Lenin: అఖిల్ లెనిన్ బాలయ్య సినిమాకు కాపీనా..?
అక్కినేని అఖిల్‌కు తొలి బ్లాక్‌బస్టర్ అందించిన సినిమా లెనిన్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో దూసుకెళుతోంది. టికెట్ రేట్లతోనే సినిమా రిలీజ్ అవ్వడంతో పాటు మార్కెట్లో పెద్దగా పోటీ కూడా లేకపోవడంతో లెనిన్ సినిమాకు తిరుగులేకుండా వసూళ్లు వస్తున్నాయి.
అక్కినేని అఖిల్ పర్ఫామెన్స్‌తో పాటు, చక్కటి ఓల్డ్ స్కూల్ కథా కథనం, అలాగే దర్శకుడు కమిట్‌మెంట్, హీరోయిన్ భాగ్యశ్రీ అందచందాలు, సంగీత దర్శకుడు తమన్ అందించిన మ్యూజిక్ మంత్రం అన్నీ కలిపి లెనిన్ బ్లాక్‌బస్టర్ విజయం అందుకునేలా చేశాయి.
అటు వరల్డ్‌వైడ్‌గా ఇప్పటికే విడుదలైన మూడు రోజుల్లోనే సినిమా 50 కోట్ల మార్కును దాటి ముందుకు దూసుకుపోతోంది. అక్కినేని అఖిల్ కెరీర్‌లో ఇదే అతిపెద్ద విజయంగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
ఇక సినిమా విషయానికి వస్తే పూర్తిగా గ్రామీణ వాతావరణంలో తీసినటువంటి సినిమా కావడం, ఒక వింటేజ్ మోడల్ కథనం కావడంతో ప్రేక్షకులు కొత్త కథ ప్రపంచంలోకి ప్రవేశించారు. నిజానికి తెలుగు సినిమాకు ఈ ఓల్డ్ స్టైల్ ట్రీట్‌మెంట్ ఏమీ కొత్తకాదు. ఇదే కథతో సుమారు 20 ఏళ్ల క్రితం చాలా కథలు వచ్చాయి.
కానీ తెలుగు సినిమా గ్రౌండ్ కోల్పోతూ హీరో ఎలివేషన్‌లను నమ్ముకొని కథను వదిలేసి, నేల విడిచి సాము అనే చందంగా తయారవడంతో, ప్రస్తుతం థియేటర్లకు జనాలు లేక వెలవెలబోతోంది. సరిగ్గా ఇదే సమయంలో లెనిన్ సినిమా చక్కగా ఆరు పాటలు, మూడు ఫైట్లు ఫార్ములాతోపాటు గ్రామీణ నేపథ్యంలో ఉన్న కథాకథనంతో ముందుకు సాగి మంచి విజయం అందుకుంది.
ఇక అసలు విషయానికి వస్తే లెనిన్ సినిమాలో కీలకమైన పాయింట్ బాలయ్య సినిమా నుంచి కాపీ కొట్టారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే లెనిన్ సినిమాలో అత్యంత కీలకమైన ఘట్టం, కథను మలుపు తిప్పిన సన్నివేశం ఏదైనా ఉంది అంటే హీరో అఖిల్ చేతిలో హీరోయిన్ చనిపోవడమే.
అందుకు దారి తీసిన పరిస్థితులు, సన్నివేశాలు, కథాకథనం ప్రేక్షకులను కట్టిపడేశాయి అని చెప్పవచ్చు. నిజానికి ఈ సన్నివేశమే లెనిన్ కథకు ఆత్మ అని చెప్పవచ్చు. హీరో చేతిలో హీరోయిన్ ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అనే పాయింట్ మీదనే దర్శకుడు ఈ కథను అల్లుకున్నాడు. ఆ తర్వాత రివెంజ్ డ్రామా మొత్తం సినిమాలో చూడవచ్చు.
అయితే ఈ కథ గతంలో నందమూరి బాలకృష్ణ నటించిన కృష్ణబాబు సినిమాలో కూడా ఇదే తరహా సీన్ ఉండటం గమనార్హం. ఆ సినిమాలో కూడా హీరో నందమూరి బాలకృష్ణ కళ్లల్లో విలన్లు కారంపొడి చల్లడంతో, చేతిలో కత్తి ఉన్న బాలయ్య పొరపాటున హీరోయిన్ మీనాను హత్య చేస్తాడు. ఆ తర్వాత బాలయ్యను అరెస్టు చేస్తారు.
సరిగ్గా ఇదే సీన్ లెనిన్ సినిమాలో కూడా రిపీట్ అవడంతో అటు సినీ వర్గాల్లో లెనిన్ సినిమాను బాలయ్య సినిమా నుంచి కాపీ కొట్టారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
అయితే నిజానికి కృష్ణబాబు సినిమాలో కథ, లెనిన్ సినిమా కథ వేరువేరు అయినప్పటికీ సన్నివేశం మాత్రం హీరో చేతిలో హీరోయిన్ చనిపోవడం, అందుకు దారి తీసిన కారణాల చుట్టూ ఈ రెండు సినిమాలు కథ అల్లుకోవడం చూడవచ్చు.
నిజానికి ఇది పూర్తిగా కాపీ అని అనలేము. ఒక సన్నివేశం నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్న కథగా చెప్పవచ్చు అని సినీ పండితులు చెబుతున్నారు.