AP Municipal Elections: ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. 106 మున్సిపాలిటీల చైర్పర్సన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి వివరాలివిగో..
Elections
AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 106 మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ పదవులకు రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఈ మేరకు సోమవారం మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరాలు వెల్లడయ్యాయి. రిజర్వేషన్ల ప్రకటనతో ఆయా పట్టణాల్లో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపికపై రాజకీయ పార్టీల్లో ఆసక్తి నెలకొంది.
మొత్తం 106 చైర్పర్సన్ పదవుల్లో ఎస్టీ కేటగిరీకి మూడు స్థానాలు కేటాయించారు. వీటిలో రెండు జనరల్, ఒకటి మహిళకు రిజర్వ్ చేశారు. ఎస్సీ కేటగిరీలో 14 స్థానాలు ఉండగా, ఏడు జనరల్, మరో ఏడు మహిళలకు కేటాయించారు. బీసీ కేటగిరీలో మొత్తం 36 స్థానాలను కేటాయించారు. వీటిలో 18 జనరల్, 18 మహిళలకు రిజర్వ్ చేశారు. జనరల్ మహిళల కేటగిరీలో మరో 27 స్థానాలు ఉండగా, 26 స్థానాలను అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉంచారు. దీంతో వివిధ సామాజిక వర్గాలకు, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించేలా రిజర్వేషన్లు ఖరారైనట్లు తెలుస్తోంది.
బీసీ మహిళలకు రిజర్వ్ చేసిన మున్సిపాలిటీలు
బీసీ మహిళల కేటగిరీలో చిలకలూరిపేట, ఇచ్ఛాపురం, కొవ్వూరు, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం, నర్సీపట్నం, నాయుడుపేట, గుంతకల్లు, గుడివాడ, నందిగామ, నెల్లిమర్ల, మడకశిర, ఆళ్లగడ్డ, గురజాల, ముమ్మిడివరం, మదనపల్లె, నరసరావుపేట, అమలాపురం మున్సిపాలిటీలను కేటాయించారు.
బీసీ జనరల్ కేటగిరీలో ఇవే పట్టణాలు
కావలి, కదిరి, బి. కొత్తకోట, కందుకూరు, హిందూపురం, ఆత్మకూరు (నెల్లూరు), అద్దంకి, కమలాపురం, దాచేపల్లి, గొల్లప్రోలు, మార్కాపురం, నంద్యాల, బేతంచెర్ల, నందికొట్కూరు, దర్శి, గూడూరు (కర్నూలు), మైదుకూరు, బద్వేలు మున్సిపాలిటీలను బీసీ జనరల్ కేటగిరీకి కేటాయించారు.
జనరల్ మహిళలకు 27 స్థానాలు
జనరల్ మహిళల కేటగిరీలో కనిగిరి, వెంకటగిరి, బుచ్చిరెడ్డిపాలెం, ఎర్రగుంట్ల, యలమంచిలి, కల్యాణదుర్గం, నరసాపురం, పలాస–కాశీబుగ్గ, పెడన, పలమనేరు, జమ్మలమడుగు, ఆకివీడు, పాలకొండ, పొన్నూరు, భీమవరం, జగ్గయ్యపేట, ఆమదాలవలస, పుంగనూరు, మాచర్ల, రాజంపేట, ఆదోని, డోన్, రాజాం, బొబ్బిలి, రేపల్లె, పులివెందుల, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలను చేర్చారు.
అన్రిజర్వ్డ్ కేటగిరీలో 26 మున్సిపాలిటీలు
సాలూరు, తణుకు, తెనాలి, తాడేపల్లిగూడెం, తుని, పార్వతీపురం, ప్రొద్దుటూరు, పుత్తూరు, రామచంద్రాపురం, సత్తెనపల్లి, శ్రీకాళహస్తి, మండపేట, నగరి, చీమకుర్తి, తిరువూరు, రాయదుర్గం, గిద్దలూరు, వినుకొండ, పెద్దాపురం, ధర్మవరం, తాడిగడప, పిడుగురాళ్ల, తాడిపత్రి, పుట్టపర్తి, పెనుకొండ, రాయచోటి మున్సిపాలిటీలను అన్రిజర్వ్డ్ కేటగిరీలో ప్రకటించారు.