Skip to content
తెలంగాణ వార్తలు

కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఆర్థిక ఉగ్రవాదులు…మూడేళ్లు కాళేశ్వరం మీకే అప్పగిస్తా… కేసీఆర్‌కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్

Prajapaksham 07 Jul 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఆర్థిక ఉగ్రవాదులు…మూడేళ్లు కాళేశ్వరం మీకే అప్పగిస్తా… కేసీఆర్‌కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్

కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఆర్థిక ఉగ్రవాదులు...మూడేళ్లు కాళేశ్వరం మీకే అప్పగిస్తా… కేసీఆర్‌కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్ ( Image Source : X.com)

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టు మాటల మంటు రాజేసింది. గత ప్రభుత్వం అవినీతి వైఫల్యాలను తెరపైకి తెచ్చేందుకు రేవంత్ సర్కార్ కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్లోని ప్రజాభవన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు పైన పవర్ ప్రజెంటేషన్ సమర్పిస్తున్నారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డిసిసి అధ్యక్షులు హాజరయ్యారు. బీఆర్ఎస్ హయాంలో మోటర్ పంపులు మునిగిన ఫోటోలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. ముఖ్యంగా కాళేశ్వరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి పూర్తి వివరణ ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం విషయంలో బీఆరెస్ నాయకులు తప్పును ఇతరులపై నెట్టి రాజకీయ ఉనికిని కాపాడుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. దీనిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆధారాలతో నివేదికలను మన ముందుంచారు. వివిధ సంస్థలు ఇచ్చిన వివిధ నివేదికలను క్రోడీకరించి అందరికీ అవగాహన కల్పించిన మంత్రి గారిని అభినందిస్తున్నాని సీఎం తెలిపారు. ఆనాడు వైఎస్ హయాంలో 16 లక్షల 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మొదలు పెట్టారు. కాకా వెంకటస్వామి విజ్ఞప్తి మేరకు ఈ ప్రాజెక్టుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్లగా పేరు పెట్టారని గుర్తు చేశారు. 2012 మే నెలలో పృథ్వీరాజ్ చౌహాన్ తో 148 మీటర్ల ఎత్తులో నిర్మించుకోవాలని, ఆనాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రాథమికంగా ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. గోదావరి జలాలను తరలించి తెలంగాణను సస్య శ్యామలం చేయాలని కాంగ్రెస్ మొదటి నుంచి ప్రయత్నించిందని సీఎం రేవంత్ తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై మరింత వివరాలే తెలుపుతూ…రూ. 39 వేల కోట్ల అంచనాతో మొదలైన ఈ ప్రాజెక్టు తెలంగాణ ఏర్పడే నాటికి 6150 కోట్లు ఖర్చు చేశారని. తెలంగాణ ఏర్పడిన తరువాత కెసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం రూ. 5523 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. మొత్తం రూ. 11670 కోట్లు ఖర్చు చేశాక కెసీఆర్ ఆలోచనలు మారాయి. ప్రాజెక్టు రీడిజైన్ కోసం అధ్యయనానికి 21-01-2015 న ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ కెసీఆర్ ఆలోచన తప్పు అని చెప్పింది. మేడిగడ్డ దగ్గర బ్యారేజీ వద్దని నివేదిక ఇచ్చింది. ఆయనకి నచ్చినట్టు ఇవ్వలేదని ఆ నివేదికను కేసీఆర్ పక్కన పెట్టారు. కేసీఆర్ తనకు కావాల్సిన రిపోర్ట్ ను వ్యాప్కోస్ సంస్థతో ఇప్పించుకున్నారు. కమిషన్ల కోసం ప్రాజెక్టు ఊరు మార్చి, పేరు మార్చి 38 వేల కోట్ల నుంచి అంచనాలు 81 వేల కోట్లకు పెంచారు. నీళ్లు పెరగలేదు, ఆయకట్టు పెరగలేదు… కానీ అంచనాలు మాత్రం పెరిగాయని తెలిపారు.

ప్లానింగ్, డిజైన్, నిర్మాణం, ఆపరేషనల్ మెయింటెనెన్స్ నాణ్యతగా చేసి ఉంటే ఇవాళ ఇలాంటి పరిస్థితి రాకపోయేది. తన మెదడును రంగరించి ప్రాజెక్టు డిజైన్ చేశానని కెసీఆర్ స్వయంగా చెప్పుకున్నారు. 2019 జూన్ 21 న కాళేశ్వరం ప్రారంభిస్తే ఏడాదిలోనే మేడిగడ్డ దెబ్బతిన్నదని ఇంజనీర్లు చెప్పారు. రిస్టోర్ చేయాలని ఆనాటి ఇంజనీర్ బీవీ రమణారెడ్డి 18-05-2020 న ప్రభుత్వానికి లేఖ ఇచ్చారు. రిపేర్లు చేయకపోవడం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు కుప్పకూలే పరిస్థితికి వచ్చింది. గోదావరి ఉధృతితో గోడ నాణ్యత లేకపోవడం వల్ల కన్నెపల్లి పంప్ హౌస్ 2022 లోనే మునిగిపోయింది. ఇది ఒక్క రోజులోనే వచ్చిన సమస్య కాదు.. కట్టిన ఏడాది నుంచే ఒక్కొక్కటిగా సమస్యలు బయటపడ్డాయని సీఎం రేవంత్ తెలిపారు.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కట్టిన చోట ఎలాంటి భూ పరీక్షలు చేయలేదు. ఇసుక మేడల్లా.. కేసీఆర్ ఇసుకపై బ్యారేజీలు కట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ వెన్నెముక లాంటిది. వెన్నెముక పనిచేయకపోతే ఎలా ఏమీ చేయలేరో… కాళేశ్వరం కూడా అంతే. కాళేశ్వరంపై చర్చకు రమ్మంటే మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్లను పంపిస్తున్నారు. ప్రాజక్టు కుప్ప కూలితే ఇంజనీర్ పై కేసు పెట్టింది బీఆరెస్ హయాంలోనే. వాళ్ల హయాంలోనే NDSA ప్రాథమిక నివేదిక ఇచ్చింది. నాణ్యత లేకపోవడం, మెయింటెనెన్స్ లేకపోవడం, నిబంధనలు పాటించకపోవడం వల్లే బ్యారేజీ దెబ్బతిన్నదని NDSA నివేదిక ఇచ్చిందని సీఎం రేవంత్ గుర్తు చేశారు.

లక్ష కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టును ఎలాగైనా నిలబెట్టాలని మేం ప్రయత్నిస్తున్నాం. ఇందుకు ఎక్స్ పర్ట్స్ ను తీసుకొచ్చి రీస్టోర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఒకాయన కేసీఆర్ కు ఇస్తే రెండు నెలల్లో చేస్తాం అంటున్నాడు. ఇంకొకాయన కెసీఆర్ ముందు చూపుతో ఈ ప్రాజెక్టు కట్టారని హరీష్ రావు అంటున్నారు. కట్టిందే వరద జలాలు ఎత్తి పోసుకోవడానికే ఈ ప్రాజెక్టు. వర్షాలు లేకపోయినా నీళ్లు లేకపోయినా ఎత్తి పోసుకోవచ్చు అన్నట్లు హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఎల్ నినోతో వర్షాలు లేక, నీళ్లు లేకపోతే ఎలా నీళ్లు ఎత్తిపోస్తారు? తొమ్మిదిన్నరేళ్లు మీకు అప్పగిస్తే 8 లక్షల 21 వేల కోట్లు అప్పులు చేశారు. కాళేశ్వరం పేరుతో లక్ష 2 వేల కోట్లు ఖర్చు చేస్తే మీరు చేసిన నిర్వాకం ఏమిటి? ఇది మీరు చేసిన విధ్వంసం… ఇలాంటి విధ్వంసం చేసిన వాళ్లని ఆర్ధిక ఉగ్రవాదులు అంటారని సీఎం రేవంత్ విమర్శించారు.

కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఆర్ధిక ఉగ్రవాదులు. కేసీఆర్ కోరుకున్న రోజు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడానికి మేం సిద్ధం. జాయింట్ సెషన్ పెట్టి ప్రాజెక్టు పై కూలంకషంగా చర్చకు సిద్ధం. స్పీకర్ కు లేఖ రాయండి.. తేదీ ఖరారు చేయండి. ఎందుకు మీకు అప్పగించాలో చెబితే మూడేళ్లు ప్రాజెక్టు రిపేర్లు మీకే అప్పగిస్తాం.. మీ గౌరవానికి భంగం కలగకుండా సభను సజావుగా సాగేలా చూసుకునే బాధ్యత మాది. కెసీఆర్ చేసిన తప్పులకు తెలంగాణ ప్రజలకు శిక్ష పడొద్దు. కెసీఆర్ కట్టిన సెక్రటేరియట్, ప్రజా భవన్ వినియోగించడం లేదా? కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, రైతు భరోసా కొనసాగించడం లేదా? నిజంగా ప్రజల కోసం వినియోగించే పరిస్థితి ఉంటే ఎందుకు ఉపయోగించం? మీరు చేసిన తప్పులకి ఉరి తీయాలని ప్రజలు కోరుకుంటున్నా నిబంధనలు అడ్డొస్తున్నాయని సీఎం రేవంత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. .