పారిశుద్ధ్య కార్మికులు మనుషులు కారా?
Labour Protest
ఎస్వీఆర్
భారతదేశంలో మాన్యువల్ స్కావెంజింగ్‌ను నిషేధించి మూడు దశాబ్దాలకు పైగా గడిచింది. సెప్టిక్ ట్యాంకు లు, మురుగు కాలువలను యంత్రాలతోనే శుభ్రం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని ప్రకటించి మూడేళ్లు దాటింది. సుప్రీంకోర్టు కూడా పలుమార్లు ‘ఏ మనిషినీ మురుగు కాలువలోకి దింపకూడదు’ అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ దేశంలో ప్రతి కొన్ని రోజులకు ఒక పారిశుద్ధ్య కార్మికుడు విషవాయువులకు బలవుతున్నాడు. చట్టాలు, ప్రభుత్వ పథకాలు, న్యాయస్థానాల ఆదేశాలు ఒకవైపు ఉంటే, నేలమీద జరుగుతున్న వాస్తవం మరోవైపు కనిపిస్తోంది. ఈ పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఈనెల 4న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సఫాయి కర్మచారి ఆందోళన్(ఎస్‌కెఎ) ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు, మురుగు కాలువల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన చేపట్టారు. ‘మమ్మల్ని చంపడం మానుకోండి’ అనే నినాదంతో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల మరణాలను అరికట్టడంలో విఫలమైందని ఆరోపిస్తూ ప్రధానమంత్రి దేశానికి క్షమాపణ చెప్పాలని, మురుగు కాలువల్లో మనుషులను దింపే పద్ధతిని పూర్తిగా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వారి ఆందోళన సహేతుకం. అత్యవసరం కూడా. ఎంతోమంది కార్మికులు మృతి చెందుతున్నా, ప్రభుత్వాల నుంచి స్పందన లేకపోవడం, కనీస ఆసరా కూడా కనిపించకపోవడం దుర్మార్గం. ఈ ఉద్యమంలో అత్యంత ఆందోళనకరమైన అంశం మరణాల సంఖ్యలో కనిపిస్తున్న వ్యత్యాసం.
సఫాయి కర్మచారి ఆందోళన్ సేకరించిన వివరాల ప్రకారం 2021 జనవరి నుంచి 2026 జులై వరకు దేశవ్యాప్తం గా 593 మంది సెప్టిక్ ట్యాంకులు, మురుగు కాలువలు శుభ్రం చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇదే కాలానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో అంగీకరించిన సంఖ్య332 మాత్రమే. అంటే 261 మంది మరణాలు అధికారిక లెక్కల్లోనే కనిపించడం లేదని ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారు. ఎస్‌కెఎ ప్రకారం 2021లో 47 మంది, 2022లో 93 మంది, 2023లో 102 మంది, 2024లో 117 మంది, 2025లో 121 మంది, 2026 జులై వరకు మరో 113 మంది మరణించారు. జులై ఒక్క నెలలోనే 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సంస్థ పేర్కొంది. అంటే పరిస్థితి మెరుగుపడడం కాదు, మరింత దిగజారుతోందని వారి వాదన. ప్రభుత్వం ఈ మరణాలను ‘పని సమయంలో జరిగిన ప్రమాదాలు’ గా పేర్కొంవడం విడ్డూరం. ఇవి ముమ్మాటికీ ప్రమాదాలు కావు, చట్టవిరుద్ధంగా మనుషులను విషవాయువులతో నిండిన మురుగు కాలువల్లోకి దింపడం వల్ల జరిగే నివారించగల మరణాలు. భారత రాజ్యాంగంలోని సమానత్వ హక్కు (ఆర్టికల్ 14), అంటరానితన నిర్మూలన (ఆర్టికల్ 17), జీవించే హక్కు (ఆర్టికల్ 21) లను ఈ మరణాలు ఉల్లంఘిస్తున్నాయి. చట్టాలు ఉన్నప్పటికీ వాటి అమలు జరగకపోవడం వల్లే ప్రతి మరణం రాజ్యాంగ వైఫల్యం గా మారుతోందన్న ఎస్‌కెఎ వాదనలో నిజం లేకపోలేదు. అంతేకాదు, పారిశుద్ధ్య పనులు ఇప్పటికీ ప్రధానంగా దళిత వర్గాల భుజాలపైనే ఉండడం యాదృచ్ఛికం కాదని, అది శతాబ్దాల కులవివక్ష కొనసాగింపేనని సామాజిక ఉద్యమకారులు పేర్కొంటున్నారు. పరిశుభ్రత గురించి గొప్పగా మాట్లాడే సమాజం, ఆ పరిశుభ్రత కోసం ప్రాణాలు పణంగా పెట్టే కార్మికుల భద్రత విషయంలో మాత్రం మౌనం గా ఉంటోందని వారు విమర్శిస్తున్నారు. మురుగు కాలువల్లో మరణిస్తున్నవారు ఎక్కువగా దళితులే కావడం వల్లే ఈ విషాదాలకు తగిన ప్రాధాన్యం లభించడం లేదని ఎస్‌కెఎ నాయకులు ఆరోపిస్తున్నారు. అందుకే ఈ సమస్యను కేవలం కార్మిక భద్రత అంశంగా కాకుండా సామాజిక న్యాయం కోణంలో కూడా చూడాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఈ మరణాలకు సంబంధించిన గణాంకాల వెనుక ఎన్నో కుటుంబాల విషాదం దాగి ఉంది. 2009లో ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ మరణించిన అశోక్ కుమార్ కుటుంబ సభ్యురాలు సత్యవతి జంతర్ మంతర్ నిరసనకు హాజరై తన బాధను పంచుకున్నారు. ‘పనికి వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి రాలేదు. పదిహేడేళ్లు గడిచినా న్యాయం జరగలేదు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరో పారిశుద్ధ్య కార్మికుడు పాలేరాం చెప్పిన అనుభవం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలియజేస్తుంది. ఇరవై ఐదేళ్లుగా సెప్టిక్ ట్యాంకులు శుభ్రం చేస్తున్న తనకు ఎలాంటి శిక్షణ ఇవ్వలేదని, కొన్నిసార్లు చేతి తొడుగులు కూడా లేకుండానే ట్యాంకుల్లోకి దిగాల్సి వచ్చేదని చెప్పారు. ఇటీవల ట్యాంకులో జారి కాలు విరిగినా జీవనోపాధి కోసం అదే పని కొనసాగిస్తున్నానని ఆయన వాపోయారు. ఇలాంటి అనుభవాలు ఎన్నో. పారిశుద్ధ్య కార్మికులకు జరుగుతున్న నష్టం ఎంతో. చట్టాలు ఉన్నప్పటికీ, కోర్టులు తీర్పులు ఇచ్చినప్పటికీ, వారి పరిస్థితులు మెరుగుపడడం లేదు. జీవితాల్లో వెలుగులు నిండడం లేదు. 1993లోనే మాన్యువల్ స్కావెంజింగ్‌ను నిషేధిస్తూ మొదటి చట్టం వచ్చింది. తర్వాత 2013లో మరింత కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చి మాన్యువల్ స్కావెంజింగ్ ను నేరంగా ప్రకటించారు. పునరావాసానికి కూడా నిబంధనలు రూపొందించారు. అయినప్పటికీ అమ లు మాత్రం ఆశించిన స్థాయి లో జరగలేదు. 2023లో కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్’ (ఎన్‌ఎఎంఎఎస్‌టిఇ/నమస్తే) పథకాన్ని ప్రారంభించింది. దాదాపు రూ. 350 కోట్లతో యంత్రాల ద్వారా మాత్రమే మురుగు కాలువలను శుభ్రం చేస్తామని ప్రకటించింది. అయితే మూడు సంవత్సరాలు గడిచినా చాలా ప్రాంతా ల్లో యంత్రాల స్థానంలో మనుషులనే ఉపయోగిస్తున్నారని ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. పథకం లక్ష్యం నెరవేరలేదని, దానిని పునర్వ్యవస్థీకరించాలని వారు కోరుతున్నా రు. ఈ సమస్యపై సుప్రీంకోర్టు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 2023లో మురుగు కాలువల్లో మరణించిన వారికి పరిహారాన్ని రూ.30 లక్షలకు పెంచింది. 2025లో ఆరు మహానగరాల్లో మాన్యువల్ మురుగు కాలువ శుభ్రపరిచే విధానాన్ని పూర్తిగా నిషేధించాలని ఆదేశించింది. అయినా మరణాలు ఆగకపోవడంతో ఇటీవల పలువురు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తన ఆదేశాలు అమలు కాకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభిస్తామని హెచ్చరించింది. అంటే న్యాయవ్యవస్థ కూడా ప్రభుత్వ యంత్రాంగం పనితీరు పై తీవ్ర అసంతృప్తితో ఉందని ఈ పరిణామాలు సూచిస్తున్నా యి.
ఇలాంటి పరిస్థితుల్లో ఎస్‌కెఎ కేవలం పరిహారం మాత్రమే కోరడం లేదు. దేశంలో జరిగిన అన్ని మురుగు మరణాల నిజమైన సంఖ్యను ప్రభుత్వం వెల్లడించాలని, ప్రధానమంత్రి దేశానికి క్షమాపణ చెప్పాలని, మురుగు కాలువల్లో మనుషులను దింపే విధానాన్ని పూర్తిగా నిషేధించాలని, ఈ మరణాలపై పార్లమెంటరీ కమిటీతో విచారణ జరపాలని, కాలపరిమితితో కూడిన జాతీయ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేస్తున్నది. పారిశుద్ధ్య కార్మికుల మరణాలను కార్మిక భద్రత వైఫల్యం ప్రమాదాలుగా చూడడం సమంజసం కాదు. వాస్తవానికి అవి చట్టాల అమలులోని లోపాలను, కులవివక్ష కొనసాగింపును, పరిపాలనా
నిర్లక్ష్యాన్ని, మానవ గౌరవం పట్ల సమాజం చూపుతున్న
ఉదాసీనతను బయటపెడుతున్నాయి. ప్రతి మరణం ఒక కుటుంబాన్ని శాశ్వత విషాదంలోకి నెట్టేస్తోంది. అదే సమయంలో రాజ్యాంగం హామీ ఇచ్చిన జీవించే హక్కును ప్రశ్నార్థకం చేస్తోంది. పరిశుభ్రమైన నగరాలు, స్వచ్ఛమైన గ్రామాలు కావాలంటే వాటికోసం పనిచేసే కార్మికుల ప్రాణాలకు ముందు విలువ ఇవ్వాలి. యంత్రాలు అందుబాటులో ఉన్న కాలంలో ఇప్పటికీ మనుషులను విషవాయువులతో నిండిన గుంతల్లోకి దింపడం నాగరిక సమాజానికి తగదు. చట్టాలు చేయడం మాత్రమే సరిపోదు. వాటిని కచ్చితంగా అమలు చేయడం, బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడం, పూర్తిస్థాయి యాంత్రీకరణ చేపట్టడం, పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించడం ద్వారా మాత్రమే ఈ మరణాలకు శాశ్వత ముగింపు పలకగలం. అప్పటివరకు ప్రతి కొత్త మరణం ఒక వ్యక్తి ప్రాణనష్టమే కాదు, భారత రాజ్యాంగం ముందు నిలిచే మరో బాధాకరమైన ప్రశ్నగానే మిగులుతుంది.
- IOCL Jobs: ఐఓసీఎల్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ 2026: 470 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- Criminalisation of Politics: సీఎం రేవంత్ రెడ్డిపై 89 కేసులు.. 14 మంది సీఎంలపై క్రిమినెల్ కేసులు.. షాకిస్తున్న ప్రజాప్రతినిధుల కేసులపై తాజా గణాంకాలు
- సంబరాల ఏటిగట్టు షూటింగ్ పూర్తి-జనవరి 12 రిలీజ్
- బల్లగుద్ది చెబుతున్నా.. ‘ఇరుముడి’ మీకు తెగ నచ్చేస్తుంది:
- పారిశుద్ధ్య కార్మికులు మనుషులు కారా?