Skip to content
ప్రపంచం వార్తలు

ఉక్రెయిన్‌పై రష్యా భారీ క్షిపణి, డ్రోన్ దాడులు..6గురు మృతి, పలువురికి గాయాలు

Prajapaksham 02 Jul 2026 0 నిమిషాల పఠనం ప్రపంచం
ఉక్రెయిన్‌పై రష్యా భారీ క్షిపణి, డ్రోన్ దాడులు..6గురు మృతి, పలువురికి గాయాలు

Russia Ukraine war

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ జ్వాలలు ఏమాత్రం చల్లారడం లేదు. ఇరు దేశాలు పరస్పర దాడులతో రక్తపాతం సృష్టిస్తుండటంతో రోజురోజుకూ పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. తాజాగా గురువారం తెల్లవారుజామున రష్యా సైన్యం ఉక్రెయిన్‌పై మరోసారి డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను లక్ష్యంగా చేసుకుని రాత్రికి రాత్రే భారీ ఎత్తున క్షిపణి, డ్రోన్ దాడులకు తెగబడటంతో నగరం అంతటా భీకర పేలుళ్లు సంభవించాయి. రష్యా సేనలు ఒకేసారి ప్రయోగించిన ఈ ఆయుధాల ధాటికి రాజధాని నగర ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

కీవ్‌తో పాటు ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌ను కూడా రష్యా పూర్తిగా లక్ష్యంగా చేసుకుంది. ఖార్కివ్ పరిసర ప్రాంతాలపై జరిగిన ఈ భీకర దాడుల కారణంగా శక్తివంతమైన పేలుళ్లు సంభవించి, అనేక చోట్ల నివాస సముదాయాలు, భవనాలలో భారీగా మంటలు చెలరేగాయి. ఖార్కివ్‌తో పాటు దేశంలోని వేర్వేరు ప్రాంతాలలో రష్యా జరిపిన ఈ దాడుల వల్ల మొత్తం ఆరుగురు పౌరులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులలో ఒక 15 ఏళ్ల బాలుడు కూడా ఉన్నట్లు స్థానిక వర్గాలు ధృవీకరించాయి. అలాగే ఈ ప్రాంతాల్లో దాదాపు 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు.

మరోవైపు ఉక్రెయిన్ రేవు పట్టణమైన ఒడెస్సా ప్రాంతంపై రష్యా బలగాలు బాలిస్టిక్ క్షిపణులతో వినాశకర దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో ఇద్దరు పౌరులు మృతి చెందగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉక్రెయిన్‌పై రష్యా ఏ క్షణంలోనైనా మళ్లీ పెద్ద ఎత్తున దాడులకు తెగబడే అవకాశం ఉందని ఆ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఈ ఊచకోత జరగడం గమనార్హం. ప్రస్తుతం దాడులు జరిగిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతుండగా, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానిక యంత్రాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *