Skip to content
జాతీయం వార్తలు

Mahapanchayat in Delhi: భారత్-అమెరికా ట్రేడ్ ఒప్పందంపై రైతుల ఆగ్రహం.. నేడు ఢిల్లీలో మహా పంచాయత్‌.. పంజాబ్ రైతుల భారీ ర్యాలీ..

Prajapaksham 21 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Mahapanchayat in Delhi: భారత్-అమెరికా ట్రేడ్ ఒప్పందంపై రైతుల ఆగ్రహం.. నేడు ఢిల్లీలో మహా పంచాయత్‌.. పంజాబ్ రైతుల భారీ ర్యాలీ..

Mahapanchayat in Delhi: భారత్-అమెరికా ట్రేడ్ ఒప్పందంపై రైతుల ఆగ్రహం.. నేడు ఢిల్లీలో మహా పంచాయత్‌.. పంజాబ్ రైతుల భారీ ర్యాలీ..

Mahapanchayat in Delhi: భారత్‌-అమెరికా మధ్య కుదురుతున్న ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా పంజాబ్‌తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులు నేడు ఢిల్లీలో కదం తొక్కనున్నారు. న్యూఢిల్లీలోని కిసాన్‌ ఘాట్‌ వద్ద ‘మహా పంచాయత్‌’ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. దేశ్‌ బచావో మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా దాదాపు 550కి పైగా రైతు సంఘాలు, సామాజిక సంస్థలు, కార్మిక వర్గాలు ఈ ఆందోళనలో భాగస్వామ్యమవుతున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ ఒప్పందం వల్ల దేశంలోని చిన్న రైతులు, కార్మికులు, చిన్న తరహా వ్యాపారుల ఉపాధి తీవ్రంగా దెబ్బతింటుందని రైతు నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీ నాయకుడు జర్మన్‌జిత్‌ సింగ్‌ బండాలా తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాలో భారీ విస్తీర్ణంలో వేలాది ఎకరాలలో ప్రభుత్వ అపారమైన సబ్సిడీలతో యంత్రాల ఆధారిత వ్యవసాయం సాగుతుంది. కానీ భారతీయ రైతుల్లో అత్యధికులు సగటున కేవలం రెండు నుండి రెండున్నర ఎకరాల చిన్న కమతాలనే కలిగి ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను భారత మార్కెట్లోకి అనుమతిస్తే.. ఇక్కడి చిన్న రైతులు ఆ ఉత్పత్తులతో పోటీ పడలేక తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతారని, వ్యవసాయ ఆధారిత ఆదాయాలు దారుణంగా పడిపోతాయని రైతు నాయకులు హెచ్చరిస్తున్నారు.

గత ప్రభుత్వాలు విదేశీ ఒత్తిళ్లకు లొంగకుండా దేశీయ వ్యవసాయ రంగాన్ని పరిరక్షించాయని, కానీ ప్రస్తుత ప్రభుత్వం అమెరికా ఒత్తిడికి తలొగ్గి ఈ ఒప్పందంతో ముందుకు వెళ్తోందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని, లేని పక్షంలో తమ ఆందోళనలను దేశవ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి నిరసనకారులను అడ్డుకుంటున్నప్పటికీ, తమ డిమాండ్లు నెరవేరేవరకు శాంతియుత పోరాటాన్ని కొనసాగిస్తామని రైతు నేతలు స్పష్టం చేస్తున్నారు.