తెలంగాణ పులి నల్ల నరసింహులు
Telangana Tiger Nalla Narasimhulu
ములక సురేష్
(నేడు విప్లవ వీరుడు నల్ల నరసింహులు జయంతి)
జీవితం సమాజానికి అంకితం చేసి పేరు కోసం పాకులాడక జనం పేగు బాధ తీర్చడానికి బ్రతికిన వీరులెందరో చరిత్రలో విస్మృతికి గురైనారు. వారి త్యాగాలు భూమిలో కప్పి వేయబడినప్పటికీ అవి విత్తనంలా మొలకెత్తక మానవు, అవి బాహ్య ప్రపంచాన్ని చూడక మానవు, మానై సమాజానికి ఆదర్శంగా నిలబడకమానవు. అలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన నిలువెత్తు ఉద్య మ స్ఫూర్తి శిఖరం తెలంగాణ పులి నల్ల నర్సింహులు. తెలంగాణలో ఏ మట్టి వీరుల నుదుటన సింధూరమై మెరిసిందో, ఎక్కడ త్యాగాలు నిరంతరం దివిటీలలా వెలుగుతూ మార్గదర్శకత్వం వహించాయో, ఎక్కడ దోపిడీకి, పీడనకు వ్యతిరేకంగా పిడికిళ్ళు బిగించుకొని దొరల గడీలను బద్దలు కొట్టాయో, ఎక్కడ అన్యాయం సహించలేని కళ్ళు నిప్పులు కురిపించాయో, ఎక్కడ సాయుధ పోరాట జ్వాలలు నింగికంటుకున్నాయో అటువంటి రణక్షేత్రమైన కడివెండిలో లచ్చమ్మ, లచ్చయ్య దంపతులకు ఒక పేద చేనేత కుటుంబంలో 1926 అక్టోబర్ 2న నల్లా నరసింహులు జన్మించాడు. స్వాతంత్య్ర ఉద్యమానికి సారధ్యం వహించిన గాంధీ, దేశానికి రెండవ ప్రధానిగా పనిచేసిన లాల్ బహుదూర్ శాస్త్రి జన్మించిన అక్టోబర్ 2వ తేదీన నల్ల నరసింహులు జన్మించి తెలంగాణ సాయుధ పోరాట నరసింహంగా వెలుగొందిన వీరుడు. యాదృచ్ఛికంగా ఈ ముగ్గురు మహోన్నతులు ఒకే తేదీన పుట్టడం కాకతాళీయం కావచ్చు కానీ వీరు దేశం గర్వించదగ్గ భరతమాత ముద్దుబిడ్డలు. ఈ ముగ్గురివి స్వతంత్ర పోరాటాలే కానీ దారులు వేరు. గాంధీ , శాస్త్రిలు దేశ దాస్య శృంఖలాలు తెంచడానికి అహింసా మార్గంలో ఉద్యమిస్తే, నల్ల నరసింహు లు నిజాం నిరంకుశపాలకుల నుండి దొరలు, దేశ్‌ముఖ్‌ల అకృత్యాలనుండి ప్రజలను రక్షించడానికి సాయుధ పంథా అనుసరించాడు. తండ్రి లచ్చయ్య మంచి నైపుణ్యంగల చేనేత కళాకారు డు. అతి సన్నని దారంతో వస్త్రాలు నేయుటలో నేర్పరి. లచ్చయ్య తయారుచేసిన వస్త్రాలకు మంచి గిరాకీ ఉండేది.
ఆ రోజుల్లో హైదరాబాద్ సంస్థానం నిజాం నవాబు పాలనలో ఉండేది. జమీందారులు, జాగీర్దారులు, దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండేల ఆధీనంలో గ్రామాలు ఉండేవి. వీరు ప్రజలను పన్నుల పేరుతో పీడించేవారు. గ్రామాలలో ప్రజలతో వెట్టిచాకిరి చేయించుకునేవారు. దండనలు వేసేవారు ప్రజలను దోపిడీ చేయడమే వీరి వృత్తి. కడివెండికి ఐదు మైళ్ళ దూరంలో విసునూరులో దేశ్‌ముఖ్ రేపాక వెంకట రామచంద్రారెడ్డి ఉండేవాడు. ఇతడు 60 ఎకరాల భూస్వామి. దోపిడీదారుడు, దుర్మార్గుడు, ప్రజాకంటకుడు. ఇతని తల్లి జానమ్మ కడవెండిలో నివాసం ఉండేది. ఈమె బలవంతంగా ప్రజల దగ్గర నుండి పన్నులు వసూలు చేసేది. తనకున్న 20 ఎకరాల భూమిని రెండు వందల ఎకరాలు చేసిందంటే ఈమె దోపిడీ ఏ రకంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. నల్ల నరసింహులు కడివెండిలోనే ఏడో తరగతి వరకు చదువుకున్నాడు. ఆ రోజుల్లో ఏడవ తరగతి ఉత్తీర్ణత అయిన వారికి వెంటనే టీచర్ ఉద్యోగం వచ్చేది కానీ నరసింహు లు ఉద్యోగ అర్హతకు ఒక సంవత్సరం వయస్సు తక్కువగా ఉంది. ఇంకొక సంవత్సరం గడిస్తే ఉద్యోగం వచ్చేది. సరిగ్గా అదే సమయంలో తండ్రి లచ్చయ్య అనారోగ్యంతో కన్నుమూశా డు. ఇంటికి పెద్దవాడు కావడం వలన కుటుంబ భారం మొత్తం నరసింహులుపైనే పడింది. బ్రతుకుతెరువు కోసం మగ్గం వేయడం నేర్చుకున్నా . తండ్రి చేసిన అప్పులు తీర్చడం కోసం పరాయి ఊరిలో ప్రైవేట్ టీచర్‌గా పనిచేసి అప్పులు తీర్చా డు. పరాయి ఊరికి వచ్చి పోయే దారిలో పిట్టల నరసయ్య అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం విప్లవాత్మకమైన మార్పుకు దారితీసింది. వారి సహకారంతో ఆంధ్ర మహాసభతో పరిచయం ఏర్పడింది. నరసింహులు సాహిత్యం అధ్యయనం చేశాడు. పోరాట చరిత్రలు చదివాడు. చైతన్యం పొందాడు. చిన్నతనంలోనే అదే గ్రామానికి చెందిన వజ్రమ్మతో అతనికి వివా హం జరిగింది. చిన్నతనం నుండి అన్యాయాల ను సహించలేని మనస్తత్వం కలిగిన నల్ల నరసింహులు 1944లో రావి నారాయణరెడ్డి అధ్యక్షత న భువనగిరిలో నిర్వహించిన ఆంధ్ర మహాసభ తో ఉత్తేజితుడై తన భార్య నల్ల వజ్రమ్మతో పాటు కడివెండి గ్రామానికి చెందిన మిత్రులు దావీద్ రెడ్డి, మచ్చ రామయ్య, మాచర్ల కొండయ్య, దొడ్డి మల్లయ్య, దొడ్డి కొమరయ్య తదితరులను సమీకరించి ఆంధ్ర మహాసభ గ్రామ శాఖ ఏర్పాటు చేశాడు. దానికి కార్యదర్శిగా పనిచేస్తూ విప్లవ ప్రస్థానాన్ని ఆరంభించాడు.
ప్రజలపై అమానవీయ చర్యలకు పాల్పడుతూ కడివెండి ప్రజల రక్త మాంసాలను పీల్చి పిప్పి చేస్తున్న జానమ్మ దొరసానికి నల్ల నర్సింహులు ముచ్చెమట పట్టించాడు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో లెవీ ధాన్యం పేరుతో పేద రైతుల నుండి జరుగుతున్న బలవంతపు ధాన్య సేకరణను అడ్డుకొని జానమ్మ దొరసాని అక్రమంగా నిల్వ చేసుకున్న 100పుట్ల ధాన్యా న్ని ప్రజలకు పంచి తొలి విజయాన్ని నమోదు చేశాడు. జీతగాళ్లతో సమ్మె చేయించాడు. సెలవులతో పాటు వారి జీతాలు భారీ స్థాయిలో పెంపుదల చేయించాడు. వెట్టి బంద్ అయింది. దండగలు లేకుండా పోయాయి. ప్రజలు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఉద్యమ ప్రస్థానంలో భాగంగా నల్ల నర్సింహులు హైదరాబాదులో ఉన్నప్పుడు ప్రతీకారంతో ఉన్న దేశముఖ్ గుండాలు కడివెండిలో ఆంధ్ర మహాసభ కార్యకర్తలపై దాడి చేశారు. ఆ దాడిలో దొడ్డి కొమురయ్య నేలకొరిగి వీర మరణం చెందాడు. ఈ ఘటన వల్ల నరసింహులు అగ్నిశిఖలా ప్రజ్వరిల్లి 60 మందితో సాయిధ దళాన్ని నిర్మించి విప్లవ కెరటం సృష్టించాడు. నరసింహులు పిలుపు ఒక ప్రభంజనం. సాయుధ పోరాటంలో కీలకమైన నరసింహులు పై అనేక కేసులు బనాయించారు పోలీసులు. తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు కానీ నరసింహులు అనేక గ్రామాలు తిరుగుతూ తప్పించుకున్నాడు. చివరకు సూర్యాపేటలో పోలీసులకు దొరికాడు. అరెస్ట్ చేసి క్రూరంగా హింసించి మహబూబ్‌నగర్ జైల్లో పెట్టగా తప్పించుకున్నాడు. అక్కడనుండి విజయవాడ చేరుకొని కొన్నాళ్లు గెరిల్లా పోరాటంలో శిక్షణ తీసుకున్నాడు. తర్వాత జనగామ తాలూకా ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నాడు. 1947 ఆగస్టు 15 దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నిజాం నవాబు భారత్ యూనియన్ లో విలీనం కావడానికి ఒప్పుకోలేదు. కమ్యూనిస్టులు హైదరాబాద్ సంస్థానం విముక్తి కొరకు పోరాటం చేశారు. ఆ క్రమంలో రజాకార్ సైన్యం ఎంతోమంది వీరులను కాల్చి చంపింది. ఆ చర్యలను ప్రతిఘటిస్తూ నరసింహులు ప్రజా పోరాటాలు చేశాడు. ఈ క్రమంలో లక్ష్మక్కపల్లిలో పట్టుబడ్డాడు. కాల్చి చంపమని సైనిక అధికారులకు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ప్రజాభిమానం, అతని భావజాలం, సిద్ధాంతం పట్ల విశ్వాసం, అవగాహన, వాదనాపటిమ, నిర్భీతి, నిజాయితీగల ప్రవర్తన చూసి చలించిపోయి పోలీసులకు అప్పగించారు. నరసింహులు పై ఆరోపించబడిన మూడు అక్రమ కేసుల్లో ముగ్గురు జడ్జిల ముందు తన కేసు తానే వాదించుకున్నాడు. న్యాయవాదులను నియమించుకునే అవకాశం ఉన్న ఉపయోగించుకోలేదు. వివిధ కేసుల్లో ఆయనకు మూడు ఉరిశిక్షల సైతం విధించారు. అయితే జైలు నుంచి తప్పించుకొని తిరిగి అజ్ఞా త జీవితం ప్రారంభించాడు. చివరిసారి 1955లో ఆయనను వడ్లకొండలో అరెస్టు చేసి ప్రభుత్వం ఉరిశిక్ష మళ్ళీ ఖాయం చేసింది. అయితే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రజాందోళనల ఫలితంగా 1959లో ఆయన విడుదలయ్యాడు. అలా జైలు నుంచి విడుదలైన చిట్టచివరి తెలంగాణ సాయుధ పోరాటయోధుడు నల్ల నరసింహులు. ఆయన పోరాటాల ఫలితంగా తెలంగాణ టైగర్ పేరు ఆయనకు వచ్చింది. విప్లవ సింహంగా ప్రజలు పిలుచుకునేవారు.1993 నవంబర్ 5న ఆయన మరణించాడు.
- Ames Meteorite Crater: ఉల్క దాడి 10 కోట్ల ఏళ్లు ఆలస్యంగా జరిగిందా.. Ames క్రేటర్‌పై శాస్త్రవేత్తల కొత్త అంచనా.. ఓక్లహామా ఉల్కాబిలంపై సంచలన పరిశోధన
- Bathukamma Secret: బతుకమ్మ పండుగలో దాగి ఉన్న అసలు సీక్రెట్ ఇదే.. పూల పండుగ వెనుక ఇంత పెద్ద కథ ఉందా?
- Boddemma Festival: బతుకమ్మకు ముందు వచ్చే బొడ్డెమ్మ పండుగ ప్రత్యేకత ఏంటి.. 7 రోజుల పాటు ఎందుకు జరుపుకుంటారు..
- CEC Gyanesh Kumar Row: CEC జ్ఞానేశ్ కుమార్‌ను సస్పెండ్ చేయాలన్న పిటిషన్లపై విచారణ.. కేంద్రం, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు..
- Russia-Ukraine War: ఉక్రెయిన్‌లో భారత ఫార్మా ప్లాంట్‌పై రష్యా డ్రోన్ దాడి.. ఒకరు మృతి, రూ.400 కోట్లకు పైగా నష్టం..