Skip to content
జాతీయం వార్తలు

బిజెపికి దూరమైన జెన్‌ జీకి భాగవత్‌ బుజ్జగింపు

Prajapaksham 11 Aug 2026 1 నిమిషాల పఠనం జాతీయం
బిజెపికి దూరమైన జెన్‌ జీకి భాగవత్‌ బుజ్జగింపు

బిజెపికి దూరమైన జెన్‌ జీకి భాగవత్‌ బుజ్జగింపు

-కె. రవీంద్రన్

భారతదేశ యువతరంతో సంభాషణను ఆరంభించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ చేసిన ప్రయత్నం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎందుకంటే, యువత తమ పరిధిలోనే హాయిగా ఉన్నారని రాజకీయ వ్యవస్థకు విశ్వాసం ఉన్నట్లయితే, ఇటువంటి జోక్యం అవసరయ్యేది కాదు. యువత తప్పుదారి పట్టలేదని, దిశా నిర్దేశం లేకుండా లేరని, వారికి ఆదేశాల కన్నా చర్చలే అవసరమని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ చేసిన వాదన బుజ్జగించినట్లుగా అనిపించవచ్చు. అయితే, పరీక్షా పత్రాల లీకేజీలతో విద్యార్థులకు, ప్రభుత్వానికి మధ్య జరిగిన అసాధారణ సంఘర్షణ తర్వాత ఇది చోటుచేసుకోవటం, అంతే స్థాయిలో రాజకీయంగా సంక్షోభ నివారణ చర్యగా కూడా కనిపిస్తోంది.

సందేశంలోని పదాల కన్నా, అది వెలువడిన సమయమే ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకుంది. పరీక్షా పత్రాల లీకేజీలపై వారాల తరబడి సాగిన యువత సమీకరణ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాను రాబట్టగలిగేంత శక్తిమంతమైన నిరసన ఉద్యమంగా పరిణమించింది. ఈ ఆందోళన ప్రారంభమైనప్పుడు ఈ ఫలితం దాదాపుగా ఊహించలేనిది. పాతుకుపోయిన రాజకీయ వ్యవస్థలకు వెలుపల కూడా తాము సంఘటితం కాగలమని, తమను అప్రతిష్టపాలు చేసే ప్రయత్నాలను ప్రతిఘటించగలమని, తమను దగాచేసి అధికారంలో కొనసాగాలని నిశ్చయించుకున్నట్లు కనిపించిన ప్రభుత్వం నుండి జవాబుదారీతనాన్ని రాబట్టగలమని యువ నిరసనకారులు నిరూపించారు.

కాబట్టి బిజెపి స్వయంగా గుర్తించడం ఆలస్యమైన ఒక రాజకీయ వాస్తవాన్ని భాగవత్‌ అంగీకరించారు; భారతదేశ యువతను రాజకీయ సందేశాలకు కేవలం శ్రోతలుగా నిరవధికంగా పరిగణించటం సాధ్యం కాదు. వారు వ్యవస్థను ప్రశ్నించినపుడు వారికి స్వేచ్ఛను నిరాకరించలేము.

ఇది నరేంద్ర మోదీ అత్యంత జాగ్రత్తగా పెంచి పోషించుకున్న రాజకీయ గుర్తింపులలో ఒకదానిపై నేరుగా దెబ్బ కొడుతుంది. దశాబ్దానికి పైగా మోదీ భారతదేశ డెమోగ్రఫిక్‌ డివిడెండ్‌ (జనాభా లబ్ది) పదేపదే ప్రస్తావిస్తూ, 2047 నాటికి దేశాన్ని వికసిత్‌ భారత్‌గా మార్చే పరివర్తనకు దేశంలోని అపారమైన యువ జనాభానే చోదక శక్తిగా చెబుతున్నారు. యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లు, డిజిటల్‌ నైపుణ్యాలు, ఆవిష్కరణలు, ఆకాంక్షలు ఆయన రాజకీయ పదజాలంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించాయి. ఎంవై భారత్‌, వికసిత్‌ భారత్‌ యంగ్‌ లీడర్స్‌ డైలాగ్‌ వంటి ప్రభుత్వ కార్యక్రమాలు, జాతీయ పరివర్తనలో యువతను భాగస్వాములుగా చూపించే ఈ కథనం చుట్టూనే రూపొందించబడ్డాయి.

ఇందులో కష్టమైనదేమిటంటే, జనాభా లబ్ది ప్రసంగాల ద్వారా సృష్టించబడదు. దానికి పనిచేసే సంస్థలు, విశ్వసనీయమైన పరీక్షలు, విస్తరిస్తున్న ఉపాధి, సామాజిక చైతన్యం, ప్రతిభకు ప్రతిఫలం లభిస్తుందనే నమ్మకం అవసరం. యువతకు, పరీక్ష పత్రం లీక్‌ అవ్వడం అనేది కేవలం ఒక పరిపాలనాపరమైన అవకతవక కాదు. ఇది సంవత్సరాల తరబడి చేసిన సన్నాహాలు, కుటుంబ పొదుపు, వ్యక్తిగత త్యాగాల విధ్వంసానికి దారితీయవచ్చు.

ఒక ప్రభుత్వం పరీక్ష వివాదాన్ని విచారణ, కొత్త చట్టం లేదా పరిపాలనా పునర్వ్యవస్థీకరణ అవసరమైన విషయంగా చూడవచ్చు. కానీ, ఆ పరీక్ష కోసం మూడేళ్లుగా సిద్ధమవుతున్న 22 ఏళ్ల యువకుడు/యువతి, తమ భవిష్యత్తు నిర్మాణం కోసం పడిన శ్రమ కూలిపోవడాన్ని చూస్తారు. జంతర్‌ మంతర్‌ ఉద్యమం ఎందుకు అంత త్వరగా రాజకీయ శక్తిని పుంజుకుందో వివరించడానికి ఈ అవగాహనా అంతరాలు సహాయపడతాయి.

రాజకీయ వ్యవస్థలోని కొన్ని వర్గాలు, అసమ్మతి తెలిపే విద్యార్థులను రాజకీయ ఆందోళన అనే సాంప్రదాయ పదజాలంతో చూడటమే అతిపెద్ద పొరపాటు. ప్రభుత్వాలు అన్నిచోట్లా వీధుల్లో నిరసనలను ఇష్టపడవు. బిజెపికి అదనపు ఇబ్బంది ఏమిటంటే, దాని రాజకీయ సంస్కృతి ప్రజల మధ్య బహిరంగ చర్చను జాతీయ ఎజెండా మద్దతుదారులకు, దానికి అడ్డుపడేవారికి మధ్య ఎక్కువగా విభజిస్తున్నది. సైద్ధాంతికమైనవి కాకుండా వ్యక్తిగతమైన మనోవేదనలు ఉన్న తరానికి ఇలాంటి ద్వంద్వ వైఖరిని వర్తింపజేసినప్పుడు అది ప్రమాదకరంగా మారుతుంది.

మోదీకి సాంప్రదాయ మీడియాను దాటవేసి ఓటర్లతో ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి సహాయపడిన అదే డిజిటల్‌ పర్యావరణ వ్యవస్థ, ఇప్పుడు యువ పౌరులకు రాజకీయ పార్టీలను దాటవేసేందుకు వీలు కల్పిస్తోంది. మరో ప్రతిపక్ష కూటమి ఆవిర్భావం కంటే ఈ పరివర్తనే బిజెపిని ఎక్కువగా ఆందోళనకు గురిచేయాలి. రాజకీయ సంస్థకు ఇకపై సాంప్రదాయ సంస్థాగత మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా అవసరం లేదని యువత సమీకరణ నిరూపించింది. పాతుకుపోయిన పార్టీలు ఏం జరుగుతుందనేది పూర్తిగా అర్థం చేసుకునేలోపే ఒక రెచ్చగొట్టే నినాదం, ఉమ్మడి ఇబ్బందులు, వికేంద్రీకృత ఆన్‌లైన్‌ సమాజం ఒక ఉద్యమాన్ని సృష్టించగలవు.

కాక్రోచ్‌ జనతా పార్టీ ఆ అవకాశాన్ని కచ్చితంగా నిరూపించింది. అది ఒక సంప్రదాయ రాజకీయ పార్టీగా మారుతుందా లేదా అనేది దాని ప్రాధాన్యత ఎన్నడూ కాదు. వాస్తవానికి ఎన్నికలలో పోటీ చేయడం కంటే ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉండటమే దాని ఆకర్షణను బాగా పరిరక్షించవచ్చు. ఇంతకుముందు కేవలం ఓటింగ్‌ వర్గంగా మాత్రమే పరిగణించబడిన ఒక తరం, తమ సొంత రాజకీయ భాషను, నాయకత్వాన్ని, సమీకరణ పద్ధతులను సృష్టించుకోగలదని నిరూపించడంలోనే దీని ప్రాముఖ్యత ఇమిడి ఉంది.

యువతకు ఆదేశాల కంటే సంభాషణే అవసరమని సంఘ్‌ నిజంగా విశ్వసిస్తే, తమ భావజాల కుటుంబానికి చెందిన ప్రభుత్వాలను యువత విమర్శించినప్పుడు ఈ సూత్రం వర్తించాలి. ఘర్షణ ఇప్పటికే రాజకీయ నష్టాలను కలిగించిన తర్వాత, ఇది కేవలం ప్రజా సంబంధాల సర్దుబాటుగా మాత్రమే పనిచేయకూడదు. అలాగే, అధికారాన్ని యువత సవాలు చేసినప్పుడల్లా వారిని రాజకీయంగా అపరిపక్వంగా పరిగణిస్తూ, వారిని ఆవిష్కర్తలుగా, పారిశ్రామికవేత్తలుగా, దేశనిర్మాతలుగా బిజెపి కీర్తించకూడదు.

అసలు సమస్య విశ్వసనీయతకు సంబంధించినది. కోట్లాది మంది యువ పౌరులు ఉండటం జాతీయ పురోగతికి దానంతట అదే పూచి ఇస్తుందన్నట్లుగా, జనాభా లబ్దిని సంవత్సరాలుగా దాదాపు ఒక ఆర్థిక అనివార్యంగా చూపిస్తూ వచ్చారు. కానీ అది వాస్తవం కాదు. అవకాశాల కంటే ఆకాంక్షలు వేగంగా విస్తరించినప్పుడు, తమ భవిష్యత్తును నిర్దేశించే సంస్థలు కనీస న్యాయానికి కూడా హామీ ఇవ్వలేవని విద్యావంతులైన పౌరులు గ్రహించినప్పుడు, ఈ జనాభా లబ్ది ఒక జనాభా భారంగా మారగలదు.

తమ జీవితాంతం ‘వికసిత్‌ భారత్‌’ వాగ్దానాలను వింటూ, ఆ వాగ్దానం చేయబడిన భవిష్యత్తులో తమ స్థానం ఏమిటని ప్రశ్నించడం ప్రారంభించిన యువతను ఇప్పుడు రాజకీయ వ్యవస్థ ఎదుర్కొంటోంది.

భారతదేశ యువత ఇకపై కేవలం రాజకీయ నాయకులు వేదికల నుండి ప్రస్తావించే జనాభా లబ్ది మాత్రమే కాదు. వారు తమ సమస్యలను నిర్వచించుకోగల, తమ పోరాటాలను ఎంచుకోగల, ప్రభుత్వాలు స్పందించేలా ఒత్తిడి చేయగల స్వయంప్రతిపత్తి గల రాజకీయ వర్గంగా ఎదుగుతున్నారు. దేశ భవిష్యత్తుగా కీర్తించబడటం నుంచి, దాని వర్తమానంలో తమ గొంతుకను వినిపించాలని డిమాండ్‌ చేసే స్థాయికి మారడం అనేది ఎంతో ముఖ్యమైన అంశం. వారికి చేరువయ్యేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి చేసిన ప్రయత్నంలోని ఏ ఇతర విషయం కన్నా ఇది చాలా ఎక్కువ పర్యవసానాలకు దారితీయవచ్చు.