Skip to content
ప్రపంచం వార్తలు

US Visa Shake-Up: వీసాలపై ట్రంప్ కొత్త రూల్స్‌.. భారత విద్యార్థులు, ఐటీ ఉద్యోగులకు మరో షాక్ తప్పదా..

Prajapaksham 08 Jul 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
US Visa Shake-Up: వీసాలపై ట్రంప్ కొత్త రూల్స్‌.. భారత విద్యార్థులు, ఐటీ ఉద్యోగులకు మరో షాక్ తప్పదా..

US Visa Shake-Up: వీసాలపై ట్రంప్ కొత్త రూల్స్‌.. భారత విద్యార్థులు, ఐటీ ఉద్యోగులకు మరో షాక్ తప్పదా..

US Visa Shake-Up: యుఎస్ లోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వీసాలపై మళ్లీ కఠిన నిబంధనలు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ నిబంధనలు ఎలా ఉంటాయో తెలియక భారతీయు విద్యార్థులు, ఉద్యోగుల్లో వణుకుపుడుతోంది. ఇప్పటికే అమెరికా ప్రభుత్వం హెచ్-1బి వీసా (H-1B Visa) ఫీజును ఏకంగా $100,000 (సుమారు రూ. 88 లక్షలు) కు పెంచుతూ గతంలో నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ భారీ ఫీజును చట్టవిరుద్ధమైన పన్నుగా పరిగణించిన కోర్టు జూన్ 2026లో దీనిని కొట్టివేసింది.

తాజాగా అమెరికాలో స్థిరపడాలని, అక్కడ ఉన్నత చదువులు చదవాలని ఆశించే భారతీయ నిపుణులు, విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం గట్టి షాక్ ఇవ్వడానికి రెడీ సిద్ధమవుతోంది. హెచ్-1బీ (H-1B) వీసా కార్యక్రమం, ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డులు, అంతర్జాతీయ విద్యార్థి వీసా నిబంధనలలో గణనీయమైన మార్పులు తీసుకురాగల పలు వలస సంస్కరణలకు రంగం సిద్ధమైంది. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS), కార్మిక శాఖ (DOL), విదేశాంగ శాఖ (DOS) సంయుక్తంగా విడుదల చేసిన తాజా నియంత్రణ ఎజెండాలలో ఈ ప్రతిపాదనలను వివరించారు. రాబోయే నెలల్లో అధికారిక నియమ నిబంధనల ప్రక్రియ ద్వారా ఇవి అమలులోకి రానున్నాయి. ఈ మార్గాలను అత్యధికంగా ఉపయోగించుకునేది భారతీయులే కావడంతో.. ఈ నూతన విధానాల వల్ల వారిపైనే అత్యంత తీవ్రమైన ప్రభావం పడనుంది.

ఈ నూతన ప్రతిపాదనల ప్రకారం ఐటీ కన్సల్టింగ్ కంపెనీలు, థర్డ్-పార్టీ క్లయింట్ సైట్‌లలో పనిచేసే హెచ్-1బీ ఉద్యోగుల అర్హత నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నారు. దీనివల్ల యజమానులకు (Employers) ఖర్చులు పెరగడంతో పాటు వేతనాల పెంపు కూడా భారంగా మారనుంది. అలాగే 50 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండి, అందులో సగానికి పైగా హెచ్-1బీ లేదా ఎల్-1 వీసాదారులు ఉన్న పెద్ద కంపెనీలు వీసా పొడిగింపుల (Extensions) కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు అదనపు బయోమెట్రిక్ ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు, గ్రీన్ కార్డ్ ప్రక్రియలో అత్యంత కీలకమైన ‘పెర్మ్ (PERM) లేబర్ సర్టిఫికేషన్’ విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోంది.

అంతర్జాతీయ విద్యార్థుల విషయానికొస్తే.. ఇప్పటివరకు అమెరికాలో అమల్లో ఉన్న ‘డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’ (కోర్సు పూర్తయ్యే వరకు ఉండే అవకాశం) విధానాన్ని రద్దు చేసి, గరిష్టంగా నాలుగేళ్ల నిర్ణీత కాలపరిమితిని (Fixed tenure) ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల చదువు పూర్తయిన తర్వాత లేదా కోర్సు పొడిగించబడినప్పుడు ప్రతిసారీ వీసా ఎక్స్‌టెన్షన్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇది ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) ప్రోగ్రామ్‌లలో కూడా మార్పులకు దారితీయనుంది. వీటన్నింటికీ మించి, హెచ్-1బీ వీసాదారుల జీవితభాగస్వాములకు ఇచ్చే హెచ్-4 వీసా వర్క్ పర్మిట్ (EAD) ఆటోమేటిక్ ఎక్స్‌టెన్షన్‌ను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం గనుక అమల్లోకి వస్తే అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్న దాదాపు లక్ష మంది భారతీయులు ఒకేసారి ఉపాధి కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *