Mumbai Building Collapse: ఆ ఒక్క రాత్రి గడిస్తే చాలు అనుకున్నారు.. అంతలోనే కుటుంబం మొత్తాన్ని మృత్యువు కాటేసింది..
Mumbai Building Collapse: ఆ ఒక్క రాత్రి గడిస్తే చాలు అనుకున్నారు.. అంతలోనే కుటుంబం మొత్తాన్ని మృత్యువు కాటేసింది..
Mumbai Building Collapse: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెగని వర్షాలతో ప్రజలు విలవిలలాడుతున్నారు. ఈ భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం కాగా.. రోడ్లు ఎక్కడికక్కడే కొట్టుకుపోయాయి. రవాణా సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. కాగా ముంబై నగరాన్ని ముంచెత్తుతున్న ఎడతెగని వర్షాలు.. ఓ పేద కుటుంబాన్ని చిదిమేశాయి.
ఈ ఒక్క రాత్రి గడిస్తే చాలు.. రేపు ఉదయాన్నే ఇక్కడి నుంచి సురక్షితమైన చోటుకు వెళ్ళిపోదామని ఆ తండ్రి భార్యాపిల్లలకు ధైర్యం చెప్పాడు. కానీ, విధి ఆ కుటుంబానికి ఆ ఒక్క రాత్రి కాలాన్ని కూడా ఇవ్వలేదు. కొన్ని గంటల్లో ఇల్లు మారాల్సిన ఆ ఇంట్లోని ఐదుగురు ప్రాణాలు శిథిలాల కింద కలిసిపోయిన హృదయవిదారక ఘటన ముంబైలోని మాన్‌ఖుర్ద్ పరిధిలో గల మండాలా (జనతా నగర్) ప్రాంతంలో చోటుచేసుకుంది.
కూలి కార్మికుడిగా పనిచేసే మొయినుద్దీన్ వాజిద్ అలీ షా, ఆయన భార్య అక్తర్ జహాన్ తమ నలుగురు పిల్లలతో కలిసి అక్కడ ఒక చిన్న రేకుల షెడ్డులో నివసిస్తున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల తమ ఇంటి పక్కనే ఉన్న నాలుగు అంతస్తుల భవనం బాగా దెబ్బతిన్నట్లు.. అది ఎప్పుడైనా కూలిపోవచ్చని ఆ దంపతులు ముందే ఊహించారు. ఎలాగైనా ఆదివారం ఉదయాన్నే ఇల్లు ఖాళీ చేయాలని నిశ్చయించుకున్నారు. శనివారం రాత్రి అక్తర్ జహాన్ పిల్లలతో కలిసి సామాన్లు ప్యాక్ చేస్తోంది. ఆ సమయంలో భార్యాపిల్లల కోసం భోజనం తీసుకురావడానికి మొయినుద్దీన్ అలా బయటకు వెళ్లాడు. అతను వెళ్లిన పది నిమిషాలకే అంతా జరిగిపోయింది.
పక్కనే ఉన్న ఆ భారీ అక్రమ కట్టడం ఒక్కసారిగా కుప్పకూలి.. మొయినుద్దీన్ నివసిస్తున్న రేకుల ఇంటిపై పడింది. క్షణాల వ్యవధిలో ఇల్లంతా మట్టి దిబ్బగా మారిపోయింది. భోజనం పట్టుకుని ఇంటికి తిరిగివచ్చిన మొయినుద్దీన్‌కు అక్కడ తన ఇల్లు కనిపించలేదు.. కేవలం కాంక్రీట్ శిథిలాల కుప్పలు మాత్రమే కనిపించాయి. తన కళ్ల ముందే భార్య, నలుగురు అమాయక పిల్లలు ఆ మృత్యు శిథిలాల కింద నలిగిపోయారనే నిజాన్ని తెలిసి ఆ తండ్రి ఆక్రందన అందరి గుండెలను పిండేసింది. ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.
ఈ ప్రమాదం జరగడానికి కొన్ని గంటల ముందే ఆ నాలుగు అంతస్తుల భవనంలో స్పష్టమైన మార్పులు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. గోడలు పగలడం, లోపల టైల్స్ ఊడిపోవడం, భవనం ఒక పక్కకు వంగిపోవడంతో అందులో నివసిస్తున్న మిగిలిన కుటుంబాలు ముందే గ్రహించి ప్రాణభయంతో ఇళ్లను ఖాళీ చేసి వెళ్ళిపోయాయి. అలా వారు ప్రాణాలు దక్కించుకున్నప్పటికీ, పక్కనే ఉన్న పేదల ఇళ్లను మాత్రం ఆ కట్టడం మింగేసింది.
ముంబై మున్సిపల్ అధికారులు ఈ భవనాన్ని పూర్తి అక్రమ, అనధికారిక కట్టడంగా ప్రాథమికంగా ధృవీకరించారు. నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిర్మించినందుకే ఈ ఘోరం జరిగిందని తేల్చారు. ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన ముంబై ఫైర్ బ్రిగేడ్, పోలీసులు, స్థానిక మున్సిపల్ సిబ్బంది ఎడతెగని వానలోనే రాత్రంతా శ్రమించి శిథిలాలను తొలగించి మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘోర ప్రమాదంపై స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
మరోవైపు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. ఆ అక్రమ భవన యజమానిని, దానిని నిర్మించిన కాంట్రాక్టర్‌ను రాత్రికి రాత్రే అరెస్ట్ చేశారు. నిరుపేదల ప్రాణాలతో చెలగాటమాడుతూ భద్రతా ప్రమాణాలు ఉల్లంఘించిన వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కేవలం చట్టాలు, అరెస్టులు ఆ తండ్రికి జరిగిన అన్యాయాన్ని భర్తీ చేయగలవా? ఆ ఒక్క రాత్రి గడిస్తే బాగుండు అనుకున్న ఆ పేద కుటుంబ ఆశలు శాశ్వతంగా శిథిలాల కిందే సమాధి అయిపోయాయి.