Skip to content
తెలంగాణ › వార్తలు

Musi Riverfront Project: హైదరాబాద్‌లో మూసీపై భారీ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్లాన్.. గ్లోబల్ టెండర్ ప్రక్రియ ప్రారంభించిన సర్కారు..

jagan 14 Oct 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Musi Riverfront Project: హైదరాబాద్‌లో మూసీపై భారీ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్లాన్.. గ్లోబల్ టెండర్ ప్రక్రియ ప్రారంభించిన సర్కారు..

Musi Riverfront Project

Musi Riverfront Project: మూసీ నదికి పూర్వవైభవం తీసుకురావడంతో పాటు ఆ ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (MRDCL) భారీ మెగా మాస్టర్‌ ప్లాన్‌కు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా మొదటి విడత కింద 19.05 కిలోమీటర్ల మేర నది అభివృద్ధి పనుల కోసం అంతర్జాతీయ స్థాయి గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ భారీ ప్రాజెక్టు సమర్థవంతమైన అమలు కోసం మూసీ పరివాహక ప్రాంతాన్ని రెండు ప్రధాన జోన్లుగా విభజించి అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.

ఈ ప్రాజెక్టును ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ (ఈపీసీ) డిజైన్-బిల్ట్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన చేపట్టనున్నారు. ఈ ఒప్పందం కింద నిర్మాణాలు పూర్తి చేయడమే కాకుండా, తదుపరి ఐదేళ్ల పాటు నదీ తీర ప్రాంత సమగ్ర నిర్వహణ బాధ్యతలను కూడా కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థలకే అప్పగించనున్నారు. అంతేకాకుండా మూసీ నది పరిధిలోకి వచ్చే ఔటర్‌ రింగ్‌ రోడ్‌ పై అత్యంత ఆకర్షణీయమైన ఐకానిక్‌ కేబుల్‌ స్టీల్‌ బ్రిడ్జ్‌ నిర్మాణాన్ని కూడా చేపట్టబోతున్నారు.

నది పరివాహక ప్రాంతంలో రెండు విభాగాల వారీగా చేపట్టే పనుల వివరాలు స్పష్టంగా నిర్దేశించారు. జోన్‌-1ఏ విభాగంలో హిమాయత్‌ సాగర్‌ నుంచి బాపూఘాట్‌ వరకు ఉన్న 7.53 కిలోమీటర్ల పరిధిలో నది ప్రవాహ నియంత్రణ, ముంపు నివారణ చర్యలు, ఇరువైపులా రిటైనింగ్‌ వాల్స్‌ నిర్మాణం, నదీ గట్ల సుందరీకరణ, రోడ్లు, వంతెనల నిర్మాణం చేపట్టనున్నారు. వీటితో పాటు అండర్‌గ్రౌండ్‌ యుటిలిటీ కారిడార్స్, స్టార్మ్‌ వాటర్‌ డ్రైన్లు, ట్రంక్‌ సీవరేజ్‌ లైన్లు , నది నీటి మట్టాన్ని నియంత్రించే రబ్బర్‌ డ్యామ్‌ల నిర్మాణాలు చేపడతారు.

మరోవైపు జోన్‌-1బీ విభాగంలో ఉస్మాన్‌ సాగర్‌ నుంచి బాపూఘాట్‌ వరకు 11.52 కిలోమీటర్ల విస్తీర్ణంలో నది అభివృద్ధి, సుందరీకరణ పనులతో పాటు ఔటర్‌ రింగ్‌ రోడ్‌ ప్రాంతంలో నగరానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా అత్యంత విలాసవంతమైన ఐకానిక్‌ కేబుల్‌ స్టీల్‌ బ్రిడ్జ్‌ను నిర్మిస్తారు.

ఈ గ్లోబల్ టెండర్ ప్రక్రియకు సంబంధించిన కీలక తేదీలను అధికారులు ఖరారు చేశారు. టెండర్‌ డాక్యుమెంట్ల డౌన్‌లోడ్‌ ప్రక్రియ ఈ నెల 15వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఆసక్తిగల కాంట్రాక్టింగ్ సంస్థల సందేహాలను నివృత్తి చేసేందుకు ఈ నెల 29న మధ్యాహ్నం 3 గంటలకు ప్రీ-బిడ్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బిడ్లను సమర్పించడానికి నవంబర్‌ 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు ఇచ్చారు. అనంతరం నవంబర్‌ 27వ తేదీ ఉదయం 11 గంటలకు టెక్నికల్‌ బిడ్లను ఓపెన్ చేయనున్నారు. ఈ మెగా ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ నగరంలో పర్యాటకరంగం సరికొత్త ఎత్తులకు చేరుకుంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.