Skip to content
తెలంగాణ వార్తలు

బాధితులతో దురుసుగా ప్రవర్తిస్తే సహించేది లేదు.. పోలీసు సిబ్బందికి సీవీ సజ్జనార్ హెచ్చరిక

Prajapaksham 25 Jun 2026 0 నిమిషాల పఠనం తెలంగాణ
బాధితులతో దురుసుగా ప్రవర్తిస్తే సహించేది లేదు.. పోలీసు సిబ్బందికి సీవీ సజ్జనార్ హెచ్చరిక

CV Sajjanar Warns Police Personnel Against Misbehavior with Victims

హైదరాబాద్‌ నగర పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితుల పట్ల కొందరు సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై నగర పోలీస్ కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చే ప్రజలతో అమర్యాదగా, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్న సిబ్బందిపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన ఉన్నత స్థాయి నేర సమీక్షా సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

కష్టాల్లో ఉండి, మానసిక వేదనతో ఆసరా కోసం పోలీస్ స్టేషన్ గడప తొక్కే ప్రజలతో వ్యవహరించాల్సిన పద్ధతి ఇదేనా అంటూ అధికారులను సీపీ నిలదీశారు. కొన్ని స్టేషన్లలో రిసెప్షనిస్టులు, పరిపాలనా బాధ్యతలు చూసే అడ్మిన్ ఎస్సైల ప్రవర్తన సరిగా లేదని, సమయపాలన కూడా పాటించడం లేదని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్టేషన్లలో పర్యవేక్షణ లోపించినందుకు బాధ్యులుగా గుర్తిస్తూ కొందరు ఇన్‌స్పెక్టర్లకు ఇప్పటికే ఛార్జిమెమోలు కూడా జారీ చేసినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది.

ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో, క్షేత్రస్థాయిలో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సీపీ ఒక వినూత్న వ్యూహాన్ని అమలు చేశారు. ఇందులో భాగంగా ఆయన స్వయంగా డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించారు. కొందరు పోలీసు అధికారులనే సాధారణ పౌరులుగా మార్చి, సివిల్ డ్రెస్‌లో ఫిర్యాదులు చేసేందుకు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు పంపించారు. ఆయా స్టేషన్లలో సిబ్బంది స్పందించిన తీరు, బాధితులకు ఎదురైన అనుభవాలపై ప్రత్యేకంగా నివేదిక తెప్పించుకున్నారు.

ఈ రహస్య ఆపరేషన్‌లో దాదాపు 12 పోలీస్ స్టేషన్లలో సిబ్బంది తీరు అత్యంత దారుణంగా ఉన్నట్లు వెల్లడైంది. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వారితో రిసెప్షనిస్టులు, ఏఎస్సైలు కఠినంగా మాట్లాడటం, అది తమ పరిధిలోకి రాదంటూ పక్క స్టేషన్లకు నెట్టేయడం, సూటిపోటి మాటలతో వేధించడం వంటివి ఈ తనిఖీల్లో స్పష్టంగా బయటపడ్డాయి. అంతేకాకుండా, బాధితులు ఇచ్చిన ఫిర్యాదును వెంటనే స్వీకరించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా, రేపు రా మాపు రా అంటూ రోజుల తరబడి తిప్పించుకున్నట్లు రుజువైంది.

ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి కమిషనర్ భావోద్వేగంగా మాట్లాడారు. మీ కుటుంబ సభ్యులే ఏదైనా సమస్యపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు, అక్కడ ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులే ఎదురైతే మీరెలా భావిస్తారో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోమని హితవు పలికారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అనేది కేవలం మాటలకే పరిమితం కాకూడదని, ఇకపై ప్రజా సమస్యల పట్ల అలసత్వం వహిస్తే సస్పెన్షన్లు, బదిలీలు వంటి కఠిన చర్యలు తప్పవని ఆయన గట్టిగా హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *