Skip to content
జాతీయం వార్తలు

ప్లాస్టిక్‌ సంచులు వద్దు.. బట్ట సంచులే ముద్దు

Prajapaksham 03 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
ప్లాస్టిక్‌ సంచులు వద్దు.. బట్ట సంచులే ముద్దు

Say no to plastic bags; cloth bags are the best choice.

(జులై 3 అంతర్జాతీయ ప్లాస్టిక్‌ బ్యాగ్‌ రహిత దినోత్సవం)

ఆధునిక మానవ నిత్యజీవితంలో ప్లాస్టిక్‌ ఒక అవిభాజ్య భాగమైపోయింది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు మనం ఉపయోగించే వస్తువులలో ప్లాస్టిక్‌ పాత్ర ఎంతో ఉంది. ముఖ్యంగా, ఒక్కసారి మాత్రమే వాడి పారేసే ‘సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌’ బ్యాగుల వాడకం ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోయింది. ఈ తాత్కాలిక సౌకర్యం మన పర్యావరణానికి శాశ్వత శాపంగా మారుతోంది. ఈ తీవ్రమైన పరిస్థితిపై ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి, ప్లాస్టిక్‌ సంచుల వాడకాన్ని పూర్తిగా అరికట్టేలా ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం జూలై 3వ తేదీన ‘అంతర్జాతీయ ప్లాస్టిక్‌ బ్యాగ్‌ రహిత దినోత్సవం’ జరుపుకుంటారు.
ప్లాస్టిక్‌ బ్యాగులు చౌకగా, సులభంగా లభిస్తాయి కాబట్టి మనం వీటిని విచ్చలవిడిగా వాడుతున్నాం. కానీ ఇవి ప్రకృతికి కలిగించే నష్టాలు ఊహాతీతం. ప్లాస్టిక్‌ బ్యాగులు అంత సులభంగా భూమిలో కలిసిపోవు. శాస్త్రీయ అంచనాల ప్రకారం, ఒక్క ప్లాస్టిక్‌ బ్యాగ్‌ పూర్తిగా విచ్ఛిన్నం కావడానికి 400 నుండి 1000 సంవత్సరాల సమయం పడుతుంది. దీనివల్ల భూమి పొరలు దెబ్బతిని, వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా భూగర్భ జలాల రీఛార్జ్‌ ప్రక్రియ నిలిచిపోతుంది. నగరాల్లో రోడ్లపై పారేసే ప్లాస్టిక్‌ కవర్లను ఆహారంతో పాటు ఆవులు, ఇతర జంతువులు తిని పేగుల్లో ప్లాస్టిక్‌ పేరుకుపోయి ప్రాణాలు కోల్పోతున్నాయి. అలాగే, నదుల ద్వారా సముద్రాలలో చేరే ప్లాస్టిక్‌ వ్యర్థాల వల్ల తిమింగలాలు, తాబేళ్లు, చేపలు వంటి లక్షలాది జలచరాలు ప్రతి సంవత్సరం మృత్యువాత పడుతున్నాయి.
మరింత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ప్లాస్టిక్‌ కాలక్రమేణా పూర్తిగా నశించకుండా చిన్నచిన్న ముక్కలుగా, అంటే
’మైక్రోప్లాస్టిక్స్‌’గా మారుతుంది. ఇవి నీరు, ఆహార గొలుసు ద్వారా పరోక్షంగా మానవ శరీరంలోకి, జంతువుల శరీరంలోకి ప్రవేశించి క్యాన్సర్‌, హార్మోన్ల అసమతుల్యత వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతున్నాయి. పర్యావరణపరంగానే కాకుండా, డ్రైనేజీ లు, మురుగు కాలువలలో ప్లాస్టిక్‌ బ్యాగులు ఇరుక్కుపోవడం వల్ల నీటి ప్రవాహం ఆగిపోతోంది. దీనివల్ల నగరాలలో స్వల్ప వర్షాలకే మురుగునీరు రోడ్లపైకి చేరి కృత్రిమ వరదలు సంభవించడానికి, తద్వారా అంటువ్యాధులు ప్రబలడానికి ప్రధాన కారణమవుతోంది.
ఈ ప్లాస్టిక్‌ మహమ్మారిని పూర్తిగా నివారించాలంటే, మన నిత్యజీవితంలో పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయాలను తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగుల స్థానంలో జనపనార సంచులు లేదా గుడ్డ సంచులు వాడటం అత్యంత ఉత్తమమైన మార్గం. ప్లాస్టిక్‌ కప్పులు, ప్లేట్లకు బదులుగా పూర్వకాలం లాగా అరటి ఆకులు, విస్తరాకులు, మట్టి పాత్రలను ఉపయోగించవచ్చు. ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లకు ప్రత్యామ్నాయంగా స్టీల్‌, రాగి లేదా గాజు బాటిళ్లను, అలాగే ప్లాస్టిక్‌ స్ట్రాలకు బదులుగా కాగితం లేదా వెదురుతో చేసిన స్ట్రాలను వాడటం అలవాటు చేసుకోవాలి.
ఈ సామాజిక మార్పు సాధ్యం కావాలంటే మనం వ్యక్తిగతం గా కొన్ని బాధ్యతలను స్వీకరించాలి. మనం మార్కెట్‌కు లేదా షాపింగ్‌కు వెళ్లేటప్పుడు ఇంటి నుంచే ఒక గుడ్డ సంచిని తీసుకెళ్లడం నియమంగా పెట్టుకోవాలి. దుకాణదారుడు ప్లాస్టిక్‌ బ్యాగ్‌ ఇస్తానన్నా ‘వద్దు’ అని తిరస్కరించే స్పృహ మనలో కలగాలి. దీనితో పాటు ప్లాస్టిక్‌ వాడకాన్ని నిరాకరించడం (Refuse), తగ్గించడం (Reduce), ఉన్న వాటిని తిరిగి ఉపయోగించడం (Reuse), మరియు రీసైక్లింగ్‌ కు పంపడం (Recycle) అనే ‘4R’ సూత్రాన్ని ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో పాటిస్తేనే ప్లాస్టిక్‌ రహిత సమాజం వైపు అడుగులు పడతాయి.
‘ప్రకృతి మనిషి అవసరాలను తీర్చగలదు, కానీ అతని స్వార్థా న్ని కాదు’ అన్న మహాత్మా గాంధీ సూక్తి ప్లాస్టిక్‌ వాడకానికి సరిగ్గా సరిపోతుంది. అంతర్జాతీయ ప్లాస్టిక్‌ బ్యాగ్‌ రహిత దినోత్సవం అనేది కేవలం ఒక రోజు జరుపుకునే వేడుక కాదు; అది భూమిని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరి నిరంతర బాధ్యత. ప్రభుత్వాలు చట్టాలు చేసినంత మాత్రాన, జరిమానాలు విధించినంత మాత్రాన ప్లాస్టిక్‌ రహిత సమాజం సాధ్యం కాదు, ప్రతి పౌరుడిలోనూ అంతర్గత మార్పు రావాలి. పచ్చని పర్యావరణాన్ని, ఆరోగ్యకరమైన భవిష్యత్తును రాబోయే తరాలకు బహుమతిగా అందించాలంటే ఈ రోజు నుంచే ప్లాస్టిక్‌ బ్యాగులకు పూర్తిగా స్వస్తి పలి కి, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి.
రచయిత: సుధాకర్‌ ఎవి,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *