నైపుణ్య యువతే దేశ భవిత!
world population day
ఆచార్య బుర్ర మధుసూదన్ రెడ్డి
నేడు ప్రపంచ జనాభా దాదాపు 8.2 బిలియన్లు లేదా 820కోట్లు చేరింది. 1800ల్లో ప్రపంచ జనాభా 1బిలియన్ ఉండగా, 1987లో 5 బిలియన్ల మార్కు దాటడం, 2011లో 7 బిలియన్లు చేరడం చూసాం. 2026లో ప్రపంచ జనాభా 8.3 బిలియన్లకు చేరడం, 2030 నాటికి 8.5 బిలియన్లకు పెరగడం, 2050 నాటికి 9.7 బిలియన్లు కావచ్చని అంచనా వేస్తున్నారు. 2050 నాటికి ప్రపంచ జనాభాలో 66 శాతం వరకు పట్టణ జనాభా మాత్రమే ఉండవచ్చు. నేడు భారత జనాభా 1.464 బిలియన్లు లేదా 146.4 కోట్లు చేరి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాలో వరుసగా భారత్ (146.4 కోట్లు), చైనా(141.6 కోట్లు), అమెరికా(34.7 కోట్లు), ఇండోనేషియా(28.6 కోట్లు), పాకిస్థాన్(25.5 కోట్లు), నైజీరియా(23.8కోట్లు), బ్రెజిల్(21.3కోట్లు), బంగ్లాదేశ్(17.6కోట్లు), రష్యా(14.4కోట్లు), ఇథియో పియా(13.6 కోట్లు) దేశాలు ఉన్నాయి. రాష్ట్రాల జాబితాలో 3.85 కోట్ల జనాభాతో 12వ స్థానం లో తెలంగాణ నిలిచింది. తెలంగాణలోని 33 జిల్లాల్లో హైదరాబాద్ జిల్లా 39 లక్షలతో, ఎపిలోని 26 జిల్లాల్లో తూర్పు గోదావరి జిల్లా 51 లక్షలతో ముందు ఉన్నాయి.
ప్రపంచ జనాభా దినం-2026 ఇతివృత్తం:
11 జూలై 1987 రోజున ప్రపంచ జనాభా 500 కోట్ల లేదా 5 బిలియన్ల మార్కు చేరడానికి (ఐదు బిలియన్ల దినం లేదా ఫైవ్ బిలియన్ డే) గుర్తుగా ప్రతి ఏట 11 జూలై రోజున ఐరాస సభ్య దేశాలు ప్రపంచ లేదా అంతర్జాతీయ జనాభా దినోత్సవం జరుపుకోవాలని 1990లో ఐరాస సర్వసభ్య సమావేశం తీర్మానించారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదలతో సంబంధం ఉన్న పలు సవాళ్లు, అవకాశాలను చర్చించడం, జనాభా పట్ల కనీస అవగాహన కల్పించడం, జనాభా ఒక మానవ వనరుగా తీర్చిదిద్దుకోవడం, సుస్థిరాభివృద్ధికి బాటలు వేయడం, ప్రజారోగ్యం పట్ల చర్యలు తీసుకోవడం, మానవాళి శ్రేయస్సుకు దోహదపడడం లాంటి అంశాలను చర్చించడం జరుగుతుంది. ప్రపంచ జనాభా దినోత్సవం -2026 ఇతివృత్తంగా యువత ఆశలు, ఆకాంక్షలు సాకారం చేయడం – నేడు మరియు భవిష్యత్తు కోసం అనబడే అంశాన్ని తీసుకొని యువశక్తి ప్రాధాన్యాన్ని గుర్తించడం, పునరుత్పత్తి హక్కులను కల్పించడం, లింగ సమానత్వ సాధన, మాతాశిశు ఆరోగ్యం, పేదరిక నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, ప్రపంచ యువతను శక్తివంతులుగా/నైపుణ్య విద్య కలిగిన వారుగా మార్చడం లాంటి విషయాలను అవగాహన పరచడం జరుగుతుంది.
ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమాలు: జనాభా పెరుగుదలతో సుస్థిరాభివృద్ధి సాధించడం, వనరుల నిర్వహణ, జనాభా పెరుగుదలను నియంత్రించడం లాంటి చర్యలు నిరంతరం కొనసాగాలి. ప్రభుత్వాలు, పౌర సమాజం చేయిచేయి కలిపి నాణ్యమైన నైపుణ్యతతో కూడిన విద్య, ఆరోగ్య సంరక్షణ, ఉద్యోగాల కల్పన, కుటుంబ నియంత్రణ లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు రచించి, అమలుకు పూనుకోవాలి. ఆర్థిక అస్థిరత, వాతావరణ ప్రతికూల మార్పులు, జనాభా మార్పులను అధ్యయనం చేసుకుంటూ జనాభాను ఒక సంపదగా భావిస్తూ అడుగులు ముందుకు వేయాలి. ప్రపంచ జనాభా దినం వేదికగా విద్యాలయాల్లో జనాభాకు సంబంధించిన పోటీలను నిర్వహించడం, ఉపన్యాసాలు, చర్చలు, సెమినార్లు, సాంస్కృతిక ప్రదర్శనలు, వైద్య శిబిరాలు, యువజన కార్యక్రమాలు, అధిక జనాభా వల్ల ఎదురయ్యే సవాళ్లు, పలు దేశాల మధ్య సమన్వయంతో మేలుచేసా కార్యక్రమాలు నిర్వహించపచ్చు. ప్రపంచ జనాభా దినం మనకు ఒక హెచ్చరిక కావాలి. మన జనాభా మన శక్తిగా మారాలి. యువతకు నాణ్యమైన విద్యతో పాటు నైపుణ్యాలకు కూడా సమాంతరంగా ప్రాధాన్యం ఇవ్వాలి. నైపుణ్య విద్యలేని మన యువ జనాభా ఒక శాపంగా మారుతుంది. యువశక్తి నిర్వీర్యం అయితే దేశాభివృద్ధి కుంటుపడుతుంది. మనకు మాత్రమే అపూర్వ ఆస్తిగా ఉన్న జనాభా భారతమాత సుస్థిరాభివృద్ధికి రాచబాటలు వేయాలి.