైతు లు, విద్యార్థులు, ఉద్యోగార్థులు, మహిళలు, సామాజిక ఉద్యమకారులు – ఎవరికి అధికార ద్వారాలు మూసుకుపోయాయని అనిపించినా, చివరకు చేరే చిరునామా అదే. అందుకే జంతర్‌ మంతర్‌ను ఒక భౌగోళిక ప్రదేశంగా మాత్రమే చూడలేం. వినిపించని స్వరాలు ఒకదానికొకటి తోడై ప్రజాస్వామ్యా న్ని మేల్కొలిపే ప్రతీకగా దాన్ని చూడాలి.
ప్రతి ఉద్యమం సరైనదే కావచ్చు అనడం ఎంత అతిశయోక్తో, ప్రతి ఉద్యమాన్ని కుట్రగా చిత్రీకరించడం కూడా అంతే ప్రమాదకరం. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు విమర్శలను దుష్ప్రచారంతో కాదు, వాస్తవాలతో ఎదుర్కోవాలి. ప్రశ్నలపై దేశద్రోహం, విదేశీ హస్తం, రాజకీయ ప్రేరేపణ వంటి ముద్రలు వేసే ప్రయత్నం చేసినప్పుడల్లా అసలు సమస్య చర్చ నుంచి తప్పుకుంటుంది. ప్రశ్నించిన వ్యక్తి మీదే విచారణ మొదలవుతుంది. కానీ ప్రశ్న మాత్రం సమాధానం కోసం అలాగే మిగిలి ఉంటుంది. ఇదే నేటి భారత ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న అత్యంత కీలకమైన సవాలు. ప్రభుత్వాల బలం ఎన్నికల్లో సాధించిన మెజారిటీలో మాత్రమే ఉండదు; ప్రజలు అడిగే అసౌకర్యమైన ప్రశ్నలను వినగలిగే ధైర్యంలో కూడా ఉంటుంది. విమర్శలను భరించలేని అధికారం ఎంత బలవంతంగా కనిపించినా, అది అంతర్గతంగా అసురక్షిత భావానికే సంకేతం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అధికారానికి నిజమైన రక్షణ పోలీసు బారికేడ్లు కాదు; ప్రజల విశ్వాసం.
ప్రజాస్వామ్యంలో పార్లమెంట్‌ అత్యున్నత శాసన వేదిక అయితే, వీధి అత్యున్నత ప్రజా వేదిక. ఈ రెండూ పరస్పర ప్రత్యర్థులు కావు; ఒకదానికొకటి పూరకాలు. పార్లమెంట్‌ ప్రజల ఆకాంక్షలను చట్టాలుగా మలచే స్థలం. వీధి, ఆ ఆకాంక్షలు విస్మరించబడినప్పుడు అధికారాన్ని అప్రమత్తం చేసే స్థలం. అందుకే చరిత్రను తిరగేస్తే, గొప్ప సామాజిక మార్పులు ముందుగా వీధుల్లోనే పుట్టి, తరువాత శాసనసభల వరకు చేరినట్టు కనిపిస్తుంది. స్వేచ్ఛ, సమానత్వం, కార్మిక హక్కులు, పౌరహక్కులు, విద్యా సంస్కరణలు – ప్రజాస్వామ్యం
సాధించిన ప్రతి విజయానికి ప్రజా ఉద్యమాల ముద్ర కనిపిస్తుంది.
భారతదేశ చరిత్ర కూడా దీనికి మినహాయింపు కాదు. స్వాతంత్య్ర పోరాటం వీధుల్లోనే మొదలై పార్లమెంటరీ ప్రజాస్వామ్యంగా రూపాంతరం చెందింది. అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)కి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి రావడం భారత రాజకీయాలను కొత్త మలుపు తిప్పింది. రైతు ఉద్యమాలు, అవినీతి వ్యతిరేక ఆందోళనలు, మహిళా ఉద్యమాలు, విద్యార్థి పోరాటాలు – ఇవన్నీ ప్రజాస్వామ్యాన్ని మరింత జవాబుదారీగా మార్చిన అధ్యాయాలే. అందుకే వీధిలో వినిపించే ప్రతి నినాదాన్ని అధికార వ్యతిరేకతగా మాత్రమే చూడడం చరిత్రను అర్థం చేసుకోలేని సంకుచిత రాజకీయ దృష్టికి సంకేతం.
