Police Commemoration Day: పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం.. 2028 నాటికి పోలీస్ శాఖలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేస్తామని తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి..
Revanth Reddy
Police Commemoration Day: ప్రజల రక్షణ , సమాజ శ్రేయస్సు కోసం తమ ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని గోషామహల్ పరేడ్ మైదానంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సీవీ ఆనంద్‌తో కలిసి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడిన సీఎం, విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన యోధులను స్మరించుకోవడం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత అని ఉద్ఘాటించారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 155 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమైన విషయమని విచారం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు సక్రమంగా ఉంటేనే సమగ్ర అభివృద్ధి వేగవంతమవుతుందని, ఆధునిక సమాజంలో తలెత్తుతున్న నూతన సవాళ్లకు అనుగుణంగా తెలంగాణ పోలీసు శాఖ సాంకేతికంగా బలపడుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థను మరింత శక్తివంతం చేసే క్రమంలో ప్రభుత్వం ఇప్పటికే 4,773 కానిస్టేబుల్ పోస్టులతో పాటు మొత్తం 7,437 పోస్టుల భర్తీకి అనుమతులు మంజూరు చేసిందని తెలిపారు. రాబోయే 2028 నాటికి పోలీసు శాఖలో ఉన్న అన్ని ఖాళీలను విడతల వారీగా భర్తీ చేస్తామని విస్పష్ట ప్రకటన చేశారు. ఇటీవల 112 మంది డీఎస్పీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపిక చేశామని వెల్లడించారు.
దేశ రక్షణలో, హోదా ఆధారంగా పోలీసులకు చెల్లించే ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని రూ.కోటికి పైగా పెంచామని, అమరవీరుల సంక్షేమమే ధ్యేయంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని సీఎం వివరించారు. పోలీసు ఉద్యోగుల పిల్లల నాణ్యమైన విద్య కోసం ప్రత్యేకంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్కూల్‌ను అందుబాటులోకి తెచ్చామని, విధి నిర్వహణలో నిరంతరం శ్రమించే హోంగార్డుల కుటుంబాలకు కూడా సమగ్ర వైద్య భద్రత కల్పించేందుకు అవసరమైన చర్యలు వేగవంతం చేశామని చెప్పారు. వ్యవస్థలో టెక్నాలజీ వినియోగం ఎంత పెరిగినప్పటికీ, పోలీసులు ప్రజల పట్ల మానవీయ దృక్పథంతో వ్యవహరించడం మరచిపోకూడదని హితవు పలికారు.
మత్తు పదార్థాల కట్టడిలో తెలంగాణ పోలీసు శాఖ కనబరుస్తున్న ప్రతిభను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. డ్రగ్స్ నిర్మూలనలో రాష్ట్ర పోలీసు విభాగం చూపిన అత్యుత్తమ పనితీరుకు గాను జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం దక్కించుకుందని కొనియాడారు. దీంతో పాటు ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే ఆహార కల్తీపై ‘టీజీ సేఫ్’ వ్యవస్థ ద్వారా ఉక్కుపాదం మోపుతున్నామని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతల్లో ట్రాన్స్జెండర్లకు భాగస్వామ్యం కల్పించడం ద్వారా ప్రభుత్వం సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టిందన్నారు. బాధితులు, సామాన్యులు, అమాయకులకు మాత్రమే ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ వర్తిస్తుందని, నేరస్థులు, కబ్జాదారులు, డ్రగ్స్ వ్యాపారుల పట్ల మాత్రం సహించేది లేదని కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.