Cherial Tahsildar: నాలా భూముల మార్పిడి కోసం రూ. 70 వేలు లంచం.. ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన చేర్యాల తహసీల్దార్..
Cherial Tahsildar: నాలా భూముల మార్పిడి కోసం రూ. 70 వేలు లంచం.. ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన చేర్యాల తహసీల్దార్..
Cherial Tahsildar: తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. చేర్యాల తహసీల్దార్‌గా పనిచేస్తున్న కొర్రా దిలీప్ నాయక్, రూ.70,000 లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు సోమవారం (జూలై 6, 2026) మధ్యాహ్నం రంగంలోకి దిగి రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు.
ఏసీబీ అధికారులు విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. నాగపురి గ్రామంలోని పలు సర్వే నంబర్లకు సంబంధించి జమున కనకమ్మ, ఇతరుల పేర్లపై ఉన్న 30 గుంటల భూమికి సంబంధించిన పనుల నిమిత్తం ఈ లంచం వ్యవహారం నడిచింది. మొత్తం 11 నాలా (వ్యవసాయేతర భూమి మార్పిడి – NALA) దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి.. వాటిని ఆమోదించడానికి తహసీల్దార్ దిలీప్ నాయక్ ఫిర్యాదుదారుడి నుండి ఈ భారీ మొత్తాన్ని లంచంగా డిమాండ్ చేశారు.
బాధితుడి సమాచారంతో పక్కా ప్రణాళిక సిద్ధం చేసిన ఏసీబీ బృందం.. సోమవారం మధ్యాహ్నం చేర్యాలలోని తహసీల్దార్ కార్యాలయంలోనే దిలీప్ నాయక్ రూ.70 వేలు లంచం డబ్బులు తీసుకుంటుండగా దాడి చేసి పట్టుకున్నారు. నిందితుడికి రసాయన పరీక్షలు నిర్వహించి.. ఆయన వద్ద నుండి లంచం సొమ్మును పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దిలీప్ నాయక్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు, ఆయనను హైదరాబాద్‌లోని నాంపల్లి ఏసీబీ కేసుల విచారణ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా అధికారులు లేదా సిబ్బంది లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా తమ టోల్-ఫ్రీ నెంబర్ 1064 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఏసీబీ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.