గురుకులాల అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం.. హరీశ్‌రావు అరెస్ట్..
Congress Ministers vs. BRS Leaders
తెలంగాణలోని ప్రభుత్వ గురుకుల హాస్టళ్లలో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ (BRS) చేసిన ఆరోపణలు, దానిపై అధికార కాంగ్రెస్ పార్టీ విసిరిన సవాళ్లతో రాజధాని హైదరాబాద్‌లో తీవ్ర రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. గురుకులాల కొనుగోలు ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న ప్రతిపక్షాల విమర్శలపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, కాంగ్రెస్ నేత మహ్మద్ అజారుద్దీన్ తదితరులు గురువారం అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్ (అమరవీరుల స్తూపం) వద్దకు చేరుకున్నారు. బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ మంత్రులు ఎవరు వచ్చినా తాము చర్చకు సిద్ధమని.. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ వేదికగా ఈ చర్చ జరగాలని మంత్రులు స్పష్టం చేశారు.
మరోవైపు, ఈ సవాల్‌ను స్వీకరించిన బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, ఇతర ముఖ్య నేతలతో కలిసి తెలంగాణ భవన్ నుండి గన్‌పార్క్ వైపు బయల్దేరారు. అయితే, ముందస్తు జాగ్రత్త చర్యగా పోలీసులు హరీశ్‌రావు వాహనాన్ని దారిలోనే అడ్డుకున్నారు. తాము శాంతియుతంగా చర్చకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని హరీశ్‌రావు పోలీసులను నిలదీశారు.
హాస్టళ్లలో అవినీతి జరిగింది కాబట్టే కాంగ్రెస్ మంత్రులు భయపడుతున్నారని, పోలీసుల వెనుక దాక్కుని పారిపోవాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. పోలీసుల ఆంక్షలను ధిక్కరిస్తూ ఆయన కారు దిగి, గన్‌పార్క్‌కు కాలినడకన వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట.. వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత పీక్ స్టేజీకి చేరింది. చివరకు పోలీసులు హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
గన్‌పార్క్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కేటీఆర్, హరీశ్‌రావు, ప్రవీణ్‌కుమార్‌లు చేస్తున్న ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని కొట్టిపారేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లల సంక్షేమం కోసం నాలుగు శాఖల ఆధ్వర్యంలో అత్యంత పారదర్శకంగా టెండర్లు పిలిచి ప్రొక్యూర్‌మెంట్ ప్రక్రియ జరిపిందని వివరించారు. ఎవరైనా పాల్గొనేలా ఓపెన్ టెండర్లు ఇస్తే అందులో అవినీతి ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. మీ వ్యాఖ్యలు నిజమైతే చర్చకు రండి. ప్రజలందరికీ నిజం తెలియాలి. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన కొనుగోళ్లపై కూడా మేము చర్చకు సిద్ధమని పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు.
మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అప్పులపైన కూడా తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. అప్పులపై చర్చించేందుకు తెలంగాణ భవన్‌కు వస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు గతంలో అన్నారని, అందుకే తాము తెలంగాణ భవన్‌లో సిద్ధంగా ఉన్నామని హరీశ్‌రావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని విపక్షాల గొంతు నొక్కాలని చూస్తోందని మండిపడ్డారు. ఈ సవాళ్లు, ప్రతి సవాళ్లు, అరెస్టుల పర్వంతో హైదరాబాద్‌లోని అసెంబ్లీ పరిసర ప్రాంతాలు మరియు తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు.