Skip to content
ప్రపంచం వార్తలు

డిజిటల్ చదువులకు గుడ్ బై చెప్పిన స్వీడన్.. పాఠశాలల్లోకి పుస్తకాలు రీ ఎంట్రీ.. కారణం ఏంటంటే..

Prajapaksham 22 Jun 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
డిజిటల్ చదువులకు గుడ్ బై చెప్పిన స్వీడన్.. పాఠశాలల్లోకి పుస్తకాలు రీ ఎంట్రీ.. కారణం ఏంటంటే..

Swedish Schools Return to Paper Amid Concerns Over Digital Learning Impact

ఒకప్పుడు క్లాస్‌రూమ్‌లలోకి ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, ,స్మార్ట్ స్క్రీన్‌లను తీసుకురావడంలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిన స్వీడన్ దేశం ఇప్పుడు తన విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు చేస్తోంది. పాఠశాలల్లో డిజిటల్ పరికరాల వాడకం విపరీతంగా పెరిగిపోవడం వల్ల పిల్లల సహజసిద్ధమైన అభ్యాస సామర్థ్యం ,ఏకాగ్రత దెబ్బతింటున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వీడన్ ప్రభుత్వం సాంకేతికతపై ఆధారపడటాన్ని తగ్గించి, ముద్రిత పాఠ్యపుస్తకాల (Physical Textbooks) పునరుద్ధరణ కోసం భారీగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభించింది.

స్టాక్‌హోమ్‌లోని ప్రముఖ బాండ్‌హాగెన్ పాఠశాలలో ప్రస్తుతం నాల్గవ తరగతి విద్యార్థులు తమ పాఠ్యాంశాలలో కొంత సమయం నచ్చిన కథల పుస్తకాలను చదవడం, ఆపై ముద్రిత సామగ్రిని క్లాస్‌రూమ్‌లో బిగ్గరగా చదవడం వంటి పద్ధతులను పాటిస్తున్నారు. కాగితం ఆధారిత సాంప్రదాయ అభ్యాసం వైపు స్వీడన్ విద్యా వ్యవస్థ తిరిగి మళ్లుతోందనడానికి ఈ దృశ్యమే ఒక స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తోంది. గ్యాడ్జెట్స్‌పై చదవడం వల్ల సాధారణంగా తలనొప్పి వస్తోందని, అదే భౌతిక పుస్తకాలను చేతితో పట్టుకుని చదివినప్పుడు చదువుపై మెరుగ్గా ఏకాగ్రత పెట్టగలుగుతున్నామని అక్కడి విద్యార్థులు సైతం అభిప్రాయపడుతున్నారు.

స్వీడన్ దేశం సుమారు 2010వ సంవత్సరంలో పాఠశాలల్లో డిజిటల్ పరికరాల వినియోగాన్ని అత్యంత వేగంగా విస్తరించింది. అయితే, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (OECD) నిర్వహించిన ‘అంతర్జాతీయ విద్యార్థి మదింపు కార్యక్రమం’ (Program for International Student Assessment-PISA) ఫలితాలు విడుదలయ్యాక దేశంలో దీనిపై పెద్ద చర్చ మొదలైంది. ఈ నివేదిక ప్రకారం 2018 ,2022 సంవత్సరాల మధ్య కాలంలో స్వీడన్ విద్యార్థుల పఠన సామర్థ్యం (Reading) ,గణిత స్కోర్‌లలో తీవ్రమైన క్షీణత నమోదైంది.

ఈ విద్యా క్షీణతపై ప్రభుత్వం నియమించిన ప్రముఖ నాడీ శాస్త్రవేత్తలు (Neuroscientists), శిశువైద్య నిపుణుల కమిటీ క్షుణ్ణంగా సమీక్ష నిర్వహించింది. చిన్న వయసులోనే డిజిటల్ పరికరాలపై విపరీతంగా ఆధారపడటం వల్ల పిల్లల్లో శ్రద్ధ, జ్ఞాపకశక్తి ,ఏకాగ్రత లోపిస్తున్నాయని వారు తేల్చారు. కొత్త విషయాలను సులభంగా నేర్చుకోవడానికి, వాటిని ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి డిజిటల్ స్క్రీన్స్ కంటే ముద్రిత కాగితపు సామగ్రి అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని ఈ సమీక్షలో శాస్త్రీయంగా నిరూపితమైంది.

ఈ నిపుణుల నివేదికకు ప్రతిస్పందనగా స్వీడన్ ప్రభుత్వం 2023వ సంవత్సరంలో తన విద్యా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ప్రాథమిక తరగతుల విద్యార్థులకు కాగితం ఆధారిత బోధనను తప్పనిసరి చేయడంతో పాటు, ప్రీస్కూల్స్ ,జూనియర్ హైస్కూల్స్ వరకు ఉన్న నిర్బంధ పాఠశాలల్లో నూతన పాఠ్యపుస్తకాలు, ఇతర ముద్రిత బోధనా సామగ్రిని అందుబాటులోకి తెచ్చేందుకు నిధుల వరద పారించింది.

ఇందులో భాగంగా 2025వ సంవత్సరం వరకు ఏటా 658 మిలియన్ల నుండి 755 మిలియన్ల క్రోనార్ల (సుమారు $70 మిలియన్ల నుండి $80 మిలియన్ల అమెరికన్ డాలర్లు) భారీ బడ్జెట్‌ను ప్రత్యేకంగా కేటాయించింది. మెదడు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందని చిన్నపిల్లలు డిజిటల్ పరికరాల ప్రతికూల ప్రభావాలకు చాలా త్వరగా గురయ్యే అవకాశం ఉందని శాస్త్రీయ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయని, అందుకే తాము ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని పార్లమెంట్ విద్యా కమిటీ ఛైర్మన్ జోర్ ఫోర్సెల్ సమర్థించారు.

ప్రపంచంలోని కొన్ని దేశాలు తమ విద్యా వ్యవస్థను మరింత డిజిటలైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో స్వీడన్ మాత్రం ముద్రిత పుస్తకాల వైపు మొగ్గు చూపడం గమనార్హం. ఉదాహరణకు జపాన్ దేశంలో పాఠశాలల్లో డిజిటల్ పాఠ్యపుస్తకాలను అధికారిక బోధనా సామగ్రిగా ప్రవేశపెట్టడానికి ఇటీవల ఒక సవరించిన చట్టం కూడా అమలులోకి వచ్చింది. అయితే, స్వీడన్‌లోని విద్యార్థుల బలహీనమైన విద్యా ప్రదర్శనకు కేవలం టెక్నాలజీ మాత్రమే కారణం కాదని కొందరు పరిశోధకులు ,విద్యావేత్తలు వాదిస్తున్నారు.

దేశంలో మారిన జనాభా పరిస్థితులు, వలస కుటుంబాల విద్యార్థులు ఎదుర్కొంటున్న భాషా సమస్యలు కూడా దీనికి కారణమని వారు గుర్తుచేస్తున్నారు. ఎందుకంటే స్వీడన్ దేశం సుమారు 2015వ సంవత్సరం నుండి సిరియా, ఆఫ్ఘనిస్తాన్ ,పలు ఆఫ్రికా దేశాల నుండి లక్షలాది మంది వలసదారులను, శరణార్థులను ఆశ్రయమిచ్చి చేరదీసింది. ఈ నేపథ్యంలో కేవలం సాంకేతికతను మాత్రమే పూర్తిగా నిందించడం సరికాదని, ఆధునిక డిజిటల్ పరిజ్ఞానానికి ,సాంప్రదాయ బోధనా పద్ధతులకు మధ్య సరైన సమతుల్యతను (Balance) కనుగొనడంపైనే విద్యాసంస్థలు దృష్టి పెట్టాలని బాండ్‌హాగెన్ పాఠశాల ప్రిన్సిపాల్ పియా నైస్ట్రోమ్ హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *