హైదరాబాద్‌కు బిగ్ అలర్ట్. జూన్ 27 వరకు భారీ వర్షాల హెచ్చరిక.. ఉద్యోగులకు, విద్యార్థులకు పోలీసుల కీలక అడ్వైజరీ..
Heavy Showers Expected in Hyderabad; Commuters Advised to Stay Prepared
తెలంగాణవ్యాప్తంగా రానున్న రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయంటూ భారత వాతావరణ శాఖ (IMD) జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు అత్యంత అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఐటీ హబ్ పరిధిలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు, లోతట్టు ప్రాంతాలలో నీటి నిల్వ సమస్యల వల్ల వాహనదారులు ఇబ్బంది పడకుండా చూసేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ విభాగాధికారులు ఒక కీలకమైన ముందస్తు అడ్వైజరీని (Advisory) జారీ చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇతర వాణిజ్య కార్యాలయాలు, అలాగే విద్యాసంస్థలు సోమవారం నుంచే సాయంత్రం 3:30 గంటల సమయం నుండే తమ ఉద్యోగులను, విద్యార్థులను ఒకేసారి కాకుండా విడతల వారీగా (Staggered timings) ఇళ్లకు పంపాలని స్పష్టమైన మార్గదర్శకాలను సూచించారు.
వాతావరణ కేంద్రం తాజా నివేదికల ప్రకారం, రాష్ట్రంలో జూన్ 27వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన వానలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా భాగ్యనగరంలో జూన్ 24వ తేదీ వరకు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఈ తీవ్ర వాతావరణ పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న పలు జిల్లాలకు అధికారులు ఇప్పటికే ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించారు. గతంలో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి కీలక ఐటీ ప్రాంతాలలో కిలోమీటర్ల మేర తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి, లక్షలాది మంది ఉద్యోగులు, వాహనదారులు అర్ధరాత్రి వరకు రోడ్లపైనే నరకయాతన అనుభవించిన చేదు జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి అలాంటి ప్రధాన రహదారుల దిగ్బంధం పునరావృతం కాకుండా పోలీసులు ఈ ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు.
ఐటీ కారిడార్‌లోని ఉద్యోగులందరూ ఒకే సమయానికి ఆఫీసుల నుండి రోడ్లపైకి రావడం వల్లే విపరీతమైన రద్దీ ఏర్పడుతుందని, దాన్ని నివారించడానికే ఈ విడతల వారీ నిష్క్రమణ విధానాన్ని ప్రతిపాదించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. సోమవారం మధ్యాహ్నం వరకు నగరంలో ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ పెద్దగా భారీ వర్షపాతం నమోదు కానప్పటికీ, రానున్న గంటల్లో ,రోజుల్లో వాన తీవ్రత అకస్మాత్తుగా పెరిగే ముప్పు ఉందని విపత్తు నిర్వహణ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సైబరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా లోతట్టు వంతెనలు, రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల గుండా ప్రయాణించేటప్పుడు ద్విచక్ర వాహనదారులు, కారు చోదకులు అత్యంత అప్రమత్తంగా ఉంటూ ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటించాలని కోరారు.