Skip to content
బిజినెస్ వార్తలు

వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఫోన్ నంబర్ల స్థానంలో ఇకపై యూజర్‌నేమ్‌లు..

Prajapaksham 30 Jun 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఫోన్ నంబర్ల స్థానంలో ఇకపై యూజర్‌నేమ్‌లు..

Whatsapp news

వినియోగదారుల గోప్యతను మరింత పటిష్టం చేసే దిశగా ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వినియోగదారులు తమ ఫోన్ నంబర్లను ఇతరులకు వెల్లడించాల్సిన అవసరం లేకుండా, కేవలం ‘యూజర్‌నేమ్‌ల’ (Usernames) ద్వారానే చాట్ చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ ఏడాది చివర్లో ఈ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుండగా, వినియోగదారులు తమకు నచ్చిన ప్రత్యేకమైన యూజర్‌నేమ్‌లను ముందుగానే రిజర్వ్ చేసుకునే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు వాట్సాప్ వెల్లడించింది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 3 బిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న వాట్సాప్‌లో.. ఒకరినొకరు సంప్రదించాలంటే ఫోన్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. అయితే రాబోయే నెలల్లో ఈ విధానానికి స్వస్తి పలికి, కేవలం యూజర్‌నేమ్‌ల ద్వారానే ఒకరినొకరు కనుగొని మెసేజ్ పంపే సదుపాయాన్ని తీసుకురానున్నట్లు మెటా యాజమాన్యంలోని ఈ సంస్థ స్పష్టం చేసింది. దీనిని ఒక అత్యంత ప్రధానమైన గోప్యతా ఫీచర్‌గా వాట్సాప్ ప్రోడక్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆలిస్ న్యూటన్-రెక్స్ అభివర్ణించారు.

వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ఫీచర్‌లో కొన్ని కఠినమైన నిబంధనలను వాట్సాప్ పొందుపరిచింది. యాప్‌లో యూజర్‌నేమ్‌లకు సంబంధించిన ఎలాంటి ప్రత్యేక డైరెక్టరీ ఉండదు. అలాగే ఎవరైనా సెర్చ్ బార్‌లో టైప్ చేస్తున్నప్పుడు పేర్లను కూడా యాప్ స్వయంగా సూచించదు (No auto-suggestions). అంటే, అవతలి వ్యక్తి మిమ్మల్ని వాట్సాప్‌లో సంప్రదించాలంటే మీ ఖచ్చితమైన యూజర్‌నేమ్ వారికి ముందే తెలిసి ఉండాలి. ప్రస్తుత సెట్టింగ్‌లలో తెలియని నంబర్ల నుండి వచ్చే కాల్స్‌ను సైలెంట్ చేయడం లేదా బ్లాక్ చేయడం వంటి పరిమిత ఆప్షన్లు మాత్రమే ఉండగా, ఈ కొత్త ఫీచర్‌తో నంబర్ల దుర్వినియోగానికి పూర్తిగా అడ్డుకట్ట పడనుంది.

యూరప్, ఆసియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ ఉన్న ఈ యాప్‌లో ఆకర్షణీయమైన యూజర్‌నేమ్‌ల కోసం గిరాకీ ఎక్కువగా ఉంటుందని సంస్థ భావిస్తోంది. అందుకే ఈ రిజర్వేషన్ ప్రక్రియను ముందే ప్రారంభించారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో ఇప్పటికే అధికారిక ఖాతాలు ఉన్న కంపెనీలు, సంస్థలు, ,క్రియేటర్లకు వాట్సాప్‌లో కూడా అదే యూజర్‌నేమ్‌లను క్లెయిమ్ చేసుకునేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు.

ఈ యూజర్‌నేమ్‌లు 3 నుండి 35 అక్షరాల మధ్యలో ఉండాలి. నకిలీ ఖాతాలను (Fake Accounts), మోసాలను నివారించడానికి సెలబ్రిటీలు, ప్రముఖ వ్యక్తులు, ,ప్రభుత్వ సంస్థల పేర్లతో ఇతరులు యూజర్‌నేమ్‌లను క్రియేట్ చేసుకోకుండా వాట్సాప్ ప్రత్యేక ఆంక్షలను విధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *