ఇస్లాంలో రసాయనాలు నిషిద్ధం.. ఖమేనీ మృతదేహాన్ని 4 నెలల పాటు ఎలా భద్రపరిచారు..
Ayatollah Ali Khamenei
ఇరాన్ మాజీ సర్వోన్నత నాయకుడు ఆయతోల్లా అలీ ఖమేనీ మరణించిన 4 నెలల తర్వాత.. ఎట్టకేలకు ఆయన అంత్యక్రియల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన భీకర వైమానిక దాడిలో ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనవరాలు, పలువురు అగ్రశ్రేణి నాయకులు హతమైన సంగతి తెలిసిందే. ఆ దాడి జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన మృతదేహాన్ని ఖననం చేయకుండా భద్రపరిచారు. తాజాగా ఇరాన్ ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం.. జూలై 9వ తేదీన ఆయన స్వస్థలమైన మషద్ నగరంలో అంతిమ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ముందుగా జూలై 4 నుండి ఐదు రోజుల పాటు దేశవ్యాప్తంగా పలు అధికారిక కార్యక్రమాలు, సంతాప సభలు నిర్వహించనున్నారు.
సాధారణంగా ఇస్లామిక్ చట్టాల ప్రకారం మరణించిన 24 గంటల లోపే అంత్యక్రియలు పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ.. అలీ ఖమేనీ విషయంలో ఈ ప్రకియ ఇంత సుదీర్ఘంగా ఆలస్యం కావడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి మార్చి 4వ తేదీనే అంత్యక్రియలు జరపాలని ఇరాన్ తొలుత భావించినా.. ఆ ప్రాంతంలో కొనసాగుతున్న తీవ్ర యుద్ధ వాతావరణం వల్ల ఆ నిర్ణయం వాయిదా పడింది.

ఆ తర్వాత జూన్ ఆరంభంలో వచ్చే ముహర్రం మాసంలో ఈ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు నిర్వహించాలని యోచించినప్పటికీ.. ఇమామ్ హుస్సేన్ స్మరణార్థం ప్రజలు జరుపుకునే పవిత్ర సంతాప కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ముహర్రం మొదటి 10 రోజుల తర్వాతకు ఈ కార్యక్రమం వాయిదా వేశారు. ఎట్టకేలకు పరిస్థితులు అనుకూలించడంతో జూలై 9న తుది వీడ్కోలు పలకాలని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది.
నాలుగు నెలల పాటు ఈ మృతదేహాన్ని ఎలా భద్రపరిచారనే దానిపై అంతర్జాతీయ వ్యాప్తంగా రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఇస్లామిక్ సంప్రదాయంలో మృతదేహాలపై రసాయనాలను పూసి భద్రపరిచే ‘ఎంబాల్మింగ్’ ప్రక్రియను అనుచితమైనదిగా భావిస్తారు. ఉగ్రవాద నిరోధక నిపుణుడు డాక్టర్ మహమ్మద్ ఒమర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్ నిబంధనల ప్రకారం ప్రత్యేక పరిస్థితుల్లో ఖననాన్ని ఆలస్యం చేసేందుకు మృతదేహాలను కోల్డ్ స్టోరేజ్ (శీతలీకరణ నిల్వ) లో ఉంచడానికి షియా చట్టం అనుమతిస్తుంది.
ఇరాన్ శవగారాలలో మృతదేహాలను నెలల తరబడి సురక్షితంగా ఉంచే అత్యాధునిక సదుపాయాలు ఉండటంతో ఖమేనీ శరీరాన్ని కూడా కోల్డ్ స్టోరేజ్‌లోనే భద్రపరిచారు. అయితే బంకర్‌లోకి చొచ్చుకుపోయే శక్తివంతమైన క్షిపణి దాడిలో ఖమేనీ మరణించినందున.. ఆయన శరీరం చాలా వరకు దెబ్బతిని ఉంటుందని, మిగిలిన భాగాలను డీఎన్ఏ (DNA) పరీక్షల ద్వారానే గుర్తించాల్సి వచ్చిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.