పేదల ఇళ్ళు కూల్చివేత.. హైదరాబాద్ నుండి హుటా హుటిన గుండ్ల సింగారంకు వెళ్లిన కూనంనేని.. కూల్చివేతలపై ఫైర్
Demolition of Huts in Gundla Singaram Sparks Concern Among Residents
*పేదల ఇళ్ళు కూల్చి వేయడం దుర్మార్గం: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
*ఇండ్ల పట్టాల సాధనకు రాష్ట్ర వ్యాప్తంగా ఐక్య పోరాటాలు..
*ఆదివారం హైదరాబాద్ లో ఇండ్ల స్థలాల సాధనకై అఖిలపక్ష సమావేశం
హనుమకొండ గుండ్ల సింగారంలో శనివారం పేదల ఇళ్ళు కూల్చి వేయడం దుర్మార్గమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం గుండ్ల సింగారంలో పేదల ఇళ్ళు కూల్చివేత విషయం తెలుసుకున్న కూనంనేని సాంబశివరావు హుటా హుటిన హైదరాబాద్ నుండి విచ్చేసి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు,జిల్లా సిపిఐ నాయకులతో కలిసి గుండ్ల సింగారంలో సందర్శించారు. ఈ సందర్భంగా గుడిసె వాసులు సిపిఐ నాయకులకు తమ గోడు వెళ్లబోసుకుని, చిన్న పిల్లలు, మహిళలు అని చూడకుండా తమను తమ ఇండ్ల నుండి ఈడ్చి పడేశారని తెలిపారు.
అలాగే బియ్యం, ఇతర నిత్యావసరాలను రోడ్డు పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.కాగా విద్యార్థుల సర్టిఫికేట్ లను సైతం తీసుకోనివ్వకుండా పోలీసులు ఈడ్చుకొని వెళ్లారని విద్యార్థులు తెలిపారు. అనంతరం కూనంనేని సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ హనుమకొండ గుండ్ల సింగారంలో ఇండ్లు కోల్పోయిన పేదలకు న్యాయం జరిగే వరకూ తాము అండగా ఉంటామని అన్నారు.

భూకబ్జాదారులు ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా స్పందించని అధికారిక యంత్రాంగం నిలువ నీడ లేని పేదలు 50 గజాల స్థలంలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న వారిపై అర్ధరాత్రివేళ దొంగల మాదిరిగా దాడి చేయడం దుర్మమార్గమైన చర్య అన్నారు. హనుమకొండ, వరంగల్ జిల్లాలలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గుడిసెలు వేసుకున్న పేదల పై ప్రతాపం చూపుతున్నారని, దీనిపై ముఖ్యమంత్రి స్పందించి ఇలాంటి దుశ్చర్యలను నిలుపుదల చేయాలని, నిలుపుదల చేయని ఎడల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని అన్నారు.
ఇలాంటి దుశ్చర్యలను నిలుపుదల చేయకుంటే హనుమకొండ, వరంగల్ జిల్లాల నుండే రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఇళ్ళ స్థలాల పోరాటం ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.తాము ప్రభుత్వానికి మిత్ర పక్షంగా ఉన్నప్పటికీ పేదల కోసం ఇలాంటి ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగడుతామని హెచ్చరించారు.వామపక్షాల ఆధ్వర్యంలో పేదల ఇళ్ళు, ఇండ్ల స్థలాలు, భూ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఐక్య పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. దీనిపై ఆదివారం హైదరాబాద్ లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయం మక్దూం భవన్ లో అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యలపై ఒక భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుని ముందుకు సాగుతామని చెప్పారు. ఈ సందర్భంగా గుండ్ల సింగారంలో ఇండ్ల కూల్చివేతకు గురైన బాధితులతో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ పేదలందరూ ఐక్యంగా నిలబడాలని, సిపిఐ పూర్తిగా అండగా ఉంటుందని చెప్పారు. ఇండ్ల పట్టాలు సాధించే వరకూ విశ్రమించేదిలేదని చెప్పారు.సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ జైలుకు అయినా వెళతాము కాని భూమిని వదిలేది లేదన్నారు.భూమి సాధించుకనే వరకు సిపిఐ మీ వెంటనే ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, సిపిఎం జిల్లా కార్యదర్శి గాదె ప్రభాకర్ రెడ్డి, సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి షేక్ బాషుమియా, సిపిఐ హనుమకొండ జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి, రాష్ట్ర సమితి సభ్యులు అదరి శ్రీనివాస్, మేకల రవి, మండ సదాలక్ష్మి, వలీ ఉల్లాఖాద్రి, హనుమకొండ మండల కార్యదర్శి ఎన్ ఎ స్టాలిన్, సిపిఎం జిల్లా నాయకులు ఎం. చుక్కయ్య, బొట్ల చక్రపాణి, సిపిఐ జిల్లా నాయకులు కర్రె లక్ష్మణ్, బాషబోయిన సంతోష్, జక్కు రాజు గౌడ్, ఏషబోయిన శ్రీనివాస్, కొట్టేపాక రవి, రాజు కుమార్, అలువాల రాజు, మండల సహాయ కార్యదర్శి గుంటి రాజేందర్, నాయకులు పోనుగోటి రాము, గోపాల్ చారి, పూజారి అమృతయ్య, కట్కూరి కృష్ణ, మాలోత్ మంగ, కొడెపాక బాబు, మామునూరి దామోదర్, గుడికందుల శివ, పూజారి నరేందర్, కేతపాక ప్రసాద్, తాటికొండ ప్రశాంత్, బైసా మౌనిక, నలువాల సంధ్య, తాటికంటి మమత, గుంటి రజిత, గిన్నారపు రోహిత్, గుగులోత్ సురేష్, వందలాది ఇండ్ల వాసులు తదితరులు పాల్గొన్నారు.