Skip to content
తెలంగాణ వార్తలు

తెలంగాణకు మూడు బుల్లెట్ రైళ్లు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన.. రూ.87 కోట్ల రహదారి పనులకు శంకుస్థాపన!

Prajapaksham 20 Jun 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
తెలంగాణకు మూడు బుల్లెట్ రైళ్లు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన.. రూ.87 కోట్ల రహదారి పనులకు శంకుస్థాపన!

Telangana Set to Get Three Bullet Train Corridors, Says Union Minister Kishan Reddy

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి మూడు బుల్లెట్‌ రైళ్లు (హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లు) రానున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ. కిషన్‌రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌ నగరాన్ని దేశంలోని ఇతర ప్రధాన మహానగరాలైన ముంబై, బెంగళూరు, చెన్నైలతో అనుసంధానిస్తూ ఈ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన స్పష్టం చేశారు.

శుక్రవారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమూరు, బేగంపేట, తిమ్మాపూర్‌ గ్రామాల్లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి కిషన్ రెడ్డి పర్యటించారు. కేంద్ర రోడ్డు నిధుల (CRF) రూ.87 కోట్లతో చేపట్టనున్న వివిధ లింకు రహదారుల నిర్మాణ పనులకు వారు సంయుక్తంగా శంకుస్థాపనలు ,ప్రారంభోత్సవాలు చేశారు.

ఈ సందర్భంగా లేమూరు గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ హైస్పీడ్‌ రైల్ కారిడార్ల నిర్మాణం కోసం మొదట రూ. 5 లక్షల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం భూముల ధరలు విపరీతంగా పెరగడంతో ఈ ప్రాజెక్టుల మొత్తం ఖర్చు రూ. 10 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని, దీనికి సంబంధించిన సమగ్ర సర్వే పనులు ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నాయని వివరించారు.

దీనితో పాటు హైదరాబాద్ చుట్టూ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు (RRR) కోసం ఉత్తరం వైపు భూసేకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈ ప్రాజెక్టుకు రూ. 20 వేల కోట్ల నుంచి రూ. 25 వేల కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే శ్రీశైలం హైవే విస్తరణ పనులకు సంబంధించిన డీపీఆర్ (DPR) కూడా సిద్ధమవుతోందని, రాబోయే ఏడాది లోపే ఈ విస్తరణ పనులు క్షేత్రస్థాయిలో ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.

ఈ సభలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటిదని, ఐటీ ,రియల్ ఎస్టేట్ రంగాల విస్తరణతో ఇక్కడి గ్రామాలు చాలా వేగంగా పట్టణాలుగా అభివృద్ధి చెందుతున్నాయని కొనియాడారు. ఈ ప్రాంతం మరింత వృద్ధి సాధించాలంటే గ్రామీణ రహదారుల అనుసంధానం అత్యంత కీలకమని, అందుకే రాజకీయాలకు అతీతంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు.

ఈ భారీ శంకుస్థాపన కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి, తెలంగాణ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్‌రెడ్డి రాంరెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్, జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డితో పాటు ఇతర ముఖ్య నాయకులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *