విద్యార్థి ఉద్యమాల రథసారథి ఎఐఎస్‌ఎఫ్
AISF
‘స్వాతంత్య్రం మా జన్మ హక్కు’ అంటూ, స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న ఏకైక విద్యార్ధి సంఘం అఖిల భారత విద్యార్ధి సమాఖ్య ఏఐఎస్‌ఎఫ్. భారత దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం లక్ష్యంగా విద్యార్థులను చైతన్యపరిచిన ఘనత ఈ సంఘానిది. స్వాతంత్య్ర ఉద్యమ నేపథ్యంలో అక్కడక్కడ ఎవరికి వారుగా పోరాడుతున్న విద్యార్థులను ఐక్యంచేసి జాతీయ స్థాయిలో ఏర్పడ్డ తొలి విద్యార్ధి సంఘం ఏఐఎస్‌ఎఫ్. 90సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏఐఎస్‌ఎఫ్ లో పని చేసి చాలా మంది పార్లమెంటు సభ్యులుగా, మంత్రులుగా, ఎమ్మెల్యే లుగా ఎదిగారు. వి.పి.సింగ్, అటల్ బిహారీ వాజ్ పాయ్, ఐ.కె.గుజ్రాల్ లాంటి వారు ఏఐఎస్‌ఎఫ్ నుండే రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. ఏఐఎస్‌ఎఫ్ లో పని చేసిన వారు ఎంతో మంది నేడు ప్రొఫెసర్లుగా, ఉపాధ్యాయులుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, జర్నలిస్టులుగా, మేధావులుగా సమాజంలో సేవలు అందిస్తున్నారు.
1936 ఆగస్ట్ 12న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో ఏఐఎస్‌ఎఫ్ ఏర్పడింది.ఈ మంగళవారం నాడు 91వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా నాటి చరితను ఒక్కసారి మననం చేసుకుందాం.స్వాతంత్య్రోద్యమంలో అంతకుముందు విద్యార్థులు ఉద్యమించినప్పటికీ, దేశ వ్యాప్తంగా జాతీయ స్థాయి లో సంఘటిత విద్యార్ధి సంఘం అవసరం అని భావించి ఉత్తర ప్రదేశ్ డిగ్రీ విద్యార్థులు ప్రేమ్ నారాయణ భార్గవ్, బబురుద్దీన్ లు 12 రాష్ట్రాలలో ఉద్యమాలు చేస్తున్న విద్యార్థులకు ఈ విషయం పై ఉత్తరాలు రాసారు. ఈ నేపథ్యంలో 1936 జులై 30 న ఆహ్వాన సంఘం సమావేశం జరిగింది. ఆగస్ట్ 12,13 తేదీలలో మహాసభ నిర్వహించాలని నిర్ణయించారు. 1936 ఆగస్ట్ 12న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో లో గంగా ప్రసాద్ మెమోరియల్ హాల్ నందు జరిగిన తొలి జాతీయ స్థాయి విద్యార్థి సంఘ మహాసభకు 11 రాష్ట్రాల నుండి 200 శాఖల ద్వారా 916 మంది విద్యార్ధి ప్రతినిధులు హాజరయ్యారు. వీరంతా ఒకటి, రెండు, పది, ఇరవై రూపాయలతో టిక్కెట్లను కొనుక్కొని మరీ మహాసభలో పాల్గొనడం గమనార్హం. మహాసభ ప్రారంభ ఉపన్యాసం జాతీయ ఉద్యమ నాయకులు జవహర్ లాల్ నెహ్రూ చేసారు. మహమ్మద్ అలీ జిన్నా అధ్యక్షత వహించారు. గాంధీ, రవీంద్ర నాథ్ ఠాగూర్, తేజ్ బహదూర్ లు సందేశాలు పంపారు. ఆ విధంగా ఎఐఎస్‌ఎఫ్ అనేది వివిధ జాతీయ ధోరణుల కలయికతో ఏర్పడింది.దీనికి సంబంధించిన ఆలోచనను పి.సి. జోషి, నెహ్రూ, బోస్, ఇతర నాయకులు కలిసి రూపొందించారు. తద్వారా ఎఐఎస్‌ఎఫ్ స్వాతంత్య్ర ఉద్యమపు ఉత్తమ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లింది. ప్రపంచ దేశాల్లో మార్పు కోసం పోరాటం జరుగుతున్నాయని, విద్యార్థులు గమనించి దేశంనుంచి బ్రిటిష్ వాళ్ళని పారద్రోలేందుకు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనాలని నెహ్రూ తన తొలి ప్రసంగంలో పిలుపునిచ్చారు. ప్రేమ్ నారాయణ భార్గవ్ ఈ సంఘం మొదటి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
విద్యార్థులను చైతన్యం చేసేందుకు దేశంలో నాలుగు పత్రికలు అవసరం అని భావించిన ఈ సంఘం లాహోర్ నుండి ‘స్టూడెంట్ ట్రిబ్యునల్’, నాగ్ పూర్ నుండి ‘ది స్టూడెంట్స్’, బొంబాయి నుండి ‘స్టూడెంట్ కాల్’, కలకత్తా నుండి ‘ఛాత్ర ఆభిజాన్’ పత్రికలు ముద్రించి విద్యార్థులకు అందించింది. 1937లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి విద్యార్ధి సంఘం మద్దతు ఇచ్చింది. 1937లో భారత దేశంలో వరల్ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు జేమ్స్ క్లబ్ మెన్ ఇక్కడ ఏఐఎస్‌ఎఫ్ నిర్వహిస్తున్న ఉద్యమాలను అభినందించారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో విద్యార్థులు వేలాది మంది పాల్గొన్నారు. బొంబాయి, కలకత్తా, మద్రాస్, ఢిల్లీ, హైదరాబాద్ వివిధ పట్టణాలలో విద్యార్ధి ఉద్యమాలు ఉధృతమయ్యాయి. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో జాతీయ జెండా ఎగురవేసేందుకు నిజాం పాలకులు అడ్డు పడ్డా, వందలాది పోలీసులతో కాపలా పెట్టిన ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేయడం జరిగింది.
‘శాంతి, అభ్యుదయం, చదువుతూ- పోరాడు చదువుకై -పోరాడు’ అనే నినాదంతో, శాస్త్రీయ విద్యా విధానం కోసం, విద్యారంగానికి బడ్జెట్‌లో పాలకులు తగిన నిధులు ఇవ్వాలని ఏఐఎస్‌ఎఫ్ పోరాడుతుంది. దేశంలో ఈశాన్య రాష్ట్రాలలో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఏఐఎస్‌ఎఫ్ పోరాడింది. పంజాబ్ లోని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడి అనేక మంది ఏఐఎస్‌ఎఫ్ విద్యార్ధి నాయకులు ప్రాణాలు అర్పించారు.
తెలంగాణలో ఏఐఎస్‌ఎఫ్ చరిత్ర సాయుధ రైతు పోరాటం నుంచే మొదలైంది. ఇది స్వాతంత్య్రానికి ముందు, నిజాం పాలనలో జరిగిన ఉద్యమం. రజాకార్ల నియంతృత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆయుధాలతో పోరాటంలో పాల్గొన్నారు. 1966లో విశాఖ ఉక్కు హక్కు అంటూ పోరాడింది ఏఐఎస్‌ఎఫ్. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పడిన ఉక్కు సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యమం నడిచింది. ఆంధ్రప్రాంతంలో ఉధృత పోరాటంపై పోలీసుల కాల్పుల్లో 32 మంది విద్యార్థులు మరణించారు. 2002 జనవరి 19న నల్గొండ జిల్లాలో మతోన్మాద ఏబివిపి గుండాలు ఏఐఎస్‌ఎఫ్ నాయకుడు బొడ్డుపల్లి శేఖర్‌ని హత్య చేసారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మద్దతు తెలిపిన మొదటి జాతీయ విద్యార్ధి సంఘం ఏఐఎస్‌ఎఫ్. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు అనేక పోరాటాలు, లాఠీ చార్జీలు, కేసులు ఎదుర్కొని జైలు జీవితాలు గడిపారు. 2014 లో రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, రాష్ట్రంలో ప్రభుత్వ విద్య బలోపేతం చేయాలని, పేద విద్యార్థులందరికీ విద్య అందుబాటులో ఉండాలని, విద్య కాషాయీకరణ, ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు చేస్తున్న సంఘం ఎఐఎస్‌ఎఫ్. రానున్న కాలంలో మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యారంగంలో ప్రభుత్వాలు తీసుకొస్తున్న కొత్త సవాళ్లను ఎదుర్కొంటూ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థులకు అండగా ఉంటుంది. ఈ 91 వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఏఐఎస్‌ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్, రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్ట్ 12 నుండి 30 వరకు వార్షికోత్సవాలు నిర్వహిస్తుంది. ఏఐఎస్‌ఎఫ్ పూర్వ నాయకులకు, ప్రస్తుత నాయకులకు, కార్యకర్తలకు 91వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.