Ketan Agarwal Case: కేతన్ అగర్వాల్ కుటుంబంలో మరో విషాదం.. మనవడి మరణం తట్టుకోలేక తాత కన్నుమూత
కేతన్ అగర్వాల్ కుటుంబంలో మరో విషాదం
Ketan Agarwal Case:cపూణెకు చెందిన ప్రముఖ యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ దారుణ హత్యోదంతంతో ఇప్పటికే కోలుకోలేని శోకంలో ఉన్న ఆయన కుటుంబంలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కేతన్ తాత (తండ్రికి తండ్రి) దేవీచంద్ అగర్వాల్ అనారోగ్యంతో పూణెలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తన తండ్రిని కోల్పోయిన ఆవేదనను తెలియజేస్తూ కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా మిస్ యూ డాడ్ అంటూ భావోద్వేగభరితమైన పోస్ట్ పెట్టారు.
కుటుంబ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. దేవీచంద్‌కు కొంతకాలం క్రితమే ఒక పెద్ద గుండె ఆపరేషన్ (మేజర్ హార్ట్ సర్జరీ) జరిగింది. అప్పటి నుండి ఆయన తరచూ వృద్ధాప్య, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ తరుణంలో ఆయన మనవడైన కేతన్ అగర్వాల్ అత్యంత పాశవికంగా హత్యకు గురికావడం ఆయనను మానసికంగా కుంగదీసింది. కళ్లముందే పెరిగి పెద్దయిన మనవడు ఇకలేడనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించింది. కొద్ది రోజుల క్రితం పరిస్థితి అకస్మాత్తుగా విషమించడంతో కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు వెంటిలేటర్ అమర్చి బ్రతికించడానికి శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
కొద్ది వారాల క్రితం పూణెలోని ప్రసిద్ధ లోహగడ్ కోట వద్ద లోయలోకి తోసి కేతన్ అగర్వాల్ (26)ను అత్యంత దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ సంచలన కేసులో కేతన్ కాబోయే భార్య సియా గోయల్ (20), ఆమె ప్రియుడు చేతన్ చౌదరి (22) ప్రధాన నిందితులుగా ఉన్నారు. పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసిన నిజాలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి. కేతన్‌ను ఎలా హతమార్చాలనే దానిపై నిందితులిద్దరూ గూగుల్, యూట్యూబ్‌లలో రకరకాల పద్ధతులను వెతికారని.. చివరికి కోట పైనుంచి లోయలోకి తోసేయడమే ఎవరికీ దొరకకుండా ఉండే సులభమైన మార్గమని భావించి అమలు చేశారని తేలింది.
కేతన్‌ను పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదని.. ఒకవేళ తానే స్వయంగా పెళ్లిని రద్దు చేసుకుంటే కుటుంబ పరువు పోతుందని భావించి, ప్రియుడితో కలిసి ఈ దారుణ కుట్ర పన్నినట్లు నిందితురాలు సియా పోలీసుల విచారణలో అంగీకరించింది. ఒకవైపు మనవడిని పొట్టనబెట్టుకున్న హంతకులపై చట్టపరమైన పోరాటం జరుగుతుండగానే, ఇంకోవైపు పెద్ద దిక్కును కోల్పోవడంతో అగర్వాల్ కుటుంబం తీవ్ర శోకసముద్రంలో మునిగిపోయింది.