తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్.. బోడుప్పల్‌లో కల్వకుంట్ల కవిత అరెస్ట్
Kavitha
తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా 250 గజాల ప్రభుత్వ ఇళ్ల స్థలాన్ని తక్షణమే కేటాయించాలనే ప్రధాన డిమాండ్‌తో తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఈ ‘భూపోరాట’ నిరసన కార్యక్రమం ప్రారంభమైంది. అయితే, ఉప్పల్ భగాయత్ పరిసర ప్రాంతాల్లో నిరసనకారులు వేసిన టెంట్లను పోలీసులు ముందస్తుగా తొలగించడంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలోనే కవిత సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ ప్రాంతానికి “తెలంగాణ ఉద్యమకారుల రక్షణ కాలనీ” అని నామకరణం చేయడమే కాకుండా, అక్కడ బొడ్రాయిని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు.
ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట, వాగ్వాదం చోటుచేసుకున్నాయి. ఈ గందరగోళంలో కవిత కింద పడిపోవడంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. పరిస్థితి చేజారిపోకుండా చూసేందుకు పోలీసులు కవితతో పాటు వందలాది మంది తెలంగాణ రక్షణ సేన నాయకులను, మహిళా కార్యకర్తలను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి, బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అరెస్ట్ అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ న్యాయమైన హక్కులను, ఇచ్చిన హామీలను అడిగితే మహిళలు, ఉద్యమకారులపై విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేసి రక్తం చిందించడం దారుణమని ఆమె విమర్శించారు. తెలంగాణను సాధించిన ఉద్యమకారులను రోడ్లపైకి ఈడ్చడం ద్వారా, ఈ రోజు నుంచే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని ఆమె హెచ్చరించారు.