Dharani Portal Scam: ధరణి పోర్టల్‌లో భారీ భూకుంభకోణం.. 10 వేల ఎకరాల యాజమాన్య రికార్డులు మార్పు.. విచారణ వేగవంతం..
Dharani Portal Scam: ధరణి పోర్టల్‌లో భారీ భూకుంభకోణం.. 10 వేల ఎకరాల యాజమాన్య రికార్డులు మార్పు.. విచారణ వేగవంతం..
Dharani Portal Scam: తెలంగాణ ధరణి పోర్టల్‌లోని సాంకేతిక లొసుగులను ఆసరాగా చేసుకుని జరిగిన భూ అక్రమ దోపిడీపై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక విచారణ బృందం క్షేత్రస్థాయిలో తనిఖీలను ముమ్మరం చేసింది. గత ఐదు నివేదికలలో ధరణి పోర్టల్‌లో జరిగిన భారీ భూ దోపిడీకి సంబంధించిన క్షేత్రస్థాయి పరిశీలనను మరింత వేగవంతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 వేల ఎకరాలకు పైగా భూముల యాజమాన్య హక్కులను అక్రమంగా మార్చేసినట్లు గుర్తించిన అధికారులు.. ఈ స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునే పనిలో పడ్డారు.
ముఖ్యంగా సంగారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి వంటి జిల్లాల్లో అక్రమాలు పెద్ద ఎత్తున జరిగినట్లు ప్రాథమికంగా తేలింది. ఈ తప్పులకు పాల్పడినట్లు అనుమానాలున్న పలువురు తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, ధరణి ఆపరేటర్లను విచారణ బృందం ప్రశ్నిస్తూ.. అవసరమైన చోట సంజాయిషీ నోటీసులు జారీ చేస్తోంది. ఈ వ్యవహారంలో ప్రస్తుత రెవెన్యూ సిబ్బందితో పాటు కొందరు మాజీ ఉద్యోగులు, దళారుల ప్రమేయం కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది. అసలు భూ యజమానులకు కనీసం సమాచారం కూడా లేకుండా రాత్రికి రాత్రే భూములు ఇతరుల పేర్ల పైకి మారిపోవడం క్షేత్రస్థాయిలో తీవ్ర కలకలం రేపుతోంది.
సాధారణంగా ధరణి పోర్టల్‌లో ఒక పట్టా భూమి హక్కులను మార్చాలంటే సదరు యజమాని ఆధార్, బయోమెట్రిక్ వివరాలతో పాటు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు వచ్చే వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP) నమోదు చేయడం తప్పనిసరి. యజమానికి తెలియకుండా ఈ ప్రక్రియ జరగడం అసాధ్యమైనప్పటికీ, ఈ కేటుగాళ్లు సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ యజమాని ఫోన్‌కు ఓటీపీ వెళ్లకుండానే సాఫ్ట్‌వేర్‌ను బైపాస్ చేసి ఎకరాలకు ఎకరాలు బదలాయించేశారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఉదాహరణకు నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం హాజీపూర్‌లో నిషేధిత జాబితా (22-A) లో ఉండే 1.18 ఎకరాల ఎసైన్డ్ భూమిని యజమానికి తెలీకుండానే వేరే వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్-మ్యుటేషన్ చేసేశారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ ఆ ధరణి ఆపరేటర్, సిబ్బందిపై రెండు రోజుల క్రితమే కఠిన చర్యలు తీసుకున్నారు. అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా ఐదుగురు రైతులకు చెందిన భూములు వారి ప్రమేయం లేకుండానే ఇతరుల పేర్లపైకి మారగా.. బాధితులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ అక్రమం వెలుగు చూసింది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఇలాంటి వందలాది దొంగ లావాదేవీలను అధికారులు గుర్తించారు.
ప్రస్తుతం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖలతో పాటు సైబర్‌క్రైం, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (IT), ఎన్‌ఐసీ (NIC) విభాగాల నిపుణులతో ఏర్పాటైన సంయుక్త విచారణ బృందం ఈ అక్రమాల గుట్టు రట్టు చేస్తోంది. ధరణి, ప్రస్తుత ‘భూభారతి’ పోర్టల్ సాఫ్ట్‌వేర్‌లను హ్యాక్ చేయడానికి ఎలాంటి దొడ్డిదారులు ఎంచుకున్నారనే దానిపై సాంకేతిక పరిశోధన జరుగుతోంది. గతంలో పనిచేసి తొలగించబడిన కొందరు మాజీ ధరణి ఆపరేటర్లు అక్రమార్కులకు ఇందుకు సహకరించినట్లు తేలింది. అక్రమ లావాదేవీలు జరిపిన సమయంలో ఉపయోగించిన డిజిటల్ లాగిన్ ఐడీలను, ఆయా కంప్యూటర్ల డిజిటల్ ఫుట్‌ప్రింట్స్‌ను సైబర్ నిపుణులు నిశితంగా పరిశీలిస్తుండటంతో తప్పు చేసిన రెవెన్యూ అధికారులకు, సిబ్బందికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.