Skip to content
తెలంగాణ వార్తలు

హనుమకొండ గుండ్ల సింగారంలో పేదల గుడిసెలు కూల్చివేత.. అడ్డుకోబోయిన సిపిఐ నాయకుల అరెస్టు

Prajapaksham 20 Jun 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
హనుమకొండ గుండ్ల సింగారంలో పేదల గుడిసెలు కూల్చివేత.. అడ్డుకోబోయిన సిపిఐ నాయకుల అరెస్టు

Demolition of Huts in Gundla Singaram Sparks Concern Among Residents

*హనుమకొండ గుండ్ల సింగారంలో పేదల గుడిసెలు కూల్చివేత

*ఐదేళ్ళుగా నివాసం ఉంటున్న 350 కుటుంబాలు రోడ్డున మీదకు..

*అడ్డుకోబోయిన సిపిఐ నాయకుల అరెస్టు

హనుమకొండ గుండ్ల సింగారంలో శనివారం ఉదయం పోలీసులు, అధికారులు వందలాది మంది నివాసం పేదల గుడిసెలను కూల్చి వేశారు. దీంతో గుండ్ల సింగారంలో రోజంతా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం ఉదయం 5 గంటలకు హనుమకొండ ఆర్డీవో వెంకటేష్ ఆధ్వర్యంలో రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది సుమారు 200 మంది పోలీసుల బందోబస్తుతో హనుమకొండ గుండ్ల సింగారంలోని గుడిసెల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. దీంతో సిపిఐ నాయకులు, గుడిసె వాసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా తమకు కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయని అడ్డుకుంటే లీగల్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరించారని గుడిసె వాసులు వాపోయారు.

పెద్ద ఎత్తున తరలి వచ్చిన పోలీసులు,రెవెన్యూ సిబ్బంది ఐదు జేసీబీలతో సుమారు 350 గుడిసెలను నేలమట్టం చేశారు.ఈ సందర్భంగా అడ్డుకోబోయిన సిపిఐ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి జీవిస్తున్నామని తమను ఇప్పటికిప్పుడు బయటికి పొమ్మంటే ఎక్కడికి పోవాలని గుడిసె వాసులు కన్నీటి పర్యంతమయ్యారు.

హనుమకొండ గుండ్ల సింగారంలో పేదల గుడిసెలు కూల్చివేత

ఉదయం 5 గంటలకు ఇండ్ల కూల్చివేతను అడ్డుకున్న సిపిఐ నాయకులను, కార్యకర్తలను నిర్బంధించి అరెస్ట్ చేసి కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ అయినవారిలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి, హనుమకొండ మండల కార్యదర్శి ఎన్ ఎ స్టాలిన్, నాయకులు పూజారి అమృతయ్య, కట్కూరి కృష్ణ, మాలోత్ మంగ, బాలాజీ రంజిత్ లతో పాటు 40 మంది ఉన్నారు.

మమ్మల్ని చంపినా ఇక్కడి నుంచి కదిలేదు లేదు: రమ

‘ఐదేళ్లుగా గుడిసెలు వేసుకొని ఉంటున్నాం. పిల్లలు ఇక్కడి నుంచే బడికి వెళ్తున్నారు. నిన్న అధికారులు ఇక్కడికి వచ్చినప్పటికీ.. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈరోజు ఉ.4 గం.కే ఇక్కడికి వచ్చారు. పిల్లలు ఉన్నారని చెప్పినా వినిపించుకోలేదు. మహిళలం అని చూడకుండా నెట్టేశారు. ఇంట్లో ఉండగానే రేకులు కూలగొట్టారు. మమ్మల్ని ఇక్కడే చంపండి.. కదిలేదు లేదు’ అని గుండ్ల సింగారానికి చెందిన రమ ఆవేదన వ్యక్తం చేశారు.

గుడిసెలు కూల్చినా మండుటెండలోనే గుడిసె వాసులు

గుండ్ల సింగారం లిక్కర్ ప్లాంట్ సమీపంలో గుడిసెలు తొలగించిన ప్రాంతంలో పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నివాసాలు కోల్పోయిన కుటుంబాలు ఎండలోనే తాత్కాలికంగా ఉంటూ అక్కడే వంటలు చేసుకుంటున్నాయి. చిన్నారులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు ప్రత్యామ్నాయ నివాసం కల్పించాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.తమ గుడిసెలను కూల్చి వేసినా తాము ఆ భూమి వదలబోమని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *