ఫిర్యాదు కోసం వచ్చిన మహిళలే లక్ష్యం..అధికారం అడ్డం పెట్టుకొని వల విసురుతున్న కొందరు ఖాకీలు..
ఫిర్యాదు కోసం వచ్చిన మహిళలే లక్ష్యం..అధికారం అడ్డం పెట్టుకొని వల విసురుతున్న కొందరు ఖాకీలు..
నివారణ చర్యలపై దృష్టి సారించిన డీజీపీ
తెలంగాణ రాష్ట్రంలో న్యాయం కోసం పోలీసు స్టేషన్లకు వచ్చిన మహిళలకు రక్షణ లేకుండా పోతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితులకు భరోసా కల్పించాల్సిన పోలీస్ స్టేషన్లలోని కొంత మంది అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీస్ స్టేషన్ కొంతమంది మహిళలకు భయాన్ని కలిగించే ప్రదేశంగా మారిన ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.
ఇటీవలి కాలంలో తెలంగాణలో బయటపడిన కొన్ని కేసులు చూస్తే, కుటుంబ కలహాలు, గృహ హింస, ఆస్తి వివాదాలు, వేధింపులు వంటి సమస్యలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే మహిళల మానసిక బలహీనతను కొందరు అధికారులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
తాజాగా జూబ్లీహిల్స్ సీఐ ఒక బాధిత మహిళను లైంగికంగా వేధించి గర్భవతిని చేసినట్లు, ఆర్థికంగా కోట్లాది రూపాయలు దోచుకున్నట్లు ఆరోపణలు రావడం, అతనిని విధుల నుంచి సస్పెండ్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అధికారుల పనితీరుపై చర్చకు దారితీసింది. అలాంటి కొంత మంది పోలీసు అధికారుల ప్రవర్తన వల్ల నిజాయితీగా పనిచేసే పోలీసులు, పోలీసు వ్యవస్థ అప్రతిష్ట పాలవుతున్నదని ప్రజలతో పాటు పోలీసు అధికారులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేసు పేరుతో బాధిత మహిళలతో అక్రమ సంబంధాలు
పోలీస్ స్టేషన్‌కు వచ్చే మహిళల్లో చాలామంది ఇప్పటికే తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉంటారు. భర్త వేధింపులు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లేదా ఇతర వివాదాలతో న్యాయం కోసం వస్తారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు పోలీసులు ‘మీ సమస్య నేను పరిష్కరిస్తాను’ అని వ్యక్తిగత పరిచయం పెంచుకోవడం, దర్యాప్తు అవసరం పేరుతో మొబైల్ నంబర్లు తీసుకోవడం, కొన్ని కేసుల్లో విధులకు సంబంధం లేని సమయంలో పదేపదే ఫోన్ చేయడం, వ్యక్తిగత సందేశాలు పంపడం, పోలీస్ స్టేషన్ వెలుపల కలవాలని ఒత్తిడి తేవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఒంటరిగా ఉన్న మహిళలు లేదా కుటుంబ సహకారం లేని బాధితులను లక్ష్యంగా చేసుకుని, మాటలతో నమ్మకం కల్పించి వ్యక్తిగత సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నించారనే ఆరోపణలు కొన్ని కేసుల్లో ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో బాధిత మహిళలకు పెళ్లి చేస్తానని నమ్మించి మోసం చేశారనే ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి. కొన్ని ఘటనల్లో మహిళలు అభ్యంతరం చెబితే కేసు విచారణలో సంగతి చూస్తామని బెదిరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
పోలీసు వ్యవస్థకు మచ్చ
రాష్ట్రంలో పోలీసు శాఖలో వేలాది మంది అధికారులు, సిబ్బంది మహిళలకు అండగా నిలుస్తూ విధులు నిర్వహిస్తున్నారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్, మహిళా హెల్ప్ డెస్క్‌లు, ప్రత్యేక స్పందన వ్యవస్థలు పనిచేస్తున్నాయి.
అయితే గతంలో ఖమ్మం, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాలలో, తాజాగా జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో బాధిత మహిళల పట్ల పోలీసు అధికారుల ప్రవర్తనపై ఆరోపణలు రాష్ట్రంలో చర్చకు దారితీశాయి. కొన్ని సందర్భాల్లో సంబంధిత అధికారులపై శాఖాపరమైన విచారణలు, క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కొన్ని కేసుల్లోనూ ఆరోపణలు ఇంకా కోర్టు లేదా దర్యాప్తు దశలోనే ఉన్నాయి. అందువల్ల కొంత మంది వ్యక్తుల ప్రవర్తనను మొత్తం పోలీసు వ్యవస్థకు ఆపాదించడం సరైంది కాదు.
ఎస్పీలు, కమిషనర్లకు సూచనలు జారీ చేసిన డీజీపీ
జూబ్లీహిల్స్ సీఐ లైంగిక దాడి లాంటి కేసులు పునరావృతం కాకుండా ఉండేందుకు డీజీపీ సి.వి. ఆనంద్ రాష్ట్రంలోని ఎస్పీలు, కమిషనర్లకు సూచనలు జారీ చేశారు. పోలీస్ స్టేషన్ అంటే ప్రజలకు భరోసా కలిగించే స్థలం అనే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
న్యాయం కోసం వచ్చిన మహిళలు మరొక అన్యాయానికి గురవుతున్నారనే భావన కూడా రాకుండా పోలీసు శాఖ కఠిన పర్యవేక్షణ, పారదర్శక విచారణలు, వేగవంతమైన చర్యలు చేపట్టడం అత్యంత అవసరమన్నారు. ప్రజల విశ్వాసమే పోలీసు వ్యవస్థకు అతిపెద్ద బలమని, ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడం ప్రతి పోలీసు అధికారి బాధ్యత అని డీజీపీ తన ఆదేశాలలో పేర్కొన్నారు.