Skip to content
జాతీయం వార్తలు

ఉద్యమాల ఉధృతికి 29న కార్మికులు, రైతుల జాతీయ సదస్సు

Prajapaksham 02 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
ఉద్యమాల ఉధృతికి 29న కార్మికులు, రైతుల జాతీయ సదస్సు

AITUC

ఆల్‌ ఇండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ (ఎఐటియుసి) జనరల్‌ కౌన్సిల్‌ సమావేశం 2026 జూన్‌ 1 నుండి 3 వరకు కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్‌లో జరిగింది. ఈ సమావేశానికి 22 రాష్ట్రాలు, వివిధ పారిశ్రామిక సమాఖ్యలు, సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 246 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ప్రపంచ పరిస్థితి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆర్‌ఎస్‌ఎస్‌ బిజెపి ప్రభుత్వ విధానాల కారణంగా ఎదురయ్యే ప్రమాదాల గురించి కౌన్సిల్‌ నివేదిక పేర్కొంది.
భారతదేశం ఆర్థిక పరిస్థితి మొత్తంగా క్షీణించిందని కౌన్సిల్‌ పేర్కొంది. ప్రభుత్వ రుణం వేగంగా పెరుగుతోందని, ఆర్థిక వృద్ధి తగిన న్ని ఉపాధి అవకాశాలను కల్పించడంలో విఫలమైందని విమర్శించింది. ముఖ్యంగా విద్యావంతులైన యువతలో నిరుద్యోగం ఆందోళనకర స్థాయిలో ఉందని నివేదిక సూచించింది. నిరుద్యోగులలో అధిక శాతం 20- ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పట్టభద్రులే ఉన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో యువత నిరుద్యోగం చాలా తీవ్రంగా ఉంది.
కార్మిక శక్తి భాగస్వామ్యం గణనీయంగా తగ్గింది. పెరుగుతున్న జీవన వ్యయాల కారణంగా, కనీస జీవన ప్రమాణాలను పాటించడం కోసం చాలామంది కార్మికులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేయవలసి వస్తోందని, లేదా అధికంగా ఎక్కువ గంటలు పనిచేయవలసి వస్తోందని కౌన్సిల్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఇంటి ఖర్చులకు వేతనాలు సరిపోకపోవడంతో, ఎక్కువ శాతం కార్మికులు రెండవ ఉద్యోగం కోసం వెతుకుతున్నారని సూచించే అధ్యయనాలను నివేదిక ఉటంకించింది. అర్హత కలిగిన యువతను నియమించుకోకుండా, మంజూరైన పోస్టులను ప్రభుత్వం తొలగిస్తుండడాన్ని ఎఐటియుసి కౌన్సిల్‌ తీవ్రంగా విమర్శించింది. రైల్వేరంగంలో పెద్ద ఎత్తున పోస్టులను రద్దు చేయడాన్ని ప్రస్తావిస్తూ, ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వరంగ సంస్థలలో లక్షలాది ఖాళీలు ఉన్నాయని నివేదిక ఎత్తిచూపింది.
సురక్షితమైన ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్టు ఉద్యోగాలు, ఔట్‌సోర్సింగ్‌, నిర్ణీత కాల ఉద్యోగాలు ఎక్కువగా వస్తున్నాయని తెలిపింది. అదే సమయం లో, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ. అమ్మకాలు కొనసాగుతూ, ఆర్థిక స్వావలంబనను బలహీనపరుస్తూ, స్థిరమైన ఉపాధి అవకాశాలను తగ్గిస్తున్నాయి. దేశవ్యాప్తంగా నోయిడా, మానేసర్‌, భివాడి, నీమ్రానా, పితంపూర్‌, బరౌని, పానిపట్‌, సూరత్‌, ఇతర పారిశ్రామిక ప్రాంతాలతో సహా పారిశ్రామిక కేంద్రాలలో ఇటీవల జరిగిన కార్మిక అశాంతికి సంబంధించి అత్యంత ముఖ్యమైన చర్చలు జరిగాయి.
క్షీణిస్తున్న జీవన పరిస్థితులు, స్తంభించిపోయిన వేతనాలు, పెరుగుతున్న ఇంధన ధరలు, అభద్రతతో కూడిన ఉపాధి, కార్మిక హక్కుల నిరాకరణ వంటి కారణాలతో ఈ నిరసనలు వెల్లువెత్తినట్లు కౌన్సిల్‌ భావించింది. పారిశ్రామిక కార్మికులలో అధిక శాతం మంది వలస కార్మికులు, వీరికి ప్రాథమిక సేవలు పరిమితంగా అందుబాటులో ఉండడంతో క్లిష్టపరిస్థితులలో జీవిస్తున్నారు.
అధిక వేతనాలు, ఎనిమిది గంటల పనిదినాలు, ఓవర్‌టైమ్‌ పరిహారం వంటి విషయాలపైనే ఎక్కువగా కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. పని ప్రదేశంలో భద్రత, సామాజిక భద్రతా సౌకర్యం, వేతనంతో కూడిన సెలవులు, జాబ్‌ కార్డులు, పేస్లిప్‌లు, పనిలో గౌరవం కోరుతున్నారు. కార్మికుల నిరసనలపై అరెస్టులు, పోలీసు చర్యలు, చట్టపరమైన అణచివేత ద్వారా స్పందిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వాల అధికారులను కౌన్సిల్‌ నివేదిక విమర్శించింది.
పారిశ్రామిక కేంద్రాలలో క్షీణిస్తున్న పని, జీవన పరిస్థితుల కారణంగా కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు తిరిగి వెళుతున్నారని, తద్వారా రివర్స్‌ మైగ్రేషన్‌ (వెనక్కి వలస వెళ్తున్న) సంకేతాలు కనిపిస్తున్నాయని కౌన్సిల్‌ గుర్తించింది. దీనికి సూరత్‌ వస్త్ర పరిశ్రమను ఉదాహరణగా పేర్కొన్నారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో వలస కార్మికులు తమ ఉద్యోగాలను వదిలిపెట్టినట్లు నివేదిక లు వచ్చాయి. కార్మికుల అంతర్లీన సమస్యలను పరిష్కరించకుండా వదిలేస్తే, ఇటువంటి పరిణామాలు విస్తృత ఆర్థిక అంతరాయాలను సృష్టించగలవని నివేదిక హెచ్చరించింది. ప్రభుత్వరంగ విమానయాన నిర్వహణ సేవల్లో పనిచేస్తున్న ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఇంజనీర్లు ఇటీవల ఎదుర్కొంటున్న కష్టాల గురించి కౌన్సిల్‌ చర్చించింది. చాలా సంవత్సరాలుగా అత్యంత నైపుణ్యం, బాధ్యతాయుతమైన పని చేస్తున్నప్పటికీ, ఈ కార్మికులు శాశ్వత ఉద్యోగులతో పోలిస్తే తక్కువ వేతనాలు, ఎక్కువ పని గంటలు, నాసిరకమైన ఉపాధి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇటువంటి వివక్ష ఆర్థిక వ్యవస్థ అంతటా కార్మికులను ప్రభావితం చేస్తున్న ఒక విస్తృత ధోరణిని ప్రతిబింబిస్తుందని కౌన్సిల్‌ పేర్కొంది.
నాలుగు కార్మిక చట్టాలను తక్షణమే రద్దు చేయాలన్న డిమాండ్‌ను ఎఐటియుసి జనరల్‌ కౌన్సిల్‌ పునరుద్ఘాటించింది. ఈ చట్టాలు సామూహిక బేరసారాల హక్కులను, కార్మిక రక్షణలను బలహీనపరుస్తాయని పేర్కొంది. ప్రభుత్వం ఆలస్యం చేయకుండా భారత కార్మిక సదస్సును ఏర్పాటు చేసి, కార్మిక సంఘాలతో అర్థవంతమైన చర్చలు జరపాలని పిలుపునిచ్చింది. కార్మికులు, రైతులు, యువత, మహిళలు, ప్రజాస్వామ్యం, శాంతి, సామాజిక న్యాయానికి సంబంధించిన అనేక జాతీయ, అంతర్జాతీయ సమస్యలను చర్చించిన ఎఐటియుసి జనరల్‌ కౌన్సిల్‌ 29 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఎఐటియుసి జనరల్‌ కౌన్సిల్‌
ఆమోదించిన తీర్మానాలు
కార్మిక హక్కుల పరిరక్షణ, యుద్ధం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకత, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ, ఉపాధి కల్పన, ప్రభుత్వ రంగ బలోపేతం, సార్వత్రిక సామాజిక భద్రత, రైతులు వ్యవసాయ కార్మికులకు మద్దతు. విద్య ఆరోగ్య సంరక్షణ విస్తరణ. లౌకిక, రాజ్యాంగ విలువల పరిరక్షణ.
కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, దేశ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రస్తుత పరిస్థితిలో సామూహిక పోరాటాలను తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందని మండలి పిలుపునిచ్చింది. ఇది కార్మిక సంఘాల మధ్య ఐక్యత, కార్మికులు, రైతుల మధ్య బలమైన సమన్వయం ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. ప్రస్తుత కాలంలోని అత్యంత ముఖ్యమైన సానుకూల పరిణామాలలో ఒకటి కార్మిక- ఐక్యత అని కౌన్సిల్‌ కొనియాడింది.
ఈ కూటమిని బలోపేతం చేసేందుకు, భవిష్యత్‌ పోరాటాల కోసం ఒక ఉమ్మడి వ్యూహాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో జులై 29న కార్మికులు, రైతుల జాతీయ సదస్సు కోసం ప్రణాళికలను మండలి ఆమోదించింది. కార్మికులు, రైతులు, యువత, మహిళలు, ప్రజాస్వామ్య శక్తుల మధ్య విస్తృత ఐక్యత కోసం పిలుపునిస్తూ ఎఐటియుసి జనరల్‌ కౌన్సిల్‌ ముగిసింది.
ప్రజలు తమ హక్కులను కాపాడుకోవాలని, ప్రైవేటీకరణ, కార్పొరేట్‌ ఆధిపత్యాన్ని ప్రతిఘటించాలని, ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయాలని, సమానత్వం, గౌరవం, న్యాయం, శాంతి, సామాజిక పురోగతి కోసం పోరాటాలను ముందుకు తీసుకెళ్లాలని కోరింది. సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య హక్కులు, ఆర్థిక సమానత్వం ఆధారంగా సమాజాన్ని నిర్మించాలనే తమ నిబద్ధతను మండలి పునరుద్ఘాటించింది.
అమర్‌జీత్‌ కౌర్‌ – ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి

ట్యాగ్‌లు: AITUC farmers Protest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *