EPF Scheme 2026 Explained: ఈపీఎఫ్ కొత్త నిబంధనలు.. మీ ఖాతాలోని డబ్బును ఈ 7 సందర్భాల్లో పూర్తిగా విత్‌డ్రా చేసుకోవచ్చు..
EPF Scheme 2026 Explained: ఈపీఎఫ్ కొత్త నిబంధనలు.. మీ ఖాతాలోని డబ్బును ఈ 7 సందర్భాల్లో పూర్తిగా విత్‌డ్రా చేసుకోవచ్చు..
EPF Scheme 2026 Explained: దేశంలోని లక్షలాది మంది ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అనేది అతిపెద్ద పదవీ విరమణ పొదుపు పథకంగా చెప్పుకోవచ్చు. భవిష్యత్తు అవసరాల కోసం ఉద్యోగి, కంపెనీ ఇద్దరూ ప్రతి నెలా ఇందులో తమ వాటాలను జమ చేస్తారు. అయితే ఉద్యోగం మానేసిన తర్వాత ఖాతాలోని మొత్తం డబ్బును ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంది. కొత్తగా వచ్చిన EPF పథకం 2026 ప్రకారం.. కొన్ని నిర్దిష్ట పరిస్థితులలో మాత్రమే సభ్యులు తమ ఖాతా నుండి పూర్తి మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. అందుకోసం నిర్దేశించిన ఆ 7 ముఖ్యమైన షరతులు ఇవే..
మొదటిది: ఒక ఉద్యోగికి 55 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత పదవీ విరమణ (Retirement) చేస్తే తమ ఖాతాలోని మొత్తం బ్యాలెన్స్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ 55 ఏళ్లు రాకముందే ఉద్యోగం ముగిసినప్పటికీ.. వారి క్లెయిమ్ పరిష్కారమయ్యే లోపు 55 ఏళ్లు నిండితే పూర్తి మొత్తం పొందేందుకు అర్హులవుతారు.
రెండవది: ఏదైనా శారీరక లేదా మానసిక శాశ్వత వైకల్యం (Permanent Disability) కారణంగా ఒక ఉద్యోగి పని చేయలేక ఉద్యోగం వదిలివేయాల్సి వస్తే.. వయస్సుతో సంబంధం లేకుండా పూర్తి డబ్బును తీసుకోవచ్చు. అయితే దీనికి కంపెనీ వైద్య అధికారి లేదా గుర్తింపు పొందిన డాక్టర్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్ తప్పనిసరిగా సమర్పించాలి.
మూడవది: ఎవరైనా ఉద్యోగి శాశ్వతంగా విదేశాలలో స్థిరపడటానికి (Settling Abroad) లేదా వేరే దేశంలో ఉద్యోగం చేయడానికి వెళుతున్నట్లయితే.. వారు భారతదేశం విడిచి వెళ్ళే ముందే తమ పూర్తి ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతిస్తారు.
నాల్గవది: కంపెనీలు తమ సిబ్బంది సంఖ్యను తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తే (Retrenchment), ఆ నష్టపోయిన ఉద్యోగులు తమ ఖాతా నుండి పూర్తి డబ్బును డ్రా చేసుకోవచ్చు.
ఐదవది: కంపెనీలు ఆఫర్ చేసే ముందస్తు స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (VRS) కింద రిటైర్ అయిన ఉద్యోగులు తమ పూర్తి ఈపీఎఫ్ మొత్తాన్ని పొందేందుకు అర్హులవుతారు.
ఆరవది: ఒకవేళ కంపెనీ పూర్తిగా మూసివేయబడినా (Closure of Company) లేదా సోషల్ సెక్యూరిటీ కోడ్ వర్తించని ప్రదేశానికి/కంపెనీకి ఉద్యోగి బదిలీ అయినా పూర్తి మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020 కింద పరిహారం పొంది ఉద్యోగం కోల్పోయిన వారికి కూడా ఇది వర్తిస్తుంది. అయితే ఈ ప్రక్రియ పూర్తి కావడానికి దరఖాస్తు చేసినప్పటి నుండి కనీసం రెండు నెలల సమయం పడుతుంది.
ఏడవది: కొత్త ఈపీఎఫ్ స్కీమ్ 2026 లో తెచ్చిన అతిపెద్ద మార్పు నిరుద్యోగానికి (Unemployment) సంబంధించినది. దీని ప్రకారం ఒక వ్యక్తి ఏడాది పాటు ఎలాంటి ఉద్యోగం లేకుండా ఉంటేనే పూర్తి బ్యాలెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలవుతుంది. అయితే వివాహం కారణంగా ఉద్యోగం మానేసే మహిళా ఉద్యోగులకు ఈ 12 నెలల నిరీక్షణ కాలం నుండి మినహాయింపు ఇచ్చారు. వారు వెంటనే పూర్తి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.
కొత్త నిబంధనల ప్రకారం నిరుద్యోగ విత్‌డ్రాయల్ కాలపరిమితిని కఠినతరం చేయడం ద్వారా, ఈపీఎఫ్ నిధిని కేవలం పదవీ విరమణ లేదా అత్యవసర పరిస్థితులకు మాత్రమే ఉపయోగపడేలా ప్రభుత్వం మార్పులు చేసింది. కాబట్టి ఉద్యోగులు ఈ 7 కేటగిరీలలో తాము దేనికి అర్హులో చూసుకుని, సరైన పత్రాలతో దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి క్లెయిమ్ పొందవచ్చు.