ఈ నేపథ్యంలో ఒక ప్రశ్న తప్పనిసరిగా ఎదురవుతుంది. ప్రజలు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తారు? ప్రతి ఉద్యమం వెనుక రాజకీయ పార్టీలు ఉంటాయా? చరిత్ర చెబుతున్న సమాధానం వేరేలా ఉంటుంది. ప్రజలు మొదట ప్రభుత్వాలను మార్చాలని ఉద్యమించరు. ముందుగా ఒక సమస్య పరిష్కారం కోరుతారు. ఆ సమస్యను నిర్లక్ష్యం చేసినప్పుడు అసంతృప్తి పెరుగుతుంది. ఆ అసంతృప్తిని కూడా పట్టించుకోనప్పుడు అది ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నగా మారుతుంది. చివరికి అదే రాజకీయ ప్రతిఘటనగా రూపాంతరం చెందుతుంది. ఒక
సమస్య నుంచి ప్రారంభమైన ఉద్యమం, పాలనా తీరుపై ప్రజాభిప్రాయంగా మారే ప్రక్రియ అన్ని ప్రజాస్వామ్య దేశాల్లో కనిపించిన చారిత్రక వాస్త వం.
నేటి విద్యార్థి ఉద్యమాలను కూడా ఈ క్రమంలోనే చూడాలి. పరీక్షల్లో పారదర్శకత కోరడం, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేయడం, విద్యా వ్యవస్థపై విశ్వాసాన్ని పునరుద్ధరించాలని కోరడం – ఇవి ప్రజాస్వామ్య విరోధ డిమాండ్లు కావు. ఇవి రాజ్యాంగబద్ధమైన పౌర హక్కులే. వాటికి సమాధానం వాస్తవాలతో, విచారణలతో, బాధ్యతతో రావాలి. కానీ వాటికి బదులు గా అనుమానాలు, ముద్రలు, ప్రచారాలు మాత్రమే వినిపిస్తే, ప్రజల దృష్టిలో వ్యవస్థపై ఉన్న నమ్మకం మరింత దెబ్బతింటుంది.
ఇక్కడే అధికార వ్యవస్థలు తరచూ చేసే ఒక వ్యూహాత్మక తప్పిదం కనిపిస్తుంది. సమస్యను పరిష్కరించడం కంటే, సమస్యను లేవనెత్తిన వారిపైకే చర్చను మళ్లించడం. ఉద్యమం వెనుక ఎవరు ఉన్నారు? ఎవరు ప్రేరేపించారు? అనే ప్రశ్నలు ప్రధానమవుతాయి. కానీ, వేలాదిమంది ప్రజలు ఒకే డిమాండ్‌తో వీధుల్లోకి ఎందుకు వచ్చారు? అనే అసలు ప్రశ్న వెనక్కి వెళ్ళి పోతుంది. ప్రజాస్వామ్యంలో ఇది అత్యంత ప్రమాదకరమైన మలుపు. ఎందుకంటే అక్కడి నుండే సంభాషణ ముగిసి, పరస్పర అనుమానం మొదలవుతుంది.
యువతలో పెరుగుతున్న అసహనం కేవలం ఉద్యోగాల కొరత వల్ల మాత్రమే కాదు, శ్రమకు సరైన గుర్తింపు దొరకడం లేదనే ఆవేదన వల్ల కూడా. ఒక పరీక్ష కోసం సంవత్సరాల పాటు శ్రమించడం, కుటుంబాలు అప్పులు చేసి కోచింగ్‌కు పంపడం, అనేక అవకాశాలను వదులుకోవడం – ఇవన్నీ ఒక యువకుడి జీవితంలో చిన్న విషయాలు కావు. అలాంటి సమయంలో పరీక్షా వ్యవస్థ విశ్వసనీయతపైనే సందేహాలు తలెత్తితే, అది మొత్తం వ్యవస్థ నిష్పాక్షికతపైనే ప్రశ్నగా మారుతుంది.
ప్రభుత్వాలు ఈ సంకేతాలను ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఉద్యమాలను బలప్రయోగంతో కొంతసేపు చెదరగొట్టవచ్చు. రోడ్లను ఖాళీ చేయించవచ్చు. కానీ అసంతృప్తిని సృష్టించిన కారణాలను లాఠీలతో చెదరగొట్టలేరు. ప్రజల మనసుల్లో పేరుకుపోయిన అవిశ్వాసాన్ని దుష్ప్రచారంతో తుడిచేయలేరు. ఒక సమాజం యువత విశ్వాసాన్ని కోల్పోవ డం ఏ ప్రభుత్వానికైనా కనిపించని పెద్ద సంక్షోభం. అలాంటి సంక్షోభాలకు పరిష్కారం శక్తి ప్రదర్శన కాదు; జవాబుదారీతనం, పారదర్శకత, సంభాషణ మాత్రమే.
జంతర్‌ మంతర్‌ ఖగోళ గమనాలను పరిశీలించేందుకు నిర్మించిన స్థలమైనా, కాలక్రమంలో భారత ప్రజాస్వామ్య స్పందనను నమోదు చేసే రాజకీయ ప్రదేశంగా మారింది. అక్కడ వినిపించే నినాదాలు కేవలం ఆనాటి కోపాన్ని మాత్రమే కాక, సమాజంలో పేరుకుపోతున్న అసంతృప్తికి రాజకీయ రూపాన్ని ఇస్తాయి. అందుకే జంతర్‌ మంతర్‌ నుంచి పార్లమెంట్‌ వైపు కదిలే అడుగులు ప్రజాస్వామ్యంలో ఒక ప్రతీకాత్మక ప్రయాణం. దేశ అత్యున్నత ప్రజాస్వామ్య సభకు, ప్రజల ఆవేదన చేరాలనే ఆకాంక్షకు అది ప్రతిరూపం. ఆ స్వరం వీధుల్లో ఎక్కువసేపు నిలవడం, శాసనవ్యవస్థలో సంభాషణ బలహీనపడిందనే సంకేతం.
భారత ప్రజాస్వామ్యం కేవలం ఎన్నికలతో నడిచే వ్యవస్థ కాదు. ఎన్నికలు ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాయి; కానీ ప్రజాస్వామ్యాన్ని సజీవంగా ఉంచేది నిరంతర ప్రజా భాగస్వామ్యం. ఓటు వేసిన రోజుతో పౌరుడి బాధ్యత, ఎన్నికల్లో విజయం సాధించిన రోజుతో ప్రభుత్వ జవాబుదారీతనం ముగిసిపోవు. నిర్ణయాలు కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమవుతున్నాయనే అభిప్రాయం బలపడుతున్న వేళ, ప్రజాస్వామ్య సంస్థల పాత్ర, స్వతంత్ర మాధ్యమాల బాధ్యత, పౌర సమాజ చైతన్యం మరింత కీలకంగా మారతాయి. బలమైన ప్రజాస్వామ్యం అంటే కేవలం బలమైన ప్రభుత్వం కాదు; బలమైన సంస్థలు, స్వేచ్ఛగా పనిచేసే వ్యవస్థలు, భయపడకుండా ప్రశ్నించే పౌర సమాజం.
ఇక్కడ ప్రతిపక్షాల పాత్రను కూడా విస్మరించలేం. ప్రజల సమస్యలను శాసనసభల్లో బలంగా వినిపించడం, వీధుల్లో వ్యక్తమవుతున్న ఆవేదనను రాజ్యాంగబద్ధమైన రాజకీయ చర్చగా మలచడం, ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టడం ఇవే ప్రతిపక్ష ప్రజాస్వామ్య రాజకీయాల అసలు ప్రమాణాలు. ఈ పాత్ర బలహీనపడినప్పుడు ప్రజా ఉద్యమాలే ప్రత్యామ్నాయ రాజకీయ భాషగా మారడం సహజం.
అయితే ఉద్యమాలకూ కొన్ని బాధ్యతలు ఉంటాయి. శాంతియుత నిరసన, రాజ్యాంగబద్ధమైన పోరాటం, ప్రజా ప్రయోజనాల పట్ల నిబద్ధత ద్వారానే ఉద్యమాలకు విశ్వసనీయత, నైతిక బలం లభిస్తాయి.ఈ రోజు దేశం ఎదుర్కొంటున్న అసలు ప్రశ్న ఏమిటంటే, ప్రజల అసంతృప్తిని రాజకీయ శత్రుత్వంగా చూడడమా..లేక ప్రజాస్వామ్య హెచ్చరికగా అర్థం చేసుకోవడ మా.. అధికారాన్ని సవాలు చేసే ప్రతి స్వరం ప్రభుత్వానికి వ్యతిరేకం కాకపోవచ్చు; కొన్నిసార్లు అదే స్వరం ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరిచే అవకాశాన్ని ఇస్తుంది. ప్రజాస్వామ్యం తనను తాను సరిదిద్దుకునే శక్తిని కోల్పోకుండా ఉండాలంటే మూలం ప్రజలే, వారి ప్రశ్నలే. ఏ ప్రభుత్వ మూ కేవలం అధికారంతో శాశ్వతంగా ఉండలేదు, బలప్రయోగంతో ప్రజల మనసులను గెలుచుకోలేదు. అధికారం చట్టాలను అమలు చేయగలదు కానీ విశ్వాసాన్ని ఆదేశించలేదు; భయాన్ని సృష్టించగలదు కానీ సమ్మతిని కొనలేదు.
ఈ రోజు దేశంలోని విద్యార్థులు, యువత అడుగుతున్న ప్రశ్నలు వ్యవస్థ నిష్పాక్షికతను, శ్రమకు దక్కే న్యాయాన్ని, ప్రశ్నించే హక్కు భద్రతను పరీక్షిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు దేశ ప్రజాస్వామ్య సంస్కృతిని నిర్ణయిస్తాయి. నిరసన అనేది వ్యవస్థ వైఫల్యానికి సంకేతం మాత్రమే కాదు, వ్యవస్థ ఇంకా సజీవంగా ఉందనడానికి కూడా నిదర్శనం. ప్రజలు ప్రశ్నించడం మానేసినప్పు డు, భయాన్ని విధిగా భావించినప్పుడే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది.
భారత రాజ్యాంగం ‘మేము భారత ప్రజలం…’ అని ప్రారంభమవుతుంది. ఈ దేశంలో సార్వభౌమాధికారం ప్రజలదే. పార్లమెంట్‌ ఆ సార్వభౌమాధికారానికి ప్రతినిధి మాత్రమే, ప్రభుత్వం ప్రజల తరఫున పాలించే వ్యవస్థ మాత్రమే.ప్రజాస్వామ్యం కేవలం ఓట్లతో గెలిచేది కాదు, విశ్వాసాన్ని నిలబెట్టుకునేది. ఆ విశ్వాసం నిలవాలంటే అధికారానికి వినే సంస్కారం, ప్రతిపక్షానికి బాధ్యతాయుతమైన దృష్టి, పౌర సమాజానికి ప్రశ్నించే ధైర్యం ఉండాలి. నేడు దేశ వీధుల్లో వినిపిస్తున్న స్వరాలు భారత ప్రజాస్వామ్యం తన గురించి తాను వేసుకుంటున్న ప్రశ్నలు. వాటికి సమాధానం వెతకడం అందరి బాధ్యత. ఎందుకంటే నిరంతరం ప్రశ్నించే పౌర చైతన్యమే ప్రజాస్వామ్యానికి శాశ్వత ప్రాణవాయువు.

ట్యాగ్‌లు: CJP CJP protest CJP protest Delhi