Skip to content
జాతీయం వార్తలు

Global Forgiveness Day: లౌకిక జీవితంలో క్షమాగుణంతో మానసిక ప్రశాంతత!

Prajapaksham 07 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Global Forgiveness Day: లౌకిక జీవితంలో క్షమాగుణంతో మానసిక ప్రశాంతత!

ప్రపంచ క్షమాగుణ దినోత్సవం

Global Forgiveness Day: మనకు చెడు చేసిన వ్యక్తి మన ఆదీనంలోకి వచ్చినపుడు వారిపై హానికరమైన లేదా ప్రతీకార చర్యలకు పూనుకోకుండా వదిలేయడాన్ని
‘క్షమాగుణం’, ‘మన్నించడం’, లేదా ‘క్షమ’ అంటాం. క్షమాగుణం ఓ శక్తివంతమైన ఆయుధం. క్షమాగుణంతో సంతోషం, ఆరోగ్యం సిద్ధిస్తాయి. అందువల్లనే క్షమయా సాధ్యతే సర్వమ్‌ అన్నారు పెద్దలు. తనపైకి రాయి విసిరిన వ్యక్తికి తియ్యనైన ఫలాలను ఇచ్చే వృక్షం, భూమాత ఓర్పును క్షమాగుణానికి నిలువెత్తు నిదర్శనం. ‘క్షమయా ధరిత్రి’ అని వింటున్నాం. భూ మాత క్షమాగుణానికి ప్రతీకగా నిలుస్తున్నది. పొరపాటు చేయడం మానవ సహజ గుణం. క్షమించడం దైవగుణం. మంచి పౌరులకు ఉండవలసిన గుణాల్లో క్షమాగుణం కూడా ప్రధానమైనది.
మనిషికి శాంతి, మనసుకు ప్రశాంతత కావాలి. క్షమాగుణం వల్ల మానసిక ప్రశాంతత కలగడం, అనవసర ఒత్తిడి నుంచి బయట పడడం, అనవసర గొడవలు తగ్గి మానవ సంబంధాలు మెరుగుపడడం జరుగుతుంది. సమస్త జంతువుల్లో మనిషికి మాత్రమే క్షమాగుణం ఉంటుంది. క్షమాగుణం ప్రాధాన్యాన్ని గుర్తించిన ప్రపంచ పౌర సమాజం ప్రతి ఏట 07 జూలై రోజున ప్రపంచ క్షమాగుణం దినం (గ్లోబల్‌ ఫర్గివ్‌నెస్‌ డే) పాటించడం ఆనవాయితీగా వస్తున్నది. క్షమాగుణం ప్రాధాన్యాలను అవగాహన పర్చడం, దాని ప్రయోజనాలను వివరించడం లాంటి అంశాలను చర్చించడానికి ఈ దినోత్సవం ఉపకరిస్తుంది. క్షమించే వారిని చేతకాని వాడిగా చూస్తున్న సమాజం మనది, కాని అది ఒక అసమానమైన గొప్ప గుణం అని తెలుసుకోవాలి. క్షమాగుణం లేని వారిలో ఆందోళన, ఒత్తిడి, బిపి, అసహజ భావోద్యేగాలు, ఆవేశాగ్ని, నిరాశలు పెరుగుతూ మానసిక ప్రశాంతత, జీవన సమతుల్యత లు తరుగుతాయి. 2026 ప్రపంచ క్షమాగుణం దినోత్సవం ఇతివృత్తంగా క్షమాగుణం శక్తిని తెలుసుకుందాం
(పవర్‌ ఆఫ్‌ ఫర్‌గివ్‌నెస్‌) అనే అంశాన్ని తీసుకొని ప్రచారం చేయడం
జరుగుతోంది.
క్షమించడం ఓ స్వయం నియంత్రణ:
క్షమించడమనేది ఒక స్వయం నియంత్రణ. పశ్చాత్తాప బుద్ధి కలిగిన వాడికి క్షమాగుణం విలువ తెలుస్తుంది. నటించే వారికి క్షమాభిక్ష దుష్ఫలితాలను ఇస్తుంది. దోషికి తగిన శిక్ష విధిస్తేనే అది అతడిని నిర్దోషిగా మార్చుతుంది. ఓరిమికి పరాకాష్ఠ క్షమాగుణమే. ఇది ధీరుల, జ్ఞానవంతుల లక్షణం. ఎవరు కోపగించుకున్నా తాను నిబ్బరంగా ఉంటూ, కఠినమైన మాటలు పలికినా విననట్లు జవాబు ఇవ్వకుండా ఉండడం, అవమానం పొందినా మనసులో పెట్టుకోకుండా ఉండడం, ఆ వ్యక్తిని క్షమించడం లాంటి లక్షణా లు క్షమించే వారికి ఉంటాయి. క్షమాగుణంతో పాటు సహనశీలత ఉన్న వారు దైవ సమానులుగా భావించబడుతూ, మనిషిని మహాత్మున్ని చేస్తాయి. పగ వల్ల పగ పోదని గమనించాలి.
పగపై నీళ్లు చల్లే గుణమే క్షమాగుణం. క్షమాగుణం ఉన్న వారిలో పగ, కోపం లాంటివి ఉండవు. కోపంలోనూ, పగలోనూ చేసే పనులు విధ్వంసకరంగా, అత్యంత చెడు చేసేవిగా, మానవ సంబంధాలను తుంచేవిగా ఉంటాయి. అపకారికి ఉపకారం చేయడమే క్షమాగుణం అనబడుతుంది. క్షమాగుణం ఆచరణయోగ్యమే కాని అసాధ్యం కాదు. లౌకిక జీవితంలో సుఖశాంతులకు, ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతికి ఉపయోగపడేది క్షమాగుణమే. ఓర్పు, క్షమ, శాంతి అనే గుణాలు జీవితాన్ని అర్థవంతంగా చేస్తాయి. బలహీనుడు ఎన్నడూ క్షమించలేడు, క్షమాగుణం బలవంతుడి లక్షణం. క్షమాపణ మన హృదయాలను, ఆత్మను స్వేచ్ఛగా మార్చుతుంది.