Jantar Mantar Restrictions: ఢిల్లీలోని జంతర్ మంతర్‌పై కేంద్రం సంచలన నిర్ణయం: నిరసన వేదికల జాబితా నుంచి తొలగింపు
Protest
Jantar Mantar Restrictions: దేశ రాజధాని ఢిల్లీలో దశాబ్దాలుగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, వివిధ వర్గాల ప్రజలు తమ నిరసనలు, ఆందోళనలను తెలియజేసే అత్యంత ప్రముఖ వేదికగా ఉన్న జంతర్ మంతర్‌పై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. వరుస ఆందోళనలు, ట్రాఫిక్ సమస్యలు, తీవ్రమైన భద్రతా కారణాలరీత్యా ఇకపై అక్కడ ధర్నాలు, నిరసనలు నిర్వహించడానికి వీల్లేకుండా జంతర్ మంతర్‌ను అధికారిక నిరసన వేదికల జాబితా నుంచి పూర్తిగా తొలగించింది.
ఈ నిర్ణయంతో నిరసనకారులు ప్రత్యామ్నాయ వేదికలను ఆశ్రయించాల్సి ఉంటుందని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళనల నిర్వహణ కోసం ప్రత్యేకంగా మూడు ప్రత్యామ్నాయ ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. అవేంటంటే:
రామ్‌లీలా మైదాన్- జంతర్ మంతర్ నుండి రామ్‌లీలా మైదాన్ వరకు దూరం – 3 కి.మీ
బురాఠీ మైదాన్ – జంతర్ మంతర్ నుండి బురారీ మైదాన్ వరకు దూరం – 20 కి.మీ.
సీబీడీ గ్రౌండ్స్- జంతర్ మంతర్ నుండి సీబీడీ (CBD) మైదాన్ వరకు దూరం – 13 కి.మీ
ఇక నుంచి అన్ని రకాల నిరసనలు, ఆందోళనలను ఈ నిర్దేశిత ప్రత్యామ్నాయ ప్రాంతాలలోనే నిర్వహించాల్సి ఉంటుందని, దీనికి సంబంధించి అనుమతులు, సమయాలు , భద్రతా ఏర్పాట్లపై పోలీసుల మార్గదర్శకాలు అత్యంత కీలకం కానున్నాయని అధికారులు పేర్కొన్నారు.
నిరసన హక్కుపై సీజేపీ నేతల ప్రశ్నలు, డెడ్‌లైన్
మరోవైపు, ఈ నిర్ణయం వెలువడిన తరుణంలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి కోరేందుకు సోమవారం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌లకు చేదు అనుభవం ఎదురైంది. పోలీసులు వారికి ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. సీజేపీ ర్యాలీకి, నిరసనకు ఎప్పుడు అనుమతి ఇస్తారో స్పష్టంగా చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అనుమతి ఇచ్చిన 24 గంటల్లోనే నిర్దేశిత వేదిక వద్ద ఆందోళన నిర్వహిస్తామని అశుతోష్ రంకా తెలిపారు.
శాంతియుత నిరసన అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని సౌరవ్ దాస్ పేర్కొన్నారు. నిరసనకు పది రోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాలని పోలీసులు చెబుతున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో తేదీ, సమయాన్ని పోలీసులే నిర్ణయించాలని తాము కోరినట్లు తెలిపారు. ఈ విషయంలో ఢిల్లీ పోలీసులకు 24 గంటల డెడ్‌లైన్ విధించినట్లు ఆయన స్పష్టం చేశారు.
రాజధాని నడిబొడ్డున ఉన్న జంతర్ మంతర్‌ను నిరసన వేదికల జాబితా నుంచి తొలగించడం పట్ల రాజకీయ, సామాజిక వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భద్రతా కారణాలరీత్యా ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన నిర్ణయం భవిష్యత్తులో ఆందోళనల నిర్వహణ తీరుతెన్నులను పూర్తిగా మార్చివేయనుంది. ప్రత్యామ్నాయ వేదికల్లో ఆందోళనలకు అనుమతులు సజావుగా లభిస్తాయా లేదా అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.