మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత.. నాగా, కుకీ వర్గాల మధ్య ఘర్షణ.. 20 ఇళ్లకు నిప్పు..
Manipur Violence
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో పాత కక్షలు మరోసారి భగ్గుమన్నాయి. భారత్-మయన్మార్ సరిహద్దు సమీపంలోని కామ్‌జోంగ్ జిల్లాలో బుధవారం నాగా, కుకీ సామాజిక వర్గాలకు చెందిన సాయుధ బృందాలు పరస్పరం దాడులకు తెగబడ్డాయి. ఈ ఘర్షణల్లో ఇరువర్గాలు పగతో గ్రామాల్లోని 20కి పైగా ఇళ్లను అగ్నికి ఆహుతి చేశాయి. ఉదయం వేళ ఒక కుకీ గ్రామం నుంచి వచ్చిన సాయుధులు సమీపంలోని నాగా గ్రామంపై అకస్మాత్తుగా దాడి చేసి 10 ఇళ్లను తగలబెట్టడంతో ఈ హింస మొదలైంది.
దీనికి ప్రతికారంగా మధ్యాహ్నం వేళ మరో వర్గం జరిపిన ఎదురుదాడుల్లో నాగా కమ్యూనిటీకి చెందిన ఇంకో 12 ఇళ్లు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఈ తాజా దాడులతో సరిహద్దు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడంతో రంగంలోకి దిగిన అదనపు భద్రతా బలగాలు గ్రామాల్లో ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తూ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే బుధవారం నాటి హింసాత్మక ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు అధికారికంగా ప్రకటించారు.
ఈ తాజా హింసకు గత నెలల్లో జరిగిన కొన్ని దారుణ సంఘటనలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. గత మే 13న ఆరుగురు నాగా పౌరులను కొందరు అపహరించగా, జూన్ 11న కాంగ్‌పోక్‌పి జిల్లాలో వారి మృతదేహాలు లభ్యమవడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ దారుణ హత్యల అనంతరం రెండు వర్గాల మధ్య తీవ్ర నిరసనలు, ఆర్థిక దిగ్బంధనాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా కుకీలు నివసించే ప్రాంతాలకు నిత్యావసర వస్తువులను తీసుకెళ్లే రవాణా వాహనాల కదలికలపై వివాదాలు రేగడంతో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి.
తాజాగా జరిగిన దాడిపై ప్రముఖ కుకీ సంస్థ ‘కుకీ ఇన్పి మణిపూర్’ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నాగా ఆధిపత్యం ఉన్న కొండ ప్రాంతాల్లోని కుకీ గ్రామాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించింది. భద్రతా బలగాల రక్షణలో ఉన్న సదరు గ్రామం నుంచి, వారు తమ పోస్ట్‌ను ఖాళీ చేసి వెళ్లిన మరుసటి రోజే ఈ దాడి జరగడం వెనుక తీవ్ర భద్రతా లోపాలు ఉన్నాయని, దీనిపై తక్షణమే పారదర్శక విచారణ జరపాలని డిమాండ్ చేసింది.
మరోవైపు ఆరుగురు నాగా పౌరుల హత్యకు తమవారే కారణమని ఒప్పుకుంటూ ‘కుకీ-జో కౌన్సిల్’ ఛైర్మన్ హెన్లియాంతంగ్ థాంగ్లెట్ ఇటీవల బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఆవేశంలో జరిగిపోయిన ఆ తప్పుపై నిష్పక్షపాత విచారణ జరగాలని ఆయన కోరారు. అయితే వివిధ నాగా గ్రూపులు ఈ క్షమాపణలను తీవ్రంగా తిరస్కరించాయి. ఆ క్షమాపణల్లో ఎలాంటి నిజాయతీ లేదని, హత్యలకు బాధ్యులైన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాల్సిందేనని పట్టుబడుతున్నాయి. ఈ పాత కక్షల నేపథ్యమే ఇప్పుడు కామ్‌జోంగ్ జిల్లాను మళ్లీ అశాంతి, హింస వైపు నెట్టింది.