Parents Property Rights: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే పిల్లలకు ఇచ్చిన ఆస్తి వెనక్కి తీసుకోవచ్చు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు
Parents Property Rights: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే పిల్లల నుంచి ఆస్తి వెనక్కి తీసుకోవచ్చు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు
Parents Property Rights: వృద్ధాప్యంలో తల్లిదండ్రుల నుంచి ఆస్తులు పొంది.. ఆ తర్వాత వారి సంరక్షణ విషయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే పిల్లలకు కనువిప్పు కలిగేలా బాంబే హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. వృద్ధాప్యంలో తమను ఆదరిస్తారనే నమ్మకం, షరతుతో ఆస్తిని పిల్లల పేరిట బదిలీ చేసిన తల్లిదండ్రులు, ఒకవేళ ఆ పిల్లలు సదరు షరతును నెరవేర్చకపోతే తమ ఆస్తిని తిరిగి వెనక్కి తీసుకోవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది. తల్లిదండ్రులు ఆర్థికంగా స్థితిమంతులైనప్పటికీ (ధనవంతులైనప్పటికీ) ఈ నిబంధన వర్తిస్తుందని న్యాయస్థానం తేల్చిచెప్పింది.
ముంబైలోని లోయర్ పారెల్ ప్రాంతంలో ఉన్న ఒక ఫ్లాట్‌ను తన 68 ఏళ్ల వృద్ధ తండ్రికి తక్షణమే స్వాధీనం చేయాలంటూ కింది కోర్టు (ట్రిబ్యునల్) ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఒక 42 ఏళ్ల వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రవీంద్ర చుగే, జస్టిస్ గౌతమ్ ఆంఖడ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది.
విచారణ సందర్భంగా ధర్మాసనం సీనియర్ సిటిజన్స్ చట్టం, 2007 లోని కీలక నిబంధనలను ప్రస్తావించింది. వృద్ధులైన తల్లిదండ్రులకు ప్రాథమిక సౌకర్యాలు, శారీరక, వైద్య అవసరాలు కల్పిస్తాననే షరతుతోనే ఆస్తి బదిలీ (గిఫ్ట్ డీడ్ లేదా సేల్ డీడ్) జరుగుతుందని.. ఒకవేళ పిల్లలు ఆ బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైతే, సదరు ఆస్తి బదిలీని పూర్తిగా రద్దు చేసే సర్వాధికారాలు ట్రిబ్యునల్‌కు ఉన్నాయని చట్టంలోని సెక్షన్ 23 స్పష్టంగా చెబుతోందని హైకోర్టు పేర్కొంది.
తండ్రికి అనుకూలంగా కింది కోర్టు ఇచ్చిన తీర్పు పూర్తిగా చట్టబద్ధమైనదేనని సమర్థిస్తూ, బాధ్యత మరచిన కుమారుడు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఈ తీర్పు ద్వారా ఆస్తి చేతికి రాగానే కన్నవారిని రోడ్డున పడేసే కొందరు పిల్లల ధోరణికి గట్టి బ్రేక్ పడినట్లయింది.ఆస్తులు తీసుకుని తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో వదిలేసే ప్రస్తుత రోజుల్లో, బాంబే హైకోర్టు ఇచ్చిన ఈ చట్టపరమైన రక్షణ వృద్ధుల జీవితాలకు భరోసానిచ్చే అంశంగా నిలిచింది.