Skip to content
జాతీయం వార్తలు

అయోధ్య రామ మందిర విరాళాల కేసులో కొత్త ట్విస్ట్.. డబ్బులు తీసుకుని ఉద్యోగాలు..

Prajapaksham 02 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
అయోధ్య రామ మందిర విరాళాల కేసులో కొత్త ట్విస్ట్.. డబ్బులు తీసుకుని ఉద్యోగాలు..

Ayodhya Ram Temple Donation Case_

అయోధ్య రామమందిరం విరాళాల దొంగతనం కేసు దర్యాప్తులో రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తూ సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో తవ్వేకొద్దీ విరాళాల చోరీతో పాటు ఆలయంలో ఉద్యోగాల పేరిట భారీగా వసూళ్లకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. కేసులో కీలక నిందితుడైన అవినాష్‌ శుక్లాను పోలీసులు విచారించగా, ఆలయంలోని వివిధ పోస్టుల భర్తీ కోసం అభ్యర్థుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి నియామకాలు చేపట్టినట్లు నిందితుడు అంగీకరించినట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లోని కొందరు కీలక సభ్యుల ప్రమేయం ఉందనే అనుమానంతో వారిని కూడా ప్రశ్నించేందుకు దర్యాప్తు బృందం సిద్ధమవుతోంది.

ఆలయంలో దాదాపు 125 మందిని వివిధ రకాల పోస్టుల్లో నియమించగా, వీరిలో అత్యధికుల నుంచి నిందితులు సొమ్ము వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆశ్చర్యకరంగా ఇప్పటివరకు ఆలయ ఉద్యోగులకు సంబంధించిన అపాయింట్‌మెంట్‌ లెటర్లు, ఫార్మల్‌ సర్వీస్ అగ్రిమెంట్లు సహా ఎలాంటి అధికారిక పత్రాలు పోలీసులకు లభించలేదు. దీంతో అసలు ఈ నియామకాలు ఎవరి ఆదేశాల మేరకు జరిగాయనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇందులో భాగంగానే ఉద్యోగుల బ్యాంకు ఖాతాలు, వారి ఆర్థిక లావాదేవీలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. నియామకాలు జరిగిన సమయంలో వారి ఖాతాల నుంచి ఎవరికైనా భారీగా నగదు బదిలీ అయిందా అనే అంశాన్ని సాంకేతిక ఆధారాలతో సేకరిస్తున్నారు. ఇప్పటికే అరెస్టయిన అనుకల్ప్‌ మిశ్రా, లవ్‌ కుశ్‌ మిశ్రాలు ఈ నియామకాల అవకతవకల్లో సూత్రధారులుగా వ్యవహరించి ఉండొచ్చని పోలీసులు గట్టిగా అనుమానిస్తున్నారు.

మరోవైపు కేసులో అరెస్టయిన ఎనిమిది మంది నిందితులు గతేడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళా సమయంలోనే భక్తుల నుంచి అత్యధిక మొత్తంలో విరాళాలు దోచుకున్నట్లు విచారణలో తేలింది. ఈ క్రమంలోనే అయోధ్య పోలీసులు బుధవారం నిందితుల ఇళ్లపై మరోసారి మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ఓ యోగా కేంద్రం నుంచి ‘రామరాజ్య కోశ్‌’ అనే పేరుతో ఉన్న విరాళాల హుండీని స్వాధీనం చేసుకున్నారు.

ఆ హుండీపై మోసపూరితంగా పేటీఎం క్యూఆర్‌ కోడ్‌ను కూడా ఏర్పాటు చేయడం గమనార్హం. నిందితుల్లో ఒకరైన అవినాశ్‌ శుక్లా గత పదేళ్లుగా ఈ యోగా కేంద్రంలోని ఓ గదిలోనే నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ భారీ విరాళాల కుంభకోణంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు చెందిన కొందరు ఉద్యోగుల పాత్ర కూడా ఉన్నట్లు బలమైన ఆధారాలు లభించడంతో, ఈ బ్యాంకింగ్ మోసాలపై సమగ్ర విచారణ జరపాల్సిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)కు పోలీసులు అధికారికంగా లేఖ రాశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *