Skip to content
జాతీయం వార్తలు

ఆపరేషన్ సిందూర్‌లో అమరులైన జవాన్లు వీరే..అధికారికంగా ప్రకటించిన కేంద్రం..

Prajapaksham 26 Jun 2026 1 నిమిషాల పఠనం జాతీయం
ఆపరేషన్ సిందూర్‌లో అమరులైన జవాన్లు వీరే..అధికారికంగా ప్రకటించిన కేంద్రం..

Operation Sindoor Heroes Revealed: India Announces Names of Six Martyrs

గతేడాది పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై భారత సైన్యం అత్యంత సాహసోపేతంగా చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)’లో వీరమరణం పొందిన దేశ రక్షకుల వివరాలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దేశ భద్రత కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన ఆరుగురు అమరవీరుల పేర్లను కేంద్రం మొదటిసారిగా బహిర్గతం చేస్తూ.. న్యూఢిల్లీలోని నేషనల్‌ వార్‌ మెమోరియల్‌ (National War Memorial) అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చింది.

దేశ రాజధానిలోని ఇండియా గేట్‌ సర్కిల్‌లో ఉన్న జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోయే శిలాఫలకంపై ఈ అమరవీరుల పేర్లను శాశ్వతంగా చెక్కనున్నారు. దేశం కోసం పోరాడి అమరులైన ఆ ఐదుగురు ఆర్మీ అధికారులు, ఒక అగ్నివీర్ వీరజవానుల వివరాలు..

సుబేదార్‌ మేజర్‌ పవన్‌ కుమార్‌- 10 ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్‌ హెడ్‌క్వార్టర్స్‌
రైఫిల్‌మ్యాన్‌ సునీల్‌ కుమార్‌- జమ్మూకశ్మీర్‌ లైట్‌ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్‌ (4వ బెటాలియన్‌)
లాన్స్‌ నాయక్‌ దినేశ్‌ కుమార్‌- 5 ఫీల్డ్‌ రెజిమెంట్‌
హవల్దార్… సునీల్‌ కుమార్‌ సింగ్‌ – 237 ఫీల్డ్‌ వర్క్‌షాప్‌
సార్జెంట్‌ సురేంద్ర కుమార్‌ – భారత వైమానిక దళం (ఎయిర్‌ఫోర్స్‌ 39వ వింగ్‌)
అగ్నివీర్‌ మురళీ నాయక్‌- 851 లైట్‌ రెజిమెంట్‌

ఈ ఆపరేషన్‌లో అసాధారణమైన పోరాట పటిమను ప్రదర్శించిన రైఫిల్‌మ్యాన్‌ సునీల్ కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం మరణానంతరం దేశపు మూడో అత్యున్నత యుద్ధ పురస్కారమైన ‘వీర చక్ర’ను ప్రకటించి గౌరవించింది. అలాగే ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సార్జెంట్‌ సురేంద్ర కుమార్‌ను ‘వాయు సేన మెడల్‌’తో సత్కరించింది.

ఈ ఆపరేషన్‌లో వీరమరణం పొందిన వారిలో అగ్నివీర్‌ మురళీ నాయక్‌ తెలుగు వ్యక్తి కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లా కళ్లితండాకు చెందిన మురళీ నాయక్, 2022లో సైన్యానికి ఎంపికై అగ్నివీర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. తొలుత పంజాబ్‌, అస్సాం సరిహద్దుల్లో సేవలందించిన ఆయన, ‘ఆపరేషన్‌ సిందూర్‌’ సమయంలో జమ్మూకశ్మీర్‌ సరిహద్దుల్లో విధుల్లో ఉన్నారు. పాక్ సైన్యం, ఉగ్రవాదులతో జరిగిన హోరాహోరీ ఎదురుకాల్పుల్లో ఆయన దేశ రక్షణకై ప్రాణాలర్పించారు.

2025 ఏప్రిల్‌ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన అమానుష దాడిలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణానికి ప్రతీకారంగా, భారత సైన్యం మే 7వ తేదీన పాకిస్థాన్‌ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను చేపట్టి శత్రుమూకలను మట్టికరిపించింది. ఈ పోరాటంలోనే భారత్ తన వీరజవాన్లను కోల్పోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *