Ram Temple Donation Row: అయోధ్య రామ మందిరం హుండీ లెక్కింపు.. 39 రోజుల్లో 70 సార్లు దొంగతనం.. SIT నివేదికలో కీలక అంశాలు
Ram Temple Donation Row: అయోధ్య రామ మందిరం హుండీ లెక్కింపు.. 39 రోజుల్లో 70 సార్లు దొంగతనం.. SIT నివేదికలో కీలక అంశాలు
Ram Temple Donation Row: అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయ విరాళాల దుర్వినియోగం.. చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కీలక ఆధారాలను సేకరించింది. ఈ దర్యాప్తుకు సంబంధించిన సమగ్ర నివేదికను సిట్ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించింది. ఆలయ విరాళాల లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్న కొందరు సిబ్బంది నేరుగా నగదును, కానుకలను అపహరించినట్లు సీసీటీవీ (CCTV) ఫుటేజ్ ద్వారా స్పష్టమైన ఆధారాలు లభించాయని సిట్ వెల్లడించింది.
సిట్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 వరకు (మొత్తం 39 రోజులు) ఆలయ విరాళాల లెక్కింపు ప్రక్రియ జరిగింది. ఈ సమయంలో లెక్కింపు విధుల్లో ఉన్న కొందరు సిబ్బంది కరెన్సీ నోట్ల కట్టలను, చిల్లర నాణేలను తమ దుస్తులు, జేబులు, చివరకు బూట్లలో దాచిపెట్టి బయటకు తరలించినట్లు సీసీటీవీ రికార్డుల్లో స్పష్టంగా కనిపించింది. నిందితులు ఈ 39 రోజుల వ్యవధిలోనే దాదాపు 70 సార్లు ఇటువంటి దొంగతనాలకు పాల్పడ్డారని అధికారులు నిర్ధారించారు. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే, సిబ్బంది ఇలా దేవుడి సొమ్మును దొంగలిస్తుండటాన్ని గమనించిన కొందరు ఉన్నతాధికారులు సైతం వారిని వారించడానికి లేదా ఆపడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదని సిట్ పేర్కొంది.
దర్యాప్తులో భాగంగా ట్రస్ట్ సభ్యులు, బ్యాంకు అధికారులు, భద్రతా సిబ్బందితో పాటు లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్న సిబ్బందిని సిట్ విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేసింది. వీరి స్టేట్‌మెంట్ల ఆధారంగా ఏప్రిల్ 27 వ తేదీకి ముందు కూడా పెద్ద ఎత్తున విరాళాల చోరీ జరిగి ఉండవచ్చని అధికారులు బలమైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, అందుకు సంబంధించిన పాత సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో ఆ కాలానికి సంబంధించిన ఆధారాల సేకరణ దర్యాప్తు సంస్థకు సవాలుగా మారింది.
ఈ నేపథ్యంలో, అసలు ఎంత మేర సొమ్ము పక్కదారి పట్టిందో పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఆలయానికి సంబంధించిన గత ఐదేళ్ల ఖాతాలను రీ-ఆడిట్ (Re-audit) చేయాలని సిట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా బ్యాంకు రికార్డులు, విరాళాల రశీదులు, ఆలయ నిర్మాణ వ్యయాలు, భక్తులు సమర్పించిన బంగారం, వెండి వస్తువులతో కూడిన అన్ని ఆర్థిక లావాదేవీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఆలయంలో విరాళాల నిర్వహణ, భద్రతా తనిఖీలు, బయోమెట్రిక్ హాజరు విధానం, డిజిటల్ పరికరాల వాడకంపై పరిమితులు, సీసీటీవీ పర్యవేక్షణ వంటి కీలకమైన విభాగాల్లో అనేక లోపాలు ఉన్నట్లు సిట్ గుర్తించింది. భద్రతలో ఉన్న ఈ లొసుగులను ఆసరాగా చేసుకునే నిందితులు ఇష్టారాజ్యంగా చోరీలకు పాల్పడ్డారని దర్యాప్తులో తేలింది. వీటితో పాటు విలువైన కానుకల డాక్యుమెంటేషన్, వాటిని తూకం వేసే పద్ధతుల్లోనూ పలు విధానపరమైన లోపాలు ఉన్నట్లు నివేదికలో స్పష్టం చేశారు.
ఈ చోరీ కేసులో అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్‌కుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రామశంకర్ మిశ్రాలకు ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు సిట్ ఆధారాలతో సహా నిర్ధారించింది. వీరిలో ముఖ్యంగా అవినాష్ శుక్లా, మనీష్ కుమార్ యాదవ్‌లు పలుమార్లు హుండీ నగదును, విలువైన నగలను అపహరిస్తూ సీసీటీవీ కెమెరాలకు దొరికిపోయారని అధికారులు వెల్లడించారు. ఈ నివేదిక ఆధారంగా నిందితులపై మరిన్ని కఠిన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు యోగి ప్రభుత్వం సిద్ధమవుతోంది.