Skip to content
లైఫ్ స్టైల్ వార్తలు

Covid Vaccine వల్ల గుండెపోటు, రక్తం గడ్డకట్టే ప్రమాదం లేదు: ICMR కీలక అధ్యయనం

Prajapaksham 14 Jul 2026 1 నిమిషాల పఠనం లైఫ్ స్టైల్
Covid Vaccine వల్ల గుండెపోటు, రక్తం గడ్డకట్టే ప్రమాదం లేదు: ICMR కీలక అధ్యయనం

Heart Attack Risk on Covid Vaccine: కోవిడ్ వ్యాక్సిన్‌తో గుండెపోటు, రక్తం గడ్డకట్టే ప్రమాదం ఏమీ లేదు: ఐసీఎంఆర్ (ICMR) అధ్యయనంలో కీలక విషయాలు..

Heart Attack Risk on Covid Vaccine: కరోనా వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో గుండెపోటు (హార్ట్ అటాక్), రక్తం గడ్డకట్టే (థ్రాంబోసిస్) కేసులు పెరుగుతున్నాయంటూ గత కొంతకాలంగా సాగుతున్న ప్రచారానికి భారత వైద్య పరిశోధన మండలి (ICMR) శాస్త్రీయ ఆధారాలతో పుల్ స్టాప్ పెట్టింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ (NIE) సంయుక్తంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన తాజా పరిశోధనలో కోవిడ్ టీకాలకు.. గుండెపోటు లేదా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే సమస్యలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

ఐసీఎంఆర్-ఎన్ఐఈ డైరెక్టర్ డాక్టర్ మనోజ్ మురేకర్ నేతృత్వంలో దేశంలోని సుమారు 25 ప్రముఖ ఆసుపత్రుల్లో ఈ అధ్యయనం నిర్వహించారు. పరిశోధకులు తమ అధ్యయనంలో భాగంగా 2021-2023 మధ్య కాలంలో నమోదైన 432 మయోకార్డియల్ (గుండెపోటు) కేసులను.. 767 థ్రాంబోటిక్ (రక్తం గడ్డకట్టే) కేసులను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా 18 నుండి 45 ఏళ్ల మధ్య వయసున్న యువతపై ఈ కేస్ స్టడీ నిర్వహించారు. ఒకటి లేదా రెండు డోసుల కోవిడ్ టీకా తీసుకున్న వారిలో ఈ తరహా ప్రాణాంతక సమస్యలు తలెత్తడానికి వ్యాక్సిన్ ఎంతమాత్రం కారణం కాదని వారి పరిశోధనలో తేలింది.

రక్తం గడ్డకట్టడం లేదా గుండెపోటు రావడానికి గల అసలు కారణాలు వారి వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులు, జీవనశైలిలోనే ఉన్నాయని ఐసీఎంఆర్ నివేదిక వెల్లడించింది. కోవిడ్ మహమ్మారి కంటే ముందు నుంచే ధూమపానం (స్మోకింగ్) అలవాటు ఉండటం.. గతంలో ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడటం లేదా కుటుంబ సభ్యులలో గుండె సంబంధిత లేదా రక్త ప్రసరణ సమస్యల చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ) ఉండటం వల్లే ఈ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

భారతదేశంలో మే 2023 నాటికి అర్హులైన జనాభాలో దాదాపు 97 శాతం మంది కనీసం ఒక డోసు కోవిడ్ టీకా తీసుకోగా.. 90 శాతం మంది రెండు కోవిడ్ డోసులు పూర్తి చేసుకున్నారు. అలాగే ముందస్తు జాగ్రత్తగా హెల్త్‌కేర్ సిబ్బందికి, వృద్ధులకు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మూడవ డోస్ (బూస్టర్ డోస్) కూడా అందించారు. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ వల్ల ప్రజలకు ఎంతో మేలు జరిగిందని, వైరస్ తీవ్రత తగ్గడంతో పాటు ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య, దీర్ఘకాలిక కోవిడ్ సమస్యలు గణనీయంగా తగ్గాయని భారత్‌తో పాటు అంతర్జాతీయ అధ్యయనాల ఆధారాలు కూడా స్పష్టం చేస్తున్నాయని ఐసీఎంఆర్ పేర్కొంది.