Skip to content
బిజినెస్ వార్తలు

Copper Demand: దేశంలో రాగి శుద్ధి సామర్థ్యాన్ని పెంచాల్సిందే.. ICA ఇండియా కీలక హెచ్చరిక

Prajapaksham 05 Jul 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
Copper Demand: దేశంలో రాగి శుద్ధి సామర్థ్యాన్ని పెంచాల్సిందే.. ICA ఇండియా కీలక హెచ్చరిక

దేశంలో రాగి డిమాండ్ భారీగా పెరుగుతోంది.. ICA ఇండియా కీలక నివేదిక

Copper Demand: భారతదేశంలో మౌలిక సదుపాయాలు, హరిత ఇంధనం, తయారీ రంగాలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. రాగికి డిమాండ్ రోజు రొజుకు పెరిగిపోతోంది. ఈ పెరుగుతున్న రాగి (కాపర్) డిమాండ్‌ను అందుకోవడానికి భారతదేశం ప్రతి ఐదేళ్లకు సుమారు 5 లక్షల టన్నుల అదనపు శుద్ధి చేసిన రాగి ఉత్పత్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంటుందని ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్ ఇండియా (ICA India) మేనేజింగ్ డైరెక్టర్ మయూర్ కర్మార్కర్ తెలిపారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధికి (GDP) అనుగుణంగా రాగి డిమాండ్ పెరుగుతుందని.. 2026 నాటికి ఇది సుమారు 9 శాతం మేర పెరగవచ్చని కాపర్ సంఘం అంచనా వేస్తోంది. ఇక సరఫరా విషయానికి వస్తే.. హిందుస్థాన్ కాపర్ సెకండరీ స్మెల్టర్‌ను తిరిగి ప్రారంభించడం.. హిండాల్కో ఇండస్ట్రీస్ కొత్త సెకండరీ స్మెల్టర్‌ను తీసుకురావడం వల్ల దేశ ఉత్పత్తి సామర్థ్యం సుమారు 1,00,000 టన్నులు పెరుగుతుంది.
అయితే దేశ ప్రస్తుత మొత్తం డిమాండ్ అయిన సుమారు 1.8 మిలియన్ టన్నులతో పోలిస్తే ఇది చాలా తక్కువని.. కొంత ఉపశమనం కలిగించినప్పటికీ పెరుగుతున్న అవసరాలకు ఇది సరిపోదని కర్మార్కర్ తెలిపారు. భవిష్యత్తులో డిమాండ్, సరఫరా మధ్య అంతరాన్ని తగ్గించడానికి రిఫైనింగ్, స్మెల్టింగ్ రంగాలలో భారీ పెట్టుబడులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

హిండాల్కో తన స్మెల్టర్-రిఫైనరీ సామర్థ్యాన్ని విస్తరిస్తుండటం.. కచ్ కాపర్ యొక్క కొత్త ఉత్పత్తి సామర్థ్యం త్వరలో అందుబాటులోకి రానుండటంతో దేశీయంగా ‘కాపర్ క్యాథోడ్’ లభ్యత పెరగనుంది. అయినప్పటికీ.. దీర్ఘకాలిక అవసరాల దృష్ట్యా ప్రస్తుత విస్తరణ ప్రణాళికలు చాలవని ఆయన స్పష్టం చేశారు. భారతదేశ వృద్ధి రేటు ఇలాగే కొనసాగితే.. ప్రతి ఐదేళ్లకు 5 లక్షల టన్నుల కొత్త సామర్థ్యాన్ని అందుకుంటేనే దేశీయ ఉత్పత్తి డిమాండ్‌కు అనుగుణంగా సాగగలదని ఆయన వివరించారు.

ఐసిఎ ఇండియా వార్షిక గణాంకాల ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1.718 మిలియన్ టన్నులుగా ఉన్న రాగి డిమాండ్, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 9.3% పెరిగి 1.878 మిలియన్ టన్నులకు చేరుకుంది. ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, భవన నిర్మాణం, స్వచ్ఛ ఇంధనం, నూతన సాంకేతికతలను ప్రోత్సహించడం వల్లే ఈ డిమాండ్ క్రమంగా పెరుగుతోంది.
ముఖ్యంగా నిర్మాణ రంగంలో రాగికి గిరాకీ వార్షికంగా 11%, తయారీ రంగంలో 17% పెరిగింది. వీటికి తోడు పునరుత్పాదక ఇంధన రంగంలో రికార్డు స్థాయి విస్తరణ, ఎయిర్ కండిషనర్లు, ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్లు వంటి వినియోగ వస్తువుల (కన్స్యూమర్ డ్యూరబుల్స్) బలమైన విక్రయాలు కూడా రాగికి మార్కెట్‌లో రెండంకెల వృద్ధిని తెచ్చిపెట్టాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *