Skip to content
తెలంగాణ వార్తలు

Revanth Reddy Targets BRS: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌పై బీఆర్ఎస్ మౌనం ఎందుకు..గులాబీ పార్టీని టార్గెట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి..

Prajapaksham 23 Jul 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Revanth Reddy Targets BRS: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌పై బీఆర్ఎస్ మౌనం ఎందుకు..గులాబీ పార్టీని టార్గెట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి..

Revanth Reddy

Revanth Reddy Targets BRS: తనకు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయంటూ సోషల్ మీడియా, రాజకీయ వర్గాల్లో వస్తున్న ఆరోపణలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్‌లో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన ఆయన.. తనపై ఆరోపణలు చేసేవారికి దమ్ముంటే అధికారికంగా ఫిర్యాదు చేయాలని సవాల్ విసిరారు. అయితే అది తప్పుడు ఫిర్యాదు అని తేలితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఓటు వ్యవహారంపై స్పష్టతనిస్తూ.. తన ఓటును నిబంధనలకు అనుగుణంగా బదిలీ చేయడం కోసం ఇప్పటికే కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. గతంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజల ఓట్లను తొలగించిన ఉదంతాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అప్పట్లో ఈ చర్యపై కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. నాటి జీహెచ్ఎంసీ కమిషనర్‌పై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 70 శాతం వరకు ఓటర్ల జాబితా సవరణ పూర్తయిందని.. ప్రక్షాళన నెపంతో అర్హులైన ప్రజల ఓట్లు గల్లంతు కాకుండా ఉండేందుకే బీఎల్ఓలను నియమించామని వివరించారు. ప్రజలకు ఓటు హక్కు లేకపోతే ప్రభుత్వ పథకాలు ఎలా అందుతాయని ఆయన ప్రశ్నించారు.

ఇదే సమయంలో నగరంలో హైడ్రా (HYDRAA) పనితీరుపై సీఎం ప్రశంసలు కురిపించారు. ఆక్రమణలకు గురైన అనేక అక్రమ ఆస్తులను ఈ సంస్థ తిరిగి స్వాధీనం చేసుకుందని తెలిపారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు గుప్పిస్తూ.. ఆ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు. కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన విపరీతమైన అవినీతి కారణంగానే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, హరీశ్ రావును కొంతకాలం పాటు మంత్రి పదవికి దూరంగా ఉంచారని ఆరోపించారు.

గత బీఆర్ఎస్ పాలనలోని లోపాలపై విరుచుకుపడుతూ.. ఇంటర్‌మీడియట్ ఫలితాల వెల్లడిలో జరిగిన తప్పిదాల వల్ల 27 మంది అమాయక విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని రేవంత్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాటి గ్లోబరీనా సంస్థ వ్యవహారంలో కేటీఆర్ తన నిజాయతీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేటీఆర్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని అన్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను బీఆర్ఎస్ పార్టీ ఎందుకు డిమాండ్ చేయడం లేదని రేవంత్ రెడ్డి నిలదీశారు.