స్వాతంత్య్ర పోరాటంలో ఎఐఎస్‌ఎఫ్ ఉజ్జ్వల పాత్ర
స్వాతంత్య్ర పోరాటంలో ఎఐఎస్‌ఎఫ్ ఉజ్జ్వల పాత్ర
-శ్రీమతి కృష్ణ ఝా
ఈరోజు (ఆగస్టు 12) అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎఐఎస్‌ఎఫ్) 90వ వార్షికోత్సవం. 1936లో సంస్థాపన దినం నుంచీ అది జాతీయ స్వాతంత్య్ర ఉద్యమంలో పాలు పంచుకుంది. 84 సంవత్సరాల క్రితం, 1942 ఆగస్టు 9న క్విట్ ఇండియా ఉద్యమం ఆరంభం కాగా, ఎఐఎస్‌ఎఫ్ అందులో అగ్రశ్రేణి పాత్ర పోషించింది.
సింథ్‌లో అరెస్ట్ చేసి ఉరికంబానికి పంపబడిన తొలి ఆగస్టు తిరుగుబాటుదారుల్లో ఒకరు ఎఐఎస్‌ఎఫ్ కార్యకర్త. అతని పేరు హేము కలానీ. సింథ్‌లోని సుక్కూర్‌లో స్కూల్ విద్యార్థి; సుక్కూర్ విద్యార్థి యూనియన్‌లో క్రియాశీల కార్యకర్తల్లో ఒకడు. ఆ ప్రాంతంలో ఎఐఎస్‌ఎఫ్ ఆ యూనియన్ మాటున పనిచేసింది. బ్రిటిష్ పాలకులు 1942 ఆగస్టు 24 రాత్రి హేమును అరెస్టు చేశారు. అటు తరువాత అతనికి ఉరిశిక్ష విధించబడింది. 1943 జనవరి 21 ఉరితీశారు. ఆ సమయంలో అతని పెదవులు ఇంక్విలాబ్ జిందాబాద్ అని ఉచ్ఛరించాయి. సింథ్‌లో ప్రతి ఇల్లు అతని పేరు తలచుకుంది. జోథ్‌పూర్‌లో ఒక బహిరంగ కూడలికి హేము కలానీ చౌక్ అని పేరు పెట్టారు.
అమర జీవుల జాబితాలో చేరుతున్న బాలురు, బాలికల ప్రవాహం త్వరలోనే అనంతం కావటంతో వరదగేట్లు తెరుచుకున్నాయి. అది చారిత్రాత్మక ఘటనగా మారి యావద్దేశాన్నీ కుదిపివేసింది. యుపి (అప్పుడు యునైటెడ్ ప్రావిన్సెస్) ఉద్యమానికి ప్రధాన కేంద్రమైంది.
ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రముఖుల్లో సర్జూపాండే ఒకరు. ఆయన, రామాసింగ్ తదితర అనుచరులతో 1942 ఆగస్టు 15న కాశిమాబాద్ పోలీస్ స్టేషన్ చేరుకుని, అక్కడున్న పోలీస్ అధికారి మీద ఒత్తిడి తెచ్చి అతని చేత యూనియన్ జాక్ పతాకం దించి త్రివర్ణ పతాకం ఎగుర వేయించారు. వారు అక్కడున్న తుపాకులన్నీ తీసుకుని అంతర్థానమైనారు. కాశిమాబాద్ పోలీస్ స్టేషన్‌పై వారం రోజుల పాటు మువ్వన్నెల పతాకం ఎగిరింది.
సర్జూపాండే కనిపిస్తే కాల్చివేయాలని ఉత్తర్వులు జారీ అయినాయి. ఆ ఘటన ప్రతిచోటా కథలుగా చెప్పుకోబడింది. సర్జూ, అతని అనుచరులు ఒక గ్రామంనుంచి మరో గ్రామానికి మారుతూ చాలాకాలం అజ్ఞాత జీవితం గడిపారు. గ్రామస్థులు ఎన్నడూ ఆయన్ను అప్పగించలేదు. పోలీస్‌లు వారి కుటుంబాలను వేధించసాగారు.
కొద్ది మాసాల తర్వాత సర్జూ, సుశుండి గ్రామంలో సహచరుడు రామాసింగ్‌తో పాటు అరెస్టు అయినాడు. సర్జూను ముందుగా ఘాజీపూర్ జైలుకు, అక్కడినుంచి బెనారస్, ఇతర జైళ్లకు పంపారు. అధికారులు అతని పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఒంటరి జైలు గదిలో బంధించారు, సంకెళ్లు వేశారు, పాశవికంగా దెబ్బలు కొట్టారు. పిండి మిల్లులో బలవంతంగా పనిచేయించారు. పేము బెత్తంతో స్పృహకోల్పోయేవరకు కొట్టినప్పుడల్లా ఆయన ‘భారత్ మాతాకీ జై’, ‘వందేమాతరం’ అని నినదించాడు. తన కేసు తానే వాదించుకున్నాడు. అన్ని ఆరోపణలూ అంగీకరించాడు. ఆయనకు 42 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, భారీ జుల్మానా విధించబడినాయి.
రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఎఐఎస్‌ఎఫ్ కార్యకర్తలు అదే రీతిన తిరగబడ్డారు. బెనారస్ హిందూ యూనివర్సిటీ (బిహెచ్‌యు)లో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పడంతో సైన్యాన్ని రప్పించారు. సైన్యం ఎనిమిది రోజులు తిష్టవేసింది. రెండు ఎస్‌ఎఫ్ సంఘాలకు కాంగ్రెస్‌కు చెందిన షా గ్రూపు, భారత కమ్యూనిస్టు పార్టీకి చెందిన మ్రుఖీం ఫారూఖీ గ్రూపుకు చెందిన విద్యార్థులు ఐక్యంగా పనిచేశారు. వారు కలిసికట్టుగా పనిచేశారు, కలిసికట్టుగా లాఠీలు, తూటాలు ఎదుర్కొన్నారు, జైలుకెళ్లారు.
బిహెచ్‌యుకు చెందిన ఎస్‌ఎఫ్ సంఘాలు తమ కార్యకలాపాలను త్వరలోనే వారణాసి నుంచి ఘాజీపూర్‌కు విస్తరించారు. విశ్వనాథ్ సింగ్ అనే ఎఐఎస్‌ఎఫ్ కార్యకర్త జిల్లా కేంద్రంలోని కొత్వాలీకి విద్యార్థులతో పెద్ద ప్రదరన తీశారు. ఫిరోజాబాద్‌కు చెందిన ఓం ప్రకాశ్ పలీవాల్ ఆత్మగౌరవం రక్షణకు ప్రాణత్యాగాలు చేయండి, తర్వాతి తరాలు మిమ్ము స్మరించుకుంటాయి అని విద్యార్థులకు పిలుపుయిచ్చారు. ఆ తదుపరి కాలంలో పలీకాల్ ఎఐఎస్‌ఎఫ్ (ఫారూఖీ) ప్రముఖ నాయకునిగా ఎదిగారు.
క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైనప్పుడు, బిహార్లో చంద్రశేఖర సింగ్, రాహుల్ సాంకృత్యాయన్, ఇంద్రదీప్ సిన్హా సహా ఎఐఎస్‌ఎఫ్ నాయకుల్లో అత్యధికులు నౌగాఛియాలో జరుగుతున్న ఎఐఎస్‌ఎఫ్ భాగల్పూర్ జిల్లా మహాసభలో ఉన్నారు. మహాసభ రెండురోజులు కొనసాగింది. చర్చల్లో క్విట్ ఇండియా ఉద్యమం ప్రాధాన్యం వహించింది. వారి నౌగాఛియాలో ఉండగా గాంధీజీ అరెస్టు వార్త అందింది. చంద్రశేఖరసింగ్, ఆయన మిత్రులు ఆ మరునాడే పట్నా చేరారు. గాంధీజి, ఇతర జాతీయ నాయకుల అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ ఎఐఎస్‌ఎఫ్ ఒకరోజు సమ్మె పిలుపుయిచ్చింది.
ఆగస్టు 12న, బిహార్ ఎఐఎస్‌ఎఫ్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర సింగ్ నాయకత్వంలో విద్యార్థులు సచివాలయం వద్ద పెద్ద ప్రదర్శన నిర్వహించారు. బ్రిటీష్ ప్రభుత్వం లాఠీచార్జీకి, కాల్పులకు ఒడిగట్టింది. ఏడుగురు విద్యార్థులు అమరులైనారు, అనేక మంది గాయపడ్డారు. ఎఐఎస్‌ఎఫ్ కార్యకర్తలు వారిని ఆసుపత్రికి మోసుకెళ్లారు. కార్యానంద శర్మ, సంత్ లాల్ సింగ్, భోగేంద్రఝా, తేజ నారాయణ్ తదితర అనేకమంది ఎఐఎస్‌ఎఫ్ నాయకులను అరెస్టు చేశారు, జైలుకు పంపారు.
చంద్రశేఖర సింగ్ గాక, బిహార్‌లో విద్యార్థుల నిరసన ఆందోళనలకు నాయకత్వం వహించిన ఎఐఎస్‌ఎఫ్ ప్రముఖ కార్యకర్తల్లో కృష్ణచంద్ర చౌదరి, చతురానన మిశ్రా, గంగాధర్ దాస్, జైమంగళ్‌సింగ్, డాక్టర్ రాం విలాస్ శర్మ, సియావర్ షరన్ తదితరులున్నారు. రాష్ట్రంలో పోలీస్‌లు మొత్తం 122 చోట్ల కాల్పులు జరిపారు. బెగుసరాయ్ జిల్లాలోని బిహత్‌లో ప్రజలు పోలీస్‌లతో హోరాహోరీ పోరాటం చేశారు. బిహత్ మధ్య రోడ్డుపై పోలీస్‌ల కాల్పుల్లో యుచిత్ సింగ్ అనే విద్యార్థి అమరుడైనాడు.
స్వాతంత్య్ర పోరాటంలో ఎఐఎస్‌ఎఫ్ పాల్గొనటానికి గొప్ప ఉదాహరణల్లో ఒకటి సతారాలో క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా నానా పటేల్ ఏర్పాటు చేసిన పత్రీ సర్కార్. ఎఐఎస్‌ఎఫ్‌కు చెందిన విద్యార్థి కార్యకర్తలు, ఆరు, ఏడు తరగతులవరకు చదువుకున్న రైతులు. ఈ ఉద్యమ రహస్య జీవిత కార్యకర్తల్లో అత్యధికంగా ఉన్నారు. 1946 జనవరి వరకు కొనసాగిన పత్రీ సర్కార్ దాని సామాజిక, వ్యవస్థాగత, పరిపాలనాత్మక, న్యాయ కృషితో ఆ ప్రాంతంపై, జాతీయోద్యమంపై గాఢమైన ముద్రవేసింది. ఈ చరిత్రాత్మక ఉద్యమంలో విద్యార్థులు, యువజనులు చెప్పుకోదగ్గ దోహదం చేశారు.
అహింసాయుత మార్గంలో పనిచేయటం ప్రారంభించిన సంఘాల్లో కొన్ని 1942 ఉద్యమంలో హింసాయుత పద్ధతులు చేబట్టాయి. ‘పరిస్థితులు బట్టి పద్ధతులు ఉపయోగించాలి’ అన్న గాంధీజీ ప్రకటనను అవి ఉపయోగించుకున్నాయి. ఆ విధంగా, పులిన్ బెహారీ సేన్ అనే ఎఐఎస్‌ఎఫ్ క్రియాశీల కార్యకర్త ఖెజురీలో మిలిషీయాను నడిపాడు. దాని రహస్య కార్యకర్తలు యువకులకు లాఠీలు, కత్తులు ఉపయోగించటంలో శిక్షణ యిచ్చారు, విప్లవ సాహిత్యం పంపిణీ చేశారు.
అహ్మదాబాద్‌లో ఎఐఎస్‌ఎఫ్ కార్యకర్త, కాంగ్రెస్ సోషలిస్టుపార్టీ నాయకుడు కూడా అయిన జయంతి ఠాకోర్ తన “ఆజాద్ ప్రభుత్వం” నుంచి గృహ యజమానులకు ఆదేశం జారీ చేశాడు: ‘ప్రతి ఒక్క ఇంటి యజమాని జాతీయోద్యమ నిధికి అణా చొప్పున (16 అణాలు ఒక రూపాయి) చెల్లించాలి”. ఆ విధంగా 50 రూపాయలు సేకరించాడు. అతడు త్వరలోనే అహ్మదాబాద్ నగర అధిపతి (హెడ్)గా ప్రజాదరణ పొందాడు. ఆయన కింద “పోల్ నాయక్‌లు” ఉన్నారు. కులప్రాతిపదికపై ఏర్పడిన నివాస ప్రాంతాలను “పోల్” అని పిలిచేవారు. వారు వాటికి నాయకులు. ఆయన పర్యవేక్షణ కింద 19 మంది నాయకులు 14 నగర వార్డులు వ్యవహారాలు చూశారు.