Skip to content
జాతీయం వార్తలు

అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగం కేసు.. ఇంత అత్యవసర విచారణ ఏముంది అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు..

Prajapaksham 29 Jun 2026 1 నిమిషాల పఠనం జాతీయం
అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగం కేసు.. ఇంత అత్యవసర విచారణ ఏముంది అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు..

Ram Temple Donation Case: SC Refuses Fast-Track Hearing in Ram Temple Fund Misappropriation Plea

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణానికి సంబంధించి సేకరించిన విరాళాల దుర్వినియోగం వ్యవహారం దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు చేరింది. రామాలయ ట్రస్ట్‌ నిధుల సేకరణ, భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలపై ఒక నిష్పాక్షికమైన విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (PIL) దాఖలైంది.

దేశవ్యాప్తంగా కోట్ల మంది భక్తుల సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న అంశం కాబట్టి, ఈ వ్యవహారంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) నేతృత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అంతేకాకుండా, ఈ విచారణ అంతా కోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలోనే జరగాలని, ఒక నిర్ణీత కాలవ్యవధిలో (టైమ్ బౌండ్) దర్యాప్తు పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

అయితే, ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న పిటిషనర్ అభ్యర్థనను సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ తోసిపుచ్చింది. ప్రస్తుతానికి ఈ అంశంపై అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ, వేసవి సెలవులు (సమ్మర్ వెకేషన్స్) ముగిసిన తర్వాత కోర్టు పునఃప్రారంభమయ్యాక సాధారణ ప్రక్రియలో భాగంగా దీనిని విచారణకు స్వీకరిస్తామని ధర్మాసనం పేర్కొంది. ఈ సందర్భంగా పిటిషనర్‌ తీవ్రతను తగ్గించేలా వ్యాఖ్యానించిన కోర్టు, “ఈలోపే మిన్ను విరిగి మీద పడదు కదా.. అంత తొందరెందుకు?” అని ప్రశ్నిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

ఇదిలా ఉండగా, ఈ విరాళాల అక్రమాల వ్యవహారంలో స్థానిక న్యాయవాదుల నుండి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారి పక్షాన నిలబడి కోర్టులో ఎవరూ వాదించకూడదని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ ఒక సంచలన తీర్మానాన్ని ఆమోదించింది. లాయర్ల అసోసియేషన్ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా నిందితుల తరఫున వకాలత్ పుచ్చుకుంటే, వారిపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు ఉంటాయని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కలికా ప్రసాద్ మిశ్రా మీడియా ముఖంగా హెచ్చరించారు.

అలా చేసిన న్యాయవాదుల సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు రూ. 5 లక్షల వరకు భారీ జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. ఫైజాబాద్ న్యాయవాదులు ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2005వ సంవత్సరంలో అయోధ్యలోని తాత్కాలిక రామ మందిరంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడినప్పుడు కూడా, పట్టుబడిన నిందితుల తరఫున వాదించడానికి ఫైజాబాద్ కోర్టుకు చెందిన ఏ ఒక్క న్యాయవాదీ ముందుకు రాకుండా తమ దేశభక్తిని, నిరసనను చాటుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *