Skip to content
ప్రపంచం వార్తలు

ప్రపంచ గ్యాస్ వాణిజ్యానికి పెద్ద దెబ్బ: ఖతార్‌ రస్‌ లఫాన్‌ ప్లాంట్‌లో భారీ పేలుడు.. 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు

Prajapaksham 22 Jun 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
ప్రపంచ గ్యాస్ వాణిజ్యానికి పెద్ద దెబ్బ: ఖతార్‌ రస్‌ లఫాన్‌ ప్లాంట్‌లో భారీ పేలుడు.. 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు

Explosion as Qatar Restarts Gas Export Terminal; 54 Injured, 18 Missing

ప్రపంచ గ్యాస్‌ వాణిజ్యానికి గుండెకాయ లాంటి ఖతార్‌లోని ప్రముఖ ‘రస్‌ లఫాన్‌’ ఇండస్ట్రియల్ సిటీ పరిధిలో ఉన్న బర్జాన్‌ గ్యాస్‌ ప్లాంట్‌లో ఆదివారం అర్ధరాత్రి అత్యంత ఘోరమైన భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాద తీవ్రతకు ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడగా, అక్కడ విధులు నిర్వహిస్తున్న కార్మికులలో ఇప్పటివరకు 54 మంది తీవ్రంగా గాయపడ్డారు. అలాగే మరో 18 మంది కార్మికుల ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాకపోవడంతో వారి జాడ కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వాస్తవానికి ఇరాన్‌-అమెరికా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో, ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) దళాలు ఈ వ్యూహాత్మక గ్యాస్‌ క్షేత్రాన్ని లక్ష్యంగా చేసుకొని గతంలో భారీగా దాడులు చేశాయి. ఆ దాడుల కారణంగా గ్యాస్‌ ప్లాంట్‌ తీవ్రంగా దెబ్బతిని, దాని ఉత్పత్తి సామర్థ్యం ఒక్కసారిగా పడిపోయింది. అయితే, కొన్నాళ్ల క్రితమే ఇరాన్‌-అమెరికా మధ్య ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టడంతో, నష్టపోయిన గ్యాస్‌ ఉత్పత్తిని తిరిగి పునరుద్ధరించి పూర్తిస్థాయిలో ప్రారంభించేందుకు ఖతార్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టిన తరుణంలోనే ఈ తాజా పేలుడు సంభవించడం గమనార్హం.

ఖతార్‌ రాజధాని దోహాకు ఈశాన్య దిశలో సుమారు 80 కిలోమీటర్ల దూరంలో పర్షియన్‌ గల్ఫ్‌ తీరంలో ఈ రస్‌ లఫాన్‌ నగరం విస్తరించి ఉంది. భౌగోళికంగా అత్యంత వ్యూహాత్మక ప్రదేశంలో ఉండటం వల్ల ఇది ఆసియా ,ఐరోపా ఖండాల ఎగుమతులకు అంతర్జాతీయంగా అత్యంత అనుకూలమైన కేంద్రంగా మారింది. ఇక్కడి రస్‌ లఫాన్‌ క్షేత్రం నుంచే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30కి పైగా దేశాలకు నిరంతరాయంగా గ్యాస్‌ ఎగుమతి అవుతోంది. ఈ ఎగుమతులను నమ్ముకున్న దేశాల జాబితాలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన జపాన్‌, దక్షిణ కొరియా, చైనా, ఐరోపా సమాఖ్య (EU) లతో పాటు భారతదేశం కూడా ప్రముఖంగా ఉన్నాయి. ఖతార్ ప్రభుత్వ అధికారిక సంస్థ అయిన ‘ఖతార్‌ ఎనర్జీ’ నేరుగా పర్యవేక్షించే ఈ గ్యాస్‌ క్షేత్రంపై జరిగిన తాజా దాడి అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌ను ఒక్కసారిగా ఆందోళనల్లోకి నెట్టేసింది.

ఈ ఘోర ప్రమాదం ,ఉత్పత్తి నిలిచిపోవడం వంటి పరిణామాలు భారతదేశ ఆర్థిక, పారిశ్రామిక రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఎందుకంటే, ప్రస్తుతం భారత లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) మొత్తం దిగుమతుల్లో దాదాపు 40 నుండి 47 శాతం వరకు కేవలం ఖతార్‌ నుంచే వ్యూహాత్మక హర్మూజ్‌ జలసంధిని దాటుకొని మన దేశానికి వస్తున్నాయి. పైగా, భారత్‌-ఖతార్‌ దేశాల మధ్య గత 2024వ సంవత్సరంలో ఏకంగా 78 బిలియన్‌ డాలర్ల అపార విలువైన చారిత్రాత్మక గ్యాస్ ఒప్పందం కుదిరింది. ఈ దీర్ఘకాలిక ఒప్పందం ప్రకారం, రాబోయే 2028వ సంవత్సరం నుంచి సుమారు 20 ఏళ్ల పాటు నిరంతరాయంగా ఏటా 7.5 మిలియన్‌ టన్నుల ఎల్‌ఎన్‌జీని ఖతార్ భారతదేశానికి సరఫరా చేయాల్సి ఉంటుంది. ఖతార్‌ నుంచి వచ్చే ఈ ఎల్‌ఎన్‌జీ గ్యాస్ భారత్‌లోని విద్యుత్ ప్లాంట్లు, ఎరువుల తయారీ పరిశ్రమలు, భారీ ఫ్యాక్టరీలు ,గృహోపయోగ వంటగ్యాస్ అవసరాలకు అత్యంత కీలకమైన ఇంధన వనరుగా ఉంది. అమెరికా లేదా ఆఫ్రికా దేశాల నుంచి గ్యాస్ దిగుమతి చేసుకోవడంతో పోల్చితే, భౌగోళిక సామీప్యత కారణంగా ఖతార్‌ నుంచి భారత్‌కు గ్యాస్‌ను తరలించడం రవాణా పరంగా చాలా చౌకైన మార్గం. ఈ నేపథ్యంలో బర్జాన్ ప్లాంట్‌లో జరిగిన పేలుడు కారణంగా సరఫరా గొలుసు దెబ్బతింటే భారత్‌లో ఇంధన కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *