Skip to content
తెలంగాణ వార్తలు

How to Fill SIR Form Online: ‘సర్’ ఫారం నింపడం సులభమే..

Prajapaksham 28 Jun 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
How to Fill SIR Form Online: ‘సర్’ ఫారం నింపడం సులభమే..

ai generated

రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ
ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్న బీఎల్ఓలు
2002 ఓటర్ల జాబితా ఆధారంగా ప్రస్తుత ఓటర్ల వివరాల ధృవీకరణ

ప్రజాపక్షం/హైదరాబాద్ : రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ ఏడాది చివర్లో విడుదల చేయనున్న తుది ఓటర్ల జాబితాను మరింత కచ్చితత్వంతో రూపొందించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టింది. ఇందులో భాగంగా బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా పరిశీలిస్తున్నారు. ఎస్ఐఆర్ సర్వేలో భాగంగా ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి చేసి బీఎల్ఓలకు అందజేయాల్సి ఉంటుంది. 2002లో ఓటు హక్కు కలిగిన వారు అప్పటి ఓటర్ల జాబితాలో తమ పేరు ఎక్కడ నమోదై ఉందో వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. తెలియని వారు బీఎల్ఓల వద్ద ఉన్న పాత జాబితా ద్వారా లేదా ఎన్నికల సంఘం సిటిజన్ సర్వీస్ పోర్టల్‌లో స్వయంగా పరిశీలించుకోవచ్చు.

2002 ఓటర్ల జాబితాలో పేరు ఇలా చెక్ చేసుకోండి
ముందుగా ఎన్నికల సంఘం సిటిజన్ సర్వీస్ పోర్టల్‌ను సందర్శించాలి. అక్కడ ‘సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లిస్ట్ ఎస్ఐఆర్’ ఎంపికను క్లిక్ చేసి, ‘సెర్చ్ బై ఎలక్టోరల్ డిటైల్స్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం రాష్ట్రం, జిల్లా, 2002 నాటి శాసనసభ నియోజకవర్గాన్ని ఎంపిక చేసి, ఓటరు పేరు, క్యాప్చా నమోదు చేసి సెర్చ్ చేయాలి. దీంతో సంబంధిత ఓటర్ల జాబితా ప్రదర్శించబడుతుంది. అందులో తమ పేరు, పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్, పోలింగ్ కేంద్రం వంటి వివరాలను తెలుసుకోవచ్చు.

ఫారంలో ఏ వివరాలు నమోదు చేయాలి?
2002 ఓటర్ల జాబితాలో లభించిన వివరాల ఆధారంగా ఓటరు పేరు, తండ్రి లేదా భర్త పేరు, బంధుత్వం, వయస్సు, జిల్లా, నియోజకవర్గం, పోలింగ్ కేంద్రం, పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్ వంటి వివరాలను ఎన్యూమరేషన్ ఫారంలో నమోదు చేయాలి. బీఎల్ఓలు ఇచ్చే ఫారంలో ఇప్పటికే ఓటరు పేరు, చిరునామా, ఎపిక్ నెంబర్, నియోజకవర్గం, పాత ఫొటో, క్యూఆర్ కోడ్ వంటి వివరాలు ముద్రించి ఉంటాయి.

పాత ఫొటో పక్కన తాజా పాస్‌పోర్ట్ సైజు ఫొటోను అతికించాలి. మొదటి కాలమ్‌లో 2002 ఓటర్ల జాబితాలో ఉన్న వివరాలను నమోదు చేయాలి. రెండో కాలమ్‌లో 2002 జాబితాలో ఉన్న ఓటరుతో తనకు ఉన్న బంధాన్ని రాయాలి. అనంతరం జన్మ తేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, తల్లి, తండ్రి, జీవిత భాగస్వామి పేర్లు, వారి ఎపిక్ నెంబర్లు తెలిసి ఉంటే నమోదు చేయాలి. ఎన్యూమరేషన్ ఫారాన్ని రెండు ప్రతులుగా నింపాలి. ఒక ప్రతిని బీఎల్ఓకు అందజేయగా, మరో ప్రతిని రసీదుగా తమ వద్ద భద్రపరచుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు. దీంతో భవిష్యత్తులో అవసరమైనప్పుడు దానిని ఆధారంగా ఉపయోగించుకోవచ్చని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *