Skip to content
తెలంగాణ వార్తలు

నిస్వార్థ రాజకీయాలకు నిలువెత్తు శిఖరం ‘ఉజ్జిని’

Prajapaksham 12 Jul 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
నిస్వార్థ రాజకీయాలకు నిలువెత్తు శిఖరం ‘ఉజ్జిని’

నిస్వార్థ రాజకీయాలకు నిలువెత్తు శిఖరం ‘ఉజ్జిని’

ఉజ్జిని రత్నాకర్‌రావు

ఉజ్జిని నారాయణరావు మన నుండి దూరమై నేటికి పది సంవత్సరాలు అవుతుంది. వారు స్వయంగా చింతపల్లి మండల కేంద్రంలో వెయ్యి గజాల స్థలం సేకరించి అందులో కమ్యూనిస్టు పార్టీ ఆఫీసు కోసం నాలుగు గదులతో శాశ్వతంగా ఆఫీసు నిర్మాణం చేసినారు. ఆ ఆఫీసును ఆధునీకరించి ‘కామ్రేడ్‌ నారాయణరావు భవన్‌’గా నామకరణం చేయాలని దేవరకొండ నియోజకవర్గ కమిటీ నిర్ణయించింది.

ఆ మేరకు నేడు వారి 10వ వర్ధంతి సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆ భవన్‌కు కామ్రేడ్‌ నారాయణరావు భవన్‌గా నామకరణం చేయనున్నారు. ఈ సందర్భంగా ‘ఉజ్జిని నారాయణరావు ఉద్యమ ప్రస్థానం’ పేరుతో వారితో ఐదు దశాబ్దాలుగా ఉద్యమ అనుబంధం ఉన్న ఉజ్జిని రత్నాకర్‌రావు రూపొందించిన పుస్తకాన్ని మండల కేంద్రంలో సుమంగళి ఫంక్షన్‌ హాల్‌లో ఆవిష్కరించనున్నారు.

ఉజ్జిని నారాయణరావు ఉద్యమమే ఊపిరిగా, పోరాటమే బాటగా, కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండా చేతబట్టి ఆరు దశాబ్దాలపాటు పేద ప్రజల కోసం, కష్టజీవుల కోసం నిరంతరం ఉద్యమాలు నడిపిన నాయకుడు ఉజ్జిని.

ఆయన జీవితకాలమంతా అట్టడుగు ప్రజల హక్కుల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటం చేశారు. సైద్ధాంతిక నిబద్ధత గల ఉజ్జిని నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం నుంచి తొలిసారిగా 1967లో సిపిఐ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో సైకిల్‌ మోటార్‌తోనే ప్రచారం చేశారు. ఆనాడు కమ్యూనిస్టు పార్టీ చీలికతో ఓడిపోయినప్పటికీ తిరిగి 1972లో కూడా పోటీ చేసి ఓటమి ఎదురైనప్పటికీ నిరంతరం ప్రజల్లోనే కొనసాగారు. ఆ తర్వాత 1985, 1989, 1994లో వరుసగా మునుగోడు నియోజకవర్గం నుంచి గెలుపొంది హ్యాట్రిక్‌ సాధించారు.

నిజాం రాచరిక వ్యవస్థకు మూల స్తంభాలుగా ఉన్న జాగీర్దారీ, వతందారీ, భూస్వామ్య, దొరల దౌర్జన్యాలను ఎదిరించాలని కమ్యూనిస్టు పార్టీ (ఆంధ్ర మహాసభ) పిలుపుతో దేవరకొండ తాలూకాలో నారాయణరావు గారు తన సహచరులైన పల్లా పర్వతరెడ్డి, బొడ్డుపల్లి రామశర్మ, పైగిడిమర్రి మల్లప్ప తదితరులతో కలిసి 1950లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. ఆనాడు కమ్యూనిస్టు పార్టీపై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ దళాలు రహస్యంగా దేవరకొండ ప్రాంతానికి రావడంతో వారితో సంబంధాలు ఏర్పాటు చేసుకొని దళాలకు అన్ని విధాలుగా షెల్టర్స్‌ సహకారం అందిస్తూ అడవిబాట పట్టారు. భూస్వామ్య వ్యతిరేక కార్యకలాపాలను కొనసాగించారు.

సాయుధ పోరాట విరమణతో 1952లో జరిగిన మొదటి ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ (పిడిఎఫ్‌) అభ్యర్థులను గెలిపించుకునేందుకు కృషి చేశారు. ఆనాటి పాత దేవరకొండ తాలూకాలోని పెద్దమునగల్‌, దేవరకొండ, చిన్నకొండూరు నియోజకవర్గాలలో పిడిఎఫ్‌ అభ్యర్థులను గెలిపించుకున్నారు.

1953లో సిపిఐ దేవరకొండ తాలూకా నిర్మాణ మహాసభ జరిపి దానికి కార్యదర్శిగా ఎన్నికై 1968 వరకు, తిరిగి 1972 నుండి 1982 వరకు తాలూకా కార్యదర్శిగా పనిచేశారు.

భూ పోరాటాలు :

కమ్యూనిస్టు పార్టీ పిలుపుతో దున్నేవానికి భూమి నినాదంతో ప్రభుత్వ బంచరాయి భూములు, భూస్వాముల కింద అక్రమంగా ఉన్న భూములు, చెట్లు లేని అడవి బంజరు భూములను గుర్తించి దేవరకొండ తాలూకాలో వివిధ గ్రామాలలో 10,000 ఎకరాల భూములను భూమిలేని పేదలతో ఆక్రమింపజేసి వారికి పట్టాలు వచ్చేంతవరకు ఉద్యమాలు నడిపించారు.

ఇందులో ప్రస్తుత చింతపల్లి మండలంలోని పోలేపల్లి రాంనగర్‌ భూస్వామి శీలం అల్వాల్‌రెడ్డి స్వాధీనంలో ఉన్న 600 ఎకరాల భూములను పంచారు. శివన్నగూడెం, కుదాబక్షిపల్లి గ్రామాల్లోని భూస్వాముల భూములపై పోరాటం చేసి భూములను ఇప్పించారు.

శివన్నగూడెం, సగంపేట, మెల్లవాయి, మధులాపురం తదితర గ్రామాలలో దేవాలయ భూములు భూస్వాముల చేతుల్లో ఉండేవి. అట్టి భూములను భూమిలేని పేదలకు ఇవ్వాలని దేవాలయ భూముల పోరాటాన్ని నడిపించి వందలాదిమంది పేదలకు ఇప్పించటంలో నారాయణరావు కృషి మరువలేనిది.

ఎక్కడ ప్రభుత్వ భూములు, సీలింగ్‌ భూములు, అటవీ, దేవాదాయ భూములు, చెరువు శిఖం భూములు ఉన్నా భూస్వాముల నుండి బయటకు తీసి అవి పేదలకు చెందాలని పోరాటాలకు నడుంబిగించిన భూ పోరాట యోధుడు ఉజ్జిని.

ఆనాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి పెంచిన అదనపు భూమి శిస్తులకు వ్యతిరేకంగా సత్యాగ్రహాలు చేపట్టాలని కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిన పిలుపుతో దేవరకొండ తహసీల్దార్‌ కార్యాలయం ముందు 60 రోజుల పాటు రోజు 4-5 గ్రామాల నుంచి రైతులను సమీకరించి సత్యాగ్రహం చేపడుతూ శిస్తు తగ్గించుకోవడంలో ప్రముఖ పాత్ర నిర్వహించారు. రక్షిత కౌలుదారుల సాగులో ఉన్న భూములను వారికి పట్టాలు ఇప్పించడంలో ప్రముఖ పాత్ర పోషించారు.

ఆనాడు గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని ఆసరా చేసుకుని అతి తక్కువ వేతనాలు, కూలీలు ఇస్తుండేది. గ్రామాల్లో కూలి సంఘాలను ఏర్పాటు చేసి కూలి రేట్లు పెంచడంలోనూ, జీతగాళ్లు (పాలేర్లకు) జీతాలు పెంచడంలోనూ ఉద్యమాలు నడిపించారు.

చాలా గ్రామాలలో ఆబ్కారీ విధానం (కల్లు-సారాయి దుకాణాల వేలం) ఉండేది. ఈ అరాచక విధానానికి వ్యతిరేకంగా రాష్ట్ర గీతపనివారల సంఘం అధ్యక్షులు బి. ధర్మబిక్షం సహకారంతో తాలూకాలో గీత కార్మికులను సంఘటితం చేసి సంఘాలు పెట్టి ‘గీసే వానికి చెట్టు’ విధానం కొరకు గీతపనివారల సంఘాలు ఏర్పాటు చేసి తాలూకాలో వేలములను బహిష్కరించి వేలం లేని విధంగా కార్మికులకు ఇప్పించారు.

కరువు పీడిత ప్రాంతంగా ఉన్న దేవరకొండ తాలూకాకు కృష్ణా జలాలు అందించాలని, అందుకు ఎస్‌ఎల్‌బీసీ (శ్రీశైలం ఎడమ గట్టు సొరంగం) చేపట్టాలని, కమ్యూనిస్టు పార్టీ ద్వారా అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేపట్టడం జరిగింది. మునుగోడు నియోజకవర్గం శాసనసభ్యులుగా ఫ్లోరిన్‌ పీడిత గ్రామాలకు శాశ్వత రక్షిత మంచినీటి పథకం చేపట్టాలని ఉద్యమించి కృష్ణా జలాలను 90% గ్రామాలకు ఇప్పించడం జరిగింది.

ఇప్పటి రాజకీయాల్లో ధనబలం, అధికార ప్రదర్శన, ఆధిపత్యం పెరిగింది. విలువలకు తిలోదకాలు ఇచ్చి పార్టీ కండువా మార్చడం సాధారణమైంది. ఓటర్లను ప్రలోభపెట్టే ధోరణి విస్తరించింది. పదవిని సంపాదన మార్గంగా వినియోగించే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితులకు ఉజ్జిని జీవితం పూర్తిగా వ్యతిరేకం.

నిరంతరం ప్రజలలో ఉండేవారు :

జనబలం అసలైన బలమని నమ్మేవారు. ప్రజలలో ఉండేవారు. ప్రజల మధ్యలో ఉండటం, తిరగడం నాయకత్వానికి మూలమని చాటారు. పారదర్శకత ప్రజా విశ్వాసాన్ని పెంచుతుందని వివరించారు. నిబద్ధతతో సేవ చేస్తే గౌరవం స్వయంగా వస్తుందని నిరూపించారు. ప్రజా ప్రతినిధి అంటే అధికార ప్రదర్శన కాదు. సేవాభావం కావాలి. నైతిక విలువలు రాజకీయాలకు ప్రామాణికం కావాలి. ప్రజల సమస్యల పరిష్కారం లక్ష్యంగా ఉండాలి. ఈ మార్గాన్ని చూపిన ఆదర్శ నాయకుడు ఉజ్జిని నారాయణరావు.

శాసనసభ్యుడిగా ఉన్నప్పటికీ మొదటి టర్మ్‌ పూర్తిగా బస్సులోనే తిరిగేవారు. రెండవ టర్మ్‌లో జీపులో అంగరక్షకులు లేకుండా తిరిగేవారు. ఆ తర్వాత మూడవ టర్మ్‌లో ఎంబాసిడర్‌ కారు వాడారు.

సిపిఐలో ఆరు దశాబ్దాల పాటు నల్లగొండ జిల్లా రైతు సంఘం అధ్యక్షులుగా, రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులుగా, దేవాదాయ భూముల సాగుదార్ల రైతు సంఘం అధ్యక్షులుగా, ప్రజాప్రతినిధులుగా పనిచేసి తన 90వ ఏట వృద్ధాప్యంతో 2016 జులై 13న కన్నుమూశారు.

వారు మన నుండి దూరమై 10 సంవత్సరాలు అవుతున్నా దేవరకొండ తాలూకా ప్రజలు, మునుగోడు నియోజకవర్గ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉన్నారు. ప్రజల కోసం బతికిన వారు ఎల్లకాలం జీవిస్తారనే సత్యానికి ఉజ్జిని జీవితం నిలువెత్తు నిదర్శనం.

ట్యాగ్‌లు: CPI Telangana