INDIA Bloc Petition: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై పిటిషన్.. సుప్రీంకోర్టులో కీలక పరిణామం.. విచారణ తేదీ ఖరారు?
Supreme Court
INDIA Bloc Petition: కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) పనితీరుతో పాటు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇండియా కూటమి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అధికారికంగా స్వీకరించి కేటాయించిన రీట్ సంఖ్యతో నమోదు చేసింది. దరఖాస్తులోని సాంకేతిక లోపాలను పిటిషనర్ల న్యాయవాదులు వెంట వెంటనే సరిదిద్దడంతో విచారణ ప్రక్రియ వేగవంతమైంది. కేసు నమోదు సమాచారం ప్రకారం రాబోయే అక్టోబర్ 26వ తేదీన ఈ కీలక పిటిషన్‌ను ధర్మాసనం విచారణకు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ పిటిషన్ దాఖలు ప్రక్రియలో అనేక ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రారంభంలో రాహుల్ గాంధీతో పాటు మరో 11 మంది ప్రతిపక్ష పార్టీల నేతలు సంయుక్తంగా ఈ పిటిషన్‌ను దాఖలు చేయగా.. ఆ తర్వాతి క్రమంలో వీసికె (VCK) నేత థోల్ తిరుమావళవన్, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నేత సజ్జాద్ అహ్మద్ కిచ్లూ కూడా తమ మద్దతు తెలియజేస్తూ పిటిషనర్లుగా చేరారు. దీంతో ఈ పిటిషన్లో భాగస్వాములైన నేతల సంఖ్య మొత్తం 13కు చేరింది. దేశవ్యాప్తంగా సాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భారీ స్థాయిలో ఓట్ల తొలగింపులు జరిగాయని, సిఇసి జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన రాజీనామాతో పాటు నిపుణులతో కూడిన స్వతంత్ర విచారణ కమిటీని నియమించాలని పిటిషన్ ద్వారా కోరారు.
అయితే ప్రాథమిక పరిశీలనలో ఈ పిటిషన్లో కేవలం సాధారణ ప్రక్రియపరమైన 14 సాంకేతిక లోపాలు ఉన్నట్లు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ గుర్తించింది. నలుగురు ప్రధాన నేతలకు సంబంధించిన వకాలత్‌నామా పత్రాలు సమర్పించకపోవడం, పిటిషన్‌కు అనుబంధంగా జతచేసిన కొన్ని డాక్యుమెంట్లలో అక్షరాలు స్పష్టంగా లేకపోవడం , నిర్ణీత కోర్టు రుసుములో రూ.220 తక్కువగా ఉండటం వంటి నిబంధనల అంశాలను రిజిస్ట్రీ లేవనెత్తింది. పిటిషనర్ల తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాదులు తక్షణమే స్పందించి ఈ సాంకేతిక లోపాలను క్లియర్ చేసి, బకాయి కోర్టు ఫీజును చెల్లించారు.
రిజిస్ట్రీ సంతృప్తి చెందడంతో కేసును విచారణకు అర్హమైనదిగా గుర్తిస్తూ రిజిస్టర్ చేసింది. ఇటీవల సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌ను ప్రతిపక్ష నేతలు కలిసినప్పుడు న్యాయప్రక్రియ ద్వారా రావాలని సూచించడంతో ఈ పిటిషన్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తులోని రాజ్యాంగపరమైన, ప్రధాన న్యాయ అంశాల ఆధారంగా అక్టోబర్ 26న సుప్రీంకోర్టు ఇచ్చే ప్రాథమిక ఆదేశాలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.