Skip to content
జాతీయం వార్తలు

ఆమె నిష్క్రమించింది

Prajapaksham 09 Jul 2026 0 నిమిషాల పఠనం జాతీయం
ఆమె నిష్క్రమించింది

ఆమె నిష్క్రమించింది

– వాసి జ్యోత్స్న

ఆడజన్మ శాపమే కామాంధుల తాపానికి. అమాయకపు ఆడపిల్లలు, ముక్కుపచ్చలారని జీవితాలు పదమూడేళ్లకే ఊరకుక్కల చేతిలో బలవుతున్నాయి. ఎన్ని కలలు కన్నదో ఆ తల్లి, కొంగుచాటున దాచి వెన్నెల వెలుగులో పెంచిందేమో! తండ్రి భుజాలపై పాదముద్రలు ఇంకా చెరిగి ఉండవేమో…. గుండెలు పగిలిపోయుంటాయి..!

రక్తపు మరకల నడుమ కన్నపేగు, రేపటి జీవితం శునకాల తొక్కిసలాటలో చితికిపోయి, కలలు చెరిగి చిత్రపటంలో నిలిచిన చిన్నారి. చట్టాలు చుట్టాలుగా మారిపోయాయా..! వీధి కుక్కలు ఎక్కువగా తిరిగితేనే ఊరుకోరే, మరెలా వదిలేస్తున్నారు నడిరోడ్లపై…. ఇలాంటి మదంపట్టిన తిరుగుబోతుల్ని. ఇంకెన్నాళ్లురా చూడాలి ఈ దారుణాల్ని, ఇంకెంతమంది ఆడపిల్లల్ని బలితీసుకుంటారు? ఇంతేనా ఇలా చూస్తూ కుమిలిపోవడమేనా కన్నవారు? మరో మార్గం ఏమీ లేదా? మార్చలేరా చట్టాల్ని? అన్యాయంగా, అపురూపంగా పెంచుకున్న పుత్తడి బొమ్మల్ని కోల్పోయి కుమిలిపోవడమేనా?

నెలసరి వస్తేనే మూడు రోజులు ఆ నరకం భరించలేక, విలవిలలాడిపోతూ అమ్మకి వందసార్లు ఆ నొప్పిని గుర్తుచేస్తారు ఆడపిల్లలు. అలాంటిది ఐదు రోజులు ఆ చిన్ని తల్లి ఎలా భరించిందో ముప్పదిరెండు మందిని? తలచుకుంటే కంట నీరు ఆగడం లేదు. గుండె సంద్రమైపోతుంది. ఎంత వెక్కి ఏడ్చినా పోయిన ప్రాణం తిరిగిరాదు. వాళ్లకు ఎలాంటి శిక్ష వేసినా ఆమె జీవం పోసుకొని భువిపై నడవలేదు. మమ్ముల్ని ఎవరూ ఏమీ చెయ్యలేరు అనేది ఇలాంటి నీచుల ధైర్యమా? లేక ఏం చేసినా శిక్ష ఉండదు అని వాళ్ళ అభిప్రాయమా? మేమే గొప్పోళ్లం అని వాళ్ళ ఆలోచనా? ఇవన్నీ కాకుండా మగాళ్లమనే బలుపా?

ఒక విధంగా ఆలోచిస్తే మగవారిలో చాలా ఉన్నతమైన ధోరణి కలిగిన వాళ్ళు ఉన్నారు. కుటుంబంపట్ల బాధ్యతతో వ్యవహరించేవాళ్ళు సమాజంలో ఉన్నారు. ఇలాంటి వికృత చేష్టలు కలిగి జీవితాల్ని మింగేసే నీచులు ఉండడం వల్ల మంచివాళ్లపై ఉన్న అభిప్రాయం మాసిపోతుంది. మగవాళ్ళు అంటేనే భయం పేరుకుపోతుంది. నేటి ఆడపిల్లలు భవిష్యత్తులో సుదూర ప్రాంతాలలో తమ జీవితాన్ని ఊహించుకోవడం ఊహగానే మిగిలిపోతుందేమో అనిపిస్తుంది. అయినా నాకొక సందేహం, ఇంత చేసినా శిక్షలు ఎందుకు విధించడం లేదు? వెంటనే చంపిపారేయకుండా సోది ఇంటరాగేషన్‌ అంటూ కాలయాపన ఎందుకు చేస్తున్నారు? సమాజం ఒప్పుకుంటుంది కదా! భారతీయ శిక్షాస్మృతి ప్రకారం చంపడం సరైనది కాదా? చంపబడడం మాత్రం మంచిదా.. ఇలానే చూస్తూపోతే మన దేశంలో భవిష్యత్తులో మగపిల్లలకు సరిపడా ఆడపిల్లల శాతం ఉండదు. ఆడపిల్లలు కావాలంటే కొట్టుకు చావాలి. ఒక్కసారి ఆలోచించండి. నీచపు ఆలోచనలు కలిగిన చోట ఎంత మంచితనం వెతికినా దొరకదు. పైగా ఆ జంతువు ఒక్కరిని బలి తీసుకొని ఊరుకోదు. అవకాశం ఇస్తే మరొకళ్ళను వేటాడి తినేందుకు చూస్తుంది. ఇప్పటికైనా ఆలోచించి శిక్షలు అమలు చేయండి.

ట్యాగ్‌లు: women safety

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